బాధితులను ఏమనం.. నేరగాళ్లను వదలం | kcr warns drugs smugglers | Sakshi
Sakshi News home page

బాధితులను ఏమనం.. నేరగాళ్లను వదలం

Published Sat, Jul 29 2017 12:56 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

బాధితులను ఏమనం.. నేరగాళ్లను వదలం - Sakshi

బాధితులను ఏమనం.. నేరగాళ్లను వదలం

డ్రగ్స్‌ దందా చేసేవారు ఎవరైనా క్షమించేది లేదు: సీఎం కేసీఆర్‌
ఆ మహమ్మారి రాష్ట్రంలో ప్రవేశించకూడదన్నదే మా లక్ష్యం
మూలాలను పట్టుకుని ఆదిలోనే అంతం చేయాలి
కల్తీలపై చర్యల క్రమంలోనే డ్రగ్స్‌ సంగతి తెలిసింది
అధికారులు ఏ రంగాన్నీ టార్గెట్‌ చేయలేదు
డ్రగ్స్‌ వాడకందారులు అలవాటును బంద్‌ చేసుకోవాలి
మాదకద్రవ్యాలు, పేకాట క్లబ్బులు, గుడుంబా తదితరాలపై
సమాచారమిస్తే లక్ష బహుమతి.. ఉన్నతాధికారులతో సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌
గుడుంబా, పేకాట, హుక్కా, పోకిరీలు, కల్తీలు, నకిలీల వంటి సామాజిక రుగ్మతలు తొలగించే లక్ష్యంలో భాగంగానే డ్రగ్స్‌ భూతాన్ని కూడా తరిమికొట్టాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు స్పష్టంచేశారు. సినీ రంగాన్ని టార్గెట్‌ చేశారన్న ఆరోపణలను కొట్టివేశారు. ప్రభుత్వం నేరస్తులను శిక్షిస్తుందే తప్ప బాధితులను ఇబ్బంది పెట్టదని పేర్కొన్నారు. డ్రగ్స్‌ భూతం తెలంగాణలో ప్రవేశించకూడదని, వ్యాప్తి చెందకూడదని గట్టిగా నిర్ణయించిన ప్రభుత్వం.. వాటి మూలాలను పట్టుకునే యత్నం చేస్తోందని, ఇప్పటికే కీలక ఆధారాలు, సూత్రధారుల వివరాలు లభించాయని తెలిపారు. డ్రగ్స్‌ కేసుపై శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్‌ కేసులో విచారణను పారదర్శకంగా, చిత్తశుద్ధితో నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశించారు. కేసులో దర్యాప్తు కొనసాగించాలని, నేరస్తులెవరైనా పట్టుకొని శిక్ష పడేలా చూడాలని స్పష్టంచేశారు. తెలంగాణ అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలుస్తూ దేశానికే ఆదర్శంగా ఉందని, అలాంటి రాష్ట్రంలో డ్రగ్స్‌ లాంటి దందాలు అడుగు పెట్టకుండా ఆదిలోనే అంతం చేయాలని ఆదేశించారు. ‘‘కల్తీలను అరికట్టే సందర్భంలోనే డ్రగ్స్‌ వాడకానికి సంబంధించిన సమాచారం అందింది. దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

పోలీస్, ఎక్సైజ్‌ అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి డ్రగ్స్‌ విషయంలో కఠినంగా ఉండాలని చెప్పాం. పోలీస్, ఎక్సైజ్‌ అధికారులు దాని మూలాలు పట్టుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే చాలా పురోగతి సాధించారు. కేసు దర్యాప్తులో భాగంగా వినియోగదారులను విచారిస్తున్నారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా సరఫరా చేసే వారిని, డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటి మూలాలను పట్టుకుంటాం. తీగలాగి డొంకను దొరకబడుతాం. దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగా తెలంగాణలో ఆ డ్రగ్స్‌ మహమ్మారి ప్రవేశించకుండా, వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకుంటున్న ముందస్తు చర్యలే ప్రస్తుత పరిణామాలు. డ్రగ్స్‌ వల్ల తెలంగాణకు చెందిన ఏ రంగం వారైనా, విద్యార్థులైనా చెడిపోకుండా చూడడం మా బాధ్యత. డ్రగ్స్‌ సరఫరా చేసేవారు, అమ్మేవారు, దందా చేసే వారు ఎవరైనా క్షమించేది లేదు. ఇదే సందర్భంలో వాడకందారులు కూడా తమ అలవాటు బంద్‌ చేసుకోవాలి. స్వచ్ఛందంగా ముందుకొచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఎవరు సరఫరా చేస్తున్నారో ప్రభుత్వానికి సమాచారం అందించి సహకారం అందించాలి’’ అని సీఎం అన్నారు.

