సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసు... కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు, జాతీయ మీడియాలోనూ తీవ్ర చర్చకు తెరలేపిన అంశం ఇది. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న సినీతారలు, ఇతర సెలబ్రిటీలు అందరికీ ఇపుడు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్‌చిట్ ఇచ్చిందన్న వార్త మరోసారి కలకలం రేపుతోంది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ సెక్రటరీ పద్మనాభరెడ్డి ఈ కేసు దర్యాప్తు గురించి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన వివరాలను ఎక్సైజ్ శాఖ అధికారికంగా అందజేసింది. ఈ వివరాల్లో పేర్కొన్న దాని ప్రకారం.. డ్రగ్స్ వ్యవహారంలో 12 కేసులు నమోదు చేసి విచారణ జరిపిన తర్వాత మొత్తం 4 చార్జిషీట్లను ఇప్పటివరకు దాఖలు చేశారు. అయితే, వారిచ్చిన వివరాల్లో ఎక్కడా తెలుగు సినీ రంగానికి చెందిన నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, ఇతర ప్రముఖుల పేర్లను ప్రస్తావించలేదు. దీంతో ఈ కేసులో వారందరికీ ఉపశమనం లభించినట్టేననే చర్చ జరుగుతోంది. అయితే, ఈ కేసు దర్యాప్తు తీరు సరిగా లేదని వివరాలు సేకరించిన పద్మనాభరెడ్డి తప్పుపడుతున్నారు. గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న వారిని కేసు నుంచి ఎలా తప్పిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ కేసు విచారణను సిట్ నుంచి తప్పించి ఏసీబీ లేదా విజిలెన్స్ ద్వారా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
చార్జిషీట్లలో ఏముందంటే..?
ఈ కేసులో పద్మనాభరెడ్డికి ఎక్సైజ్ శాఖ ఇచ్చిన చార్జిషీట్ (క్రైం నంబర్ 113/2017)లో మొదటిది 2017, జూలై 24న ఎక్సైజ్ అధికారులు శంషాబాద్ కోర్టుకు సమర్పించింది. ఇందులో మణికొండలోని పంచవటి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ తెలుగు ఇండస్ట్రీలో మేనేజర్‌గా పనిచేస్తున్న పుట్టకర్ రాన్సన్ జోసెఫ్ ప్లాట్‌పై దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో గంజాయి, హుక్కా తదితర నిషేధిత మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై సెక్షన్ 8(సి) ఎన్‌డీపీఎస్ యాక్ట్ 1985, 20 (బి)(2)(ఏ), ఎన్‌డీపీఎస్ యాక్ట్ 1985 ప్రకారం కేసులు నమోదు చేశారు. రెండో చార్జీషీటు (క్రై. నం.119/2017) 2017, ఆగస్టు ఒకటిన శంషాబాద్ కోర్టుకు సమర్పించింది. ఇందులో రాజీవ్‌గాంధీ విమానాశ్రయంలో అలెక్స్ విక్టర్ అనే దక్షిణాఫ్రికా దేశస్తుడి వద్ద 10 గ్రాముల కొకైన్ ప్యాకెట్లు లభించాయి. ఇతనిపై సెక్షన్ 8 (సి) ఎన్‌డీపీఎస్ యాక్ట్ 1985, 21 (బి), ఎన్‌డీపీఎస్ యాక్ట్ 1985 ప్రకారం కేసులు నమోదు చేశారు.ఇదిలా ఉండగా, దీనిపై స్పందించిన ఎౖMð్సజ్ అధికారులు మాత్రం ‘డ్రగ్స్’కేసును తామింకా క్లోజ్ చేయలేదని, దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
డ్రగ్స్ రాకెట్‌కు సినీ పరిశ్రమతో కలకలం..
నగరంలోని పలు కార్పొరేట్ స్కూళ్ల చిన్నారులకు డ్రగ్స్ (ఎల్‌ఎస్‌డీ) విక్రయాలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న విషయం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులను కూలంకషంగా దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ని ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు 62 మంది సినీరంగంతో సంబంధమున్న ప్రముఖులను విచారణకు పిలిచారు. ఇది మీడియాలో పెద్ద దుమారాన్నే లేపింది. పలువురు సెలబ్రిటీలు తాము ఎలాంటి తప్పు చేయలేదని విచారణకు వచ్చిన సమయంలో వివరణ ఇచ్చుకున్నారు.
ఆ సందర్భంగా పలువురు నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల నుంచి వెంట్రుకలు, గోళ్ల నమూనాలు తీసుకున్నారు. వీరిలో పలువురిని అరెస్టు చేస్తారన్న ప్రచారం కూడా జరగడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. తరువాత ఎక్సైజ్ నుంచి అకున్ సబర్వాల్ బదిలీ కావడం, ఈ సిట్‌కు ఇపుడు వేరే అధికారులు నేతృత్వం వహించడంతో కేసు నీరుగారిపోయిందని, సిట్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని పద్మనాభరెడ్డి ఆరోపిస్తున్నారు. 62 మందికి నోటీసులు జారీ చేసి ఇపుడు వారి పేర్లను 4 చార్జిషీట్లలో ఎక్కడా ప్రస్తావించకపోవడాన్నే ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. అంటే పరోక్షంగా ఎక్సైజ్‌శాఖ వారికి క్లీన్‌చిట్ ఇచ్చిందని విమర్శించారు. వెంటనే కేసును ఏసీబీ, లేదా విజిలెన్స్ లాంటి దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment