♦ అలసత్వంతో ఉండకూడదని హెచ్చరిక!
♦ డ్రగ్స్ అంశంపై తెలంగాణ సీయం కేసీఆర్‌కు తెలుగు చలన చిత్రపరిశ్రమ లేఖ
‘‘మేం ఏ వర్గం మీద, కులం మీద, మతం మీద, ప్రభుత్వం మీద ఒక్క చెడ్డ మాట లేకుండా సినిమా తీసే ప్రయత్నం చేస్తాం. కానీ, ప్రతివాళ్లూ సినిమా వాళ్ల మీద ఇంత తీవ్రంగా స్పందించడం మాకు చాలా బాధ కలిగించింది. ఎవరికో కష్టమొస్తే జోలె పట్టుకుని విరాళాలు సేకరించిన హీరోలున్న పరిశ్రమ మాది.మాకు కష్టమొచ్చినప్పుడు సమాజం–మీడియా నుంచి కొంచెం సానుభూతి కోరుకుంటున్నాం.
ఇది మా అందరికీ ఓ కుదుపు... అలసత్వంతో ఉండకూడదని ఒక హెచ్చరిక’’ అని తెలుగు చిత్రపరిశ్రమ ముక్త కంఠంతో తన స్పందన వ్యక్తం చేసింది. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా సంచలనమైన డ్రగ్స్ కేసుపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పి. కిరణ్, శివాజీరాజా, బూరుగుపల్లి శివరామకృష్ణ, కె. మురళీమోహన్‌రావులు తెలంగాణ సీయం కేసీఆర్‌కి ఓ లేఖ రాశారు.
అందులో సారాంశం ఏంటంటే... ‘‘డ్రగ్స్ తీసుకునేవాళ్లు ఎప్పటికీ హీరోలు కాదు. అతికొద్ది మంది చేసిన పొరపాట్లకు తెలుగు చిత్రపరిశ్రమ తల వంచుకోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరం. మాకు సమాజం పట్ల గౌరవం ఉండబట్టే తగ్గిపోతున్న మానవీయ విలువల్ని ఇంకా పట్టుకుని ముందుకెళ్తున్నాం. చెడుపై మంచి గెలవడం అనే కథనే 60 ఏళ్లుగా చెప్తూ, కుటుంబ విలువలు బయట సమాజంలో ఎలా ఉన్నా... కనీసం సినిమాల్లోనైనా బలంగా ఉండాలని సినిమాలు తీస్తాం.
ఎందుకంటే... అవి కాలాతీతం! క్రమశిక్షణ లేనోళ్లను పరిశ్రమ భరించినట్లు ఒక్క మచ్చు తునక కూడా లేదు. ఇలాంటి అలవాట్లు ఉన్నోళ్లు వాళ్లంతట వాళ్లే తెరమరుగైపోతారు. కానీ, మా వంతుగా వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వానికి, పోలీసులకు పూర్తిగా సహకరిస్తాం. ఈ కేసును వెలుగులోకి తెచ్చిన ప్రభుత్వ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ, చిత్రపరిశ్రమ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని, మీ పరిశోధనను కొంచెం హుందాగా ముందుకు తీసుకెళ్లమని మాత్రమే కోరుతున్నాం. సినీ పరిశ్రమకు ఈ పది రోజులూ చీకటి రోజులు. అయినా గ్రహణం గంట సేపే ఉంటుంది. కానీ, ప్రయాణం నిరంతరం సాగుతూనే ఉంటుంది’’.