మొగ్గలో తుంచేందుకే లోతైన దర్యాప్తు
డ్రగ్స్‌తోపాటు పేకాట క్లబ్బులు, గుడుంబా, హుక్కా సెంటర్లు, గంజాయి సరఫరా, పోకిరీల ఆగడాలపై ప్రభుత్వానికి సమాచారం అందించే వారికి రూ.లక్ష బహుమానం ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ వాడకం, సరఫరా వ్యాప్తి చెందకుండా మొగ్గలోనే తుంచేసే క్రమంలోనే లోతైన దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ మహమ్మారి బాగా వ్యాపించిందనే ప్రచారం చాలా తప్పని అన్నారు. ‘‘తెలంగాణలో డ్రగ్స్‌ వాడకం ఎక్కువగా లేదు. కానీ అసలు దానికి ప్రవేశమే దొరకకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ ఎక్కువగా వాడే, సరఫరా ఎక్కువగా జరిగే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ లేదు. అలాంటి నగరాల్లో హైదరాబాద్‌ లేదు’’ అని స్పష్టం చేశారు. ఆర్థికాభివృద్ధిలోనూ, అభివృద్ధిలోనూ, శాంతి భద్రతల పరిరక్షణలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణలో సామాజిక రుగ్మతలను సంపూర్ణంగా రూపుమాపాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం పునరుద్ఘాటించారు. ‘‘తెలంగాణ 21 శాతం వృద్ధిరేటుతో దూసుకుపోతోంది.

ఏడాదికి రూ.40 వేల కోట్ల ఆదాయ పన్ను వస్తోంది. గొప్పగా ముందుకు పోతున్న రాష్ట్రం మనది. శాంతి భధ్రతల పరిరక్షణలోనూ చాలా ముందున్నాం. సామాజిక రుగ్మతలను అరికట్టే విషయంలో తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. గుడుంబాను దాదాపు నిర్మూలించగలిగాం. తయారీదారులకు పునరావాసం కల్పిస్తున్నాం. పేకాట క్లబ్బులను, హుక్కా సెంటర్లను మూసివేయించాం. షీ టీమ్స్‌ వల్ల పోకిరీల బెడద చాలా వరకు తగ్గింది. మహిళల్లో భద్రతాభావం వచ్చింది. కల్తీలు, నకిలీల విషయంలో చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. కల్తీ, నకిలీదారులను కఠినంగా శిక్షిస్తున్నాం. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కంకణం కట్టుకున్నాం’’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

