సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అనుకూల ఓట్లను చీల్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్ పెద్దల వ్యూహంలో పావుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్రంట్ అంటున్నారని కాంగ్రెస్‌నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో సోమవారం మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను, సమస్యలను చర్చకు రాకుండా దృష్టి మళ్లించేందుకు ఇదో ఎత్తుగడ అని వ్యాఖ్యానించారు. గవర్నర్ గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంటే, సీఎం మాత్రం కంటి పరీక్షల కోసం ఢిల్లీ వెళ్తున్నారన్నారు. ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణంలో కుంభకోణం, సహారా ఇండియా కంపెనీ కుంభకోణంపై సీబీఐ విచారణ జరుగుతోందని, ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కేసీఆర్ భేటీ అయ్యారని ఆరోపించారు.
కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకే ఫ్రంట్ రాగం అందుకున్నారని మండిపడ్డారు. ఈ వ్యూహంలో భాగంగా ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలు వదిలిన బాణమే కేసీఆర్ అని, వారి చేతిలో కీలుబొమ్మగా మారా డని ఆరోపించారు. బీజేపీని, ప్రధాని మోదీని కాపాడటంలో భాగంగానే సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నాడన్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన నాలుగేళ్లలో రైతు ఆత్మహత్యల విషయంలో తెలంగాణ దేశంలోనే అగ్రభాగంలో ఉందన్నారు. ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయకుండా లంబాడీ, ఆదివాసీల మధ్య చిచ్చుపెట్టాడని మండిపడ్డారు.
ఈ ఫ్రంట్ ప్రకటనకు కుటుంబపోరు, వారసత్వం కోసం జరుగుతున్న కొట్లాటతో పాటు సీబీఐ కేసులు కారణమని ఆరోపించారు. తనను ముఖ్యమంత్రి చేయాలంటూ కేటీఆర్ ఒత్తిడి తెస్తున్నాడని, దీనికోసం అలిగిపోయి మైహోంలో కేటీఆర్ కుటుంబం నివాసం ఉంటుందని చెప్పారు. పూటకోమాట, వేషం, భాషను 15 ఏళ్లుగా మారుస్తున్న కేసీఆర్‌ను ప్రజలు నమ్మరన్నారు.
ఏపీ విభజన చట్టం అమలు చేయాలి సుప్రీంకోర్టులో పొంగులేటి పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విభజన చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ మండలిలో కాంగ్రెస్ పక్ష ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఎ.కె.సిక్రి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ను సోమవారం విచారించింది.
చట్టాలు అమలు చేయాలని తాము ఆదేశాలు ఎలా ఇవ్వగలమని ధర్మాసనం ప్రశ్నించగా గతంలో పలు చట్టాల అమలుపై దాఖలైన పిటిషన్లలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ ఉదహరించారు. దీంతో ప్రతివాదులైన కేంద్ర హోం, ఆర్థిక, ఉక్కు, జల వనరుల, మానవ వనరుల అభివృద్ధి శాఖలకు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పిటిషన్ కాపీని అందజేయాలని పిటిషనర్‌కు సూచిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసినట్టు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment