తాట తీయండి.. | put ironpit on drugs and adulteration, cm kcr to officers | Sakshi
Sakshi News home page

తాట తీయండి..

Published Mon, Jul 17 2017 2:06 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

తాట తీయండి.. - Sakshi

తాట తీయండి..

- డ్రగ్స్, కల్తీలపై ఉక్కుపాదం మోపండి: సీఎం కేసీఆర్‌
- మంత్రులు.. నేతలు.. ఎవరున్నా సరే కేసులు పెట్టండి
- అక్రమార్కులు భయపడేలా చర్యలుండాలి
- హైదరాబాద్‌ను డ్రగ్స్‌ రహిత నగరంగా మార్చండి
- బ్రాండ్‌ ఇమేజీ కాపాడటం అత్యవసరం
- గుడుంబా 95% పోయింది.. ఇది వంద శాతం కావాలి
- బాగా పనిచేసే పోలీసులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
- డ్రగ్స్‌ కేసుపై పోలీస్, ఎక్సైజ్‌ అధికారులతో సీఎం సమీక్ష


సాక్షి, హైదరాబాద్‌

డ్రగ్స్, కల్తీల నియంత్రణ విషయంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోలీసు, ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు. అన్ని కోణాల నుంచి లోతుగా దర్యాప్తు చేయాలని సూచించారు. ఈ దందాలో ఎవరి ప్రమేయం ఉన్నా వదలొద్దని స్పష్టం చేశారు. ‘‘చట్ట వ్యతిరేక చర్యలకు ఈ రాష్ట్రంలో చోటులేదు. ఎంతటి వారైనా సరే పట్టుకోండి. ఎంతటి ప్రముఖుడైనా వదలొద్దు. రాజకీయ నాయకులున్నా సరే కేసు పెట్టండి. టీఆర్‌ఎస్‌ వారి పాత్ర ఉన్నా సరే.. కేసులు పెట్టి జైలుకు పంపండి. కేబినెట్‌ మంత్రి ఉన్నా కేసు పెట్టండి...’’ అని స్పష్టం చేశారు. అక్రమార్కులు భయపడే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పోలీస్, ఎక్సైజ్, ఇతర శాఖల అధికారుల కృషి బాగుందని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, డీజీపీ అనురాగ్‌ శర్మ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్‌.నర్సింగ్‌రావు, సోమేశ్‌ కుమార్, శాంతి కుమారి, ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు మహేందర్‌ రెడ్డి, సందీప్‌ శాండిల్య, మహేశ్‌ భగవత్, ఇంటెలిజెన్స్‌ ఐజీ నవీన్‌ చంద్, సెక్యూరిటీస్‌ ఐజీ ఎన్‌కే సింగ్, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సభర్వాల్, హైదరాబాద్, వరంగల్‌ రేంజ్‌ ఐజీలు స్టీఫెన్‌ రవీంద్ర, నాగిరెడ్డి, పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దామోదర్‌ గుప్త తదితరులు ఇందులో పాల్గొన్నారు.

డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌
హైదరాబాద్‌ను డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా మార్చాలని సీఎం ఆదేశించారు. ‘‘హైదరాబాద్‌లో డ్రగ్స్‌ ఎప్పట్నుంచో ఉంది. గత పాలకులు అశ్రద్ధ చూపారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ కాపాడడం అత్యంత అవసరం. అందుకే కేసు దర్యాప్తులో ఉండగా సెలవులో వెళ్లవద్దని నేనే అకున్‌ సభర్వాల్‌కు సూచించా. కేసు మూలాలన్నీ వెలికి తీయండి. డగ్స్‌ సరఫరా, వినియోగమంటే భయభ్రాంతులయ్యేలా చర్యలుండాలి. హైదరాబాదే తెలంగాణకు లైఫ్‌లైన్‌. అందుకే ఈ అరాచకం అంతం కావాలి. హైదరాబాద్‌ను డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా మార్చాలి’’ అని అన్నారు. ‘‘శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉంది. రాష్ట్రంలో పేకాట జాడ్యాన్ని రూపుమాపగలిగాం. ఆన్‌లైన్‌లో పేకాటను నిషేధించాం. 95 శాతం గుడుంబా పోయింది. ఇది వంద శాతం కావాలి. ధూల్‌పేటలో ప్రత్యేక వ్యూహం అనుసరించాలి. గుడుంబా తయారీ, అమ్మకాలు చేసే వారితో మాట్లాడి, వారికి ప్రత్యామ్నాయం చూపాలి. ఇందుకోసం హోంమంత్రి ఆధ్వర్యంలో త్వరలోనే సమావేశం నిర్వహిస్తాం..’’ అని సీఎం తెలిపారు.