వారిని క్లూగా వాడుకుంటున్నాం: అధికారులు
‘‘కొందరు సినీ ప్రముఖులతోపాటు ఇతరులు కూడా మన దగ్గర డ్రగ్స్‌ వాడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. డ్రగ్స్‌ వాడుతున్నట్లు సమాచారం వచ్చిన 12 మంది సినీ ప్రముఖులను గుర్తించాం. వారిని విచారిస్తున్నాం. అయితే డ్రగ్స్‌ వాడుతున్న వారిని విచారిస్తే సరఫరా చేసే వారి గుట్టు రట్టవుతుంది. సరఫరా చేసేవారు, అమ్మే వారు, వ్యాపారం చేసేవారు అంతా తెలుస్తారు..’’ అని అధికారులు సీఎంకు చెప్పారు. ‘‘డ్రగ్స్‌ వాడుతున్న వారందరినీ విచారిస్తే దందా చేస్తున్న వారి వివరాలు తెలుస్తాయి. అదే క్రమంలో మాకిప్పుడు వాడుతున్న వారి వివరాలు, దందా చేస్తున్న వారి వివరాలు తెలిశాయి. వాటి ఆధారంగానే విచారణలు, అరెస్టులు, దర్యాప్తు సాగుతోంది. ఇప్పటివరకు సాగిన విచారణలో సినీ రంగానికి చెందిన వారు వాడుతున్నట్లుగా>నే తేలింది. ఒకవేళ అమ్మకందారులు, సరఫరా చేసేవారిలో సినీ ప్రముఖులుంటే వారిపై కూడా కేసులు పెడతాం. ఇప్పటివరకు కేసులో సినీ రంగానికి చెందిన 12 మందితోపాటు, మరో 27 మందిని విచారించాం. ఇద్దరు విదేశీయులతోపాటు 22 మందిని అరెస్టు చేశాం. అరెస్టయిన వారిలో సినీ రంగానికి చెందిన వారు లేరు. కేసు దర్యాప్తులో వాడకందారులను క్లూ(ఆధారం)గా వాడుకుంటున్నాం. దర్యాప్తులో వారి సహకారం తీసుకుంటున్నాం’’ అని సీఎంకు నివేదించారు.

రాష్ట్రంలో ఆ మహమ్మారి చాలా తక్కువ
స్పెయిన్, థాయిలాండ్, పోర్చుగల్, నైజీరియా, నెదర్లాండ్స్, కొలంబియా వంటి దేశాల నుంచి డ్రగ్స్‌ వస్తున్నట్లు సమాచారం అందినట్లు పోలీసు అధికారులు సీఎంకు చెప్పారు. ‘‘కొందరు ముఖ్యమైన వారి పేర్లు కూడా తెలిశాయి. కీలక ఆధారాలు లభించాయి. విచారణ కొనసాగిస్తున్నాం. సినీ రంగాన్ని లక్ష్యం చేసుకుని విచారణ సాగుతుందనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఐటీ పరిశ్రమలో కూడా డ్రగ్స్‌ వాడకం ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో కూడా వాస్తవం లేదు. సామాజిక రుగ్మతలను అరికట్టాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విచారణ సాగుతుంది. దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ వాడకం, సరఫరా, అమ్మకం ఉన్నాయి.

చాలా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో డ్రగ్స్‌ మహమ్మారి చాలా తక్కువ. మొగ్గ దశలోనే ఉంది. డ్రగ్స్‌పై పనిచేసే కేంద్ర ప్రభుత్వ విభాగమైన నార్కోటిక్స్‌ సెంట్రల్‌ బ్యూరో(ఎన్‌బీసీ) వెల్లడించిన అధికార వివరాల ప్రకారం.. డ్రగ్స్‌ బాగా వినియోగించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ లేదు. పంజాబ్‌లో 10,220 కేసులు, ఉత్తరప్రదేశ్‌లో 6,755 కేసులు, మహారాష్ట్రలో 1,903 కేసులు, తమిళనాడులో 1,402 కేసులు రాజస్థాన్‌లో 1,115 కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్‌ మహమ్మారి పొంచి ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ లేదు. ఇక నగరాల విషయానికొస్తే ముంబై (1512 కేసులు), ఢిల్లీ (829),  కాన్పూర్‌ (551), అమృత్‌సర్‌ (457), కోటా (242 కేసులు) అగ్రస్థానంలో ఉన్నాయి. డ్రగ్స్‌ ఎక్కువగా వాడే నగరాల జాబితాలో హైదరాబాద్‌ లేదు’’ అని సీఎంకుకు వివరించారు. ఈ సమీక్షలో డీజీపీ అనురాగ్‌ శర్మ, హైదరాబాద్‌ సీపీ మహేందర్‌ రెడ్డి, ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్, ఇంటెలిజెన్స్‌ ఐజీ నవీన్‌ చంద్, సెక్యూరిటీస్‌ ఐజీ ఎన్‌కే సింగ్, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్, సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ షానవాజ్‌ ఖాసీం, తరుణ్‌ జోషి తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement