‘డ్రగ్స్ కేసును కేసీఆర్ నీరుగార్చారు’
‘డ్రగ్స్ కేసును కేసీఆర్ నీరుగార్చారు’
Published Tue, Aug 1 2017 4:52 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
హైదరాబాద్: డ్రగ్స్ వాడేవాళ్లను బాధితులుగా చూస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక అగ్ర నటుడు డ్రగ్ కేసులో ఉన్నాడని సోషల్ మీడియాలో వస్తోంది.. అలాంటి వారి పేర్లన్నీ బయటపెట్టాలని కోరారు. డ్రగ్స్ వాడినా, అమ్మినా అందరూ దోషులేనని తెలిపారు. సినిమా వారిని బాధితులుగా చూడాలని సీఎం అనడం కేసును నీరు కార్చడమేనన్నారు.
మదం పట్టి.. ఒళ్లు బలిసి పార్టీలు చేసుకుంటున్న వాళ్ళు బాధితులా? అని ప్రశ్నించారు. టెర్రరిజం ఎలాగో డ్రగ్ మాఫియానూ అలాగే చూడాలన్నారు. చివరకు పోలీసు అధికారులనే బెదిరించే స్థాయికి మాఫియా ఎదిగిందంటే ఎలా చూడాలని ప్రశ్నించారు. అగ్ర నటుల ప్రమేయం ఉందన్న విషయం పై వివరణ ఇవ్వాలన్నారు. డ్రగ్స్ వాడే స్కూళ్ల పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
ఏ అగ్ర నటుడి పబ్‌లో డ్రగ్స్ దందా నడుస్తుందో బయట పెట్టాలన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ మార్పు తమ అంతర్గత వ్యవహారమన్నారు. ఎవర్ని ఏ బాధ్యతల్లో పెట్టాలో హైకమాండ్‌కు తెలుసని తెలిపారు. అవసరాన్ని బట్టి మార్పులు చేస్తుంటారని చెప్పారు. అలాగే, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఐఓబీ బ్యాంక్ రైతు రుణాల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది..దీనిపై ఐఏఎస్ అధికారితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
Advertisement