నిరంతర నిఘాకు కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌
ఆహార పదార్థాల కల్తీ, నకిలీ విత్తనాలు, డ్రగ్స్‌ విషయాల్లో ఒక్క కేసుతో అయిపోయిందని అనుకోవద్దని సీఎం అన్నారు. ‘‘అసాంఘిక శక్తుల కార్యకలాపాలపై నిరంతరం నిఘా పెట్టడానికి కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ ఉన్నట్లే వీటిపై  నిరంతర నిఘాకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. మీ అనుభవం, శక్తియుక్తులతో ఈ దురాగతాలపై ఉక్కుపాదం మోపండి. ఎవరినీ ఉపేక్షించకుండా చట్టం చాలా కఠినంగా వ్యవహరిస్తుందనే సందేశం ప్రజల్లోకి వెళ్లాలి. బాగా పనిచేసిన పోలీసు అధికారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వండి. కిందిస్థాయిలో పనిచేసే ఎస్సైల వరకు ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించండి. బాగా పనిచేస్తే ప్రోత్సహించండి. ఇంక్రిమెంట్లు ఇవ్వండి. ఆగస్టు 15న నేనే వారికి స్వయంగా అవార్డులు ఇస్తా’’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

రక్తం కల్తీ బాధ కలిగించింది
రక్తాన్ని కూడా కల్తీ చేయడం తనకు ఎంతో బాధ కలిగించిందని సీఎం అన్నారు. ‘‘ఇటీవల రక్తంలో సెలైన్‌ ఎక్కించి రోగులకు అమ్ముతున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. నాకు ఎంతో బాధ కలిగింది. బతికిస్తాడని నమ్మి వచ్చిన వారిని చంపుతారా? ఇదెంత దుర్మార్గం? ఇలాంటి వారిని ఏం చేసినా తప్పు లేదు. యావజ్జీవ కారాగార శిక్ష పడేందుకు అనుగుణమైన చట్టాలకు రూపకల్పన చేయండి. అవసరమైన చట్టాలకు సవరణలు, మార్పులు చేయండి. ఈ దందాలో కింగ్‌గా, డాన్‌గా చలామణి అవుతున్న వారు ఎక్కడున్నా పట్టుకోండి. డ్రగ్స్‌తో పాటు గంజాయి కూడా నగరాల్లో సరఫరా అవుతోంది. రాష్ట్రంలో ఎక్కడ గంజాయి సాగవుతుందో గుర్తించండి. సరిహద్దుల్లో నిఘా, తనిఖీలు పెంచండి’’ అంటూ దిశానిర్దేశం చేశారు.

అవినీతి అధికారుల చిట్టా
‘‘కొందరు అధికారుల అవినీతి వల్ల ఈ దుర్మార్గాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అవినీతి అధికారుల చిట్టా తయారు చేయండి. వారిపై నిఘా పెట్టండి. డబ్బులిచ్చి పనిచేయించుకునే వారిని, డబ్బులు తీసుకుని పనిచేసే వారిని గుర్తించి, కేసులు పెట్టి శిక్షించాలి. అవినీతి నిరోధక శాఖ మరింత బాగా పనిచేయాలి’’ అని సీఎం ఆదేశించారు.

ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల నియామకం
ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాలు పరీక్షించేందుకు అవసరమైనంత మంది ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్లను వెంటనే నియమించాలని, విత్తనాల నాణ్యత పరీక్షల ఫలితాలు వెంటనే వచ్చేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలు, పోలీస్‌ కమిషనరేట్లకు అనుగుణంగా తలపెట్టిన పోలీసు కార్యాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు.

ఒక్కో అధికారికి.. ఒక్కో బాధ్యత
ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ వివరాలు..

సీఎంవో అధికారులు ఎస్‌.నర్సింగరావు, శాంతి కుమారి
గుడుంబా తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధికి బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థిక సహాయం అందించే కార్యక్రమ పర్యవేక్షణ

హైదరాబాద్‌ సిటీ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి
కల్తీలు, డ్రగ్స్‌ తదితర వ్యవస్థీకృత నేరాలను అదుపు చేయడానికి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి అనువుగా చట్టాల్లో ఎలాంటి మార్పులు, సవరణలు చేయాలో అధ్యయనం చేసి  ప్రభుత్వానికి సిఫారసు చేయటం

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ నవీన్‌చంద్‌
వ్యవస్థీకృత నేరాలను అదుపు చేసేందుకు కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ తరహాలో నిరంతర నిఘా కోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పే బాధ్యత

డీజీపీ అనురాగ్‌శర్మ
కల్తీ విత్తనాలు తయారు చేసే కేంద్రాలు, ఆహార పదార్థాలు కల్తీ జరిగే ప్రదేశాలపై ఆకస్మిక దాడులు. ఇతర వ్యూహాల అమలు పర్యవేక్షణ

ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సభర్వాల్, కమిషనర్‌ చంద్రవదన్‌
డ్రగ్స్‌పై పూర్తిస్థాయి దర్యాప్తు. భాగస్వామ్యం ఉన్న ప్రతీ ఒక్కరికీ కఠిన శిక్షలు పడేంత వరకు చర్యలు.

ఐజీలు స్టీఫెన్‌ రవీంద్ర, నాగిరెడ్డి
హైదరాబాద్‌లో కాకుండా రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో అక్రమ దందాలను అరికట్టేందుకు వ్యూహం. అమలు

సీఎస్‌ ఎస్పీ సింగ్‌
హైదరాబాద్‌ చుట్టు పక్కల విత్తనాలు, ఆహార కల్తీ జరిగే ప్రాంతాలను గుర్తించి, కలెక్టర్ల సహకారంతో తగిన చర్యలు తీసుకోవటం

ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావు
అక్రమాలకు పాల్పడే అధికారులను గుర్తించి, అవినీతి ఎక్కడ జరుగుతున్నదో పసిగట్టి, అవినీతి అధికారుల చిట్టా తయారు చేయటం

దామోదర్‌ గుప్త, ఎంపీ మల్లారెడ్డి
కొత్త పోలీసు కార్యాలయాలు, పోలీస్‌ స్టేషన్లు, ఎక్సైజ్‌ స్టేషన్లు, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణ పనుల పర్యవేక్షణ

ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ
డ్రగ్స్, గుడుంబా, గంజాయిపై కఠినంగా వ్యవహరించేలా ఎక్సైజ్‌ శాఖను బలోపేతం చేసే చర్యలు

వ్యవసాయ శాఖ కమిషనర్‌ జగన్మోహన్‌
విత్తనాల నాణ్యత పరీక్షల ఫలితాలు వెంట వెంటనే వచ్చేలా చర్యలు తీసుకోవటం

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి
హైదరాబాద్‌లో కావాల్సినంత మంది ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్లను నియమించి, ఆహార పదార్థాల పరీక్షలు వెంటవెంటనే నిర్వహించి, కేసుల్లో సహకరించటం

మంత్రులు నాయిని, పద్మారావు
దూల్‌పేటలో గుడుండా నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించే బాధ్యత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement