వారపుసంతలో అధికారుల తనిఖీలు (ఫైల్)
కేసరి దాల్‌పైనే దాడులు
పట్టణంలోని రాజీవ్‌నగర్‌కాలనీలోని ఓ ఇంట్లో దాచిన 112 బస్తాల నిషేధిత కేసరిదాల్‌ను 2017లో సీజ్‌చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్ నుంచి సరుకు ఇక్కడికి అక్రమంగా వస్తున్నట్టు అప్పట్లో అధికారుల విచారణలో తేలింది. 2018లో సైతం పుడ్‌సేప్టీ అధికారులు పలమనేరు ప్రాంతంలోని పలు వారపుసంతల్లో కల్తీ సరుకులపై దాడులు చేపట్టి భారీగా జరిమానాలు విధించారు.
ఎముకలతో నూనెలు
పలమనేరు సమీపంలోని గడ్డూరు వద్ద ఓ ఇంట్లో టన్నులకొద్దీ దాచి ఉంచిన ఎముకలను అధికారులు సీజ్ చేశారు. తమిళనాడులోని కబేళాలనుంచి వీటిని సేకరించి ఇక్కడ ఎండబెట్టి నూనెను తయారు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. దీంతో అప్పట్లో జిల్లా వ్యాప్తంగా వంటనూనెలపై తనిఖీలు చేశారు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు అధికారులు హడావుడి చేసి, ఆ తరువాత మళ్లీ పట్టించుకోవడంలేదు. దీంతో అక్రమార్కులు మళ్లీ కల్తీ సరుకును మార్కెట్లో్లకి తెచ్చి అమ్మకాలు మొదలెట్టారు.
మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా కల్తీ వ్యాపారం సాగుతోంది. చౌక బేరమే ఈ కల్తీ వ్యాపారానికి ఆధారంగా మారింది. ఈ జిల్లా మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉండడం అక్రమార్కులకు కలసి వచ్చింది. తమిళనాడు నుంచి యథేచ్ఛగా కల్తీ సరుకు మార్కెట్లోకి దిగుతోంది. వారపు సంతల్లో అమ్ముడవుతోంది. మరోవైపు దుకాణాలు, హోటళ్లు, టీ స్టాళ్లు వంటి ఆహార పదార్థాలు విక్రయించే కేంద్రాలకు గుట్టు చప్పుడు కాకుండా చేరిపోతోంది. ఇలా కల్తీ సరుకు ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
పలమనేరు (చిత్తూరు): జిల్లాలో ఆహార పదార్థాల కల్తీ జోరందుకుంది. పప్పు దినుసులు, టీపొడి, నూనెలు తదితరాల్లో ఈ కల్తీలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీంతోపాటు కేసరి దాల్ అమ్మకాలు వారపు సంతల్లో భారీగా సాగుతున్నట్టు తెలుస్తోంది. సరిహద్దుల్లోని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కల్తీ సరుకులు ఇక్కడికి గుట్టుగా రవాణా అవుతున్నాయి. ఇలాంటి కల్తీ పదార్థాలను తింటే అనారోగ్యం తప్పదని తెలిసినా ఫుడ్‌సేఫ్టీ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
కల్తీ ఇలా
వంటనూనెలే అధికం
దుకాణాలకు వస్తున్న సరుకుల్లో ఒకటో రకం, రెండో రకం అంటూ స్థానిక వ్యాపారులే ఏది అసలో, ఏది నకిలీనో కనుక్కోలేకపోతున్నారు. బియ్యం మొదలుకొని శెనగపప్పు, కందిపప్పు, చక్కెర, పెసరపప్పు, మైదాపిండి, గసాలు, రవ్వ, జీలకర్ర, మిరియాలు, ఆఖరుకు వంటనూనెలు కల్తీ అవుతున్నాయి. ఈ కల్తీ వ్యాపారం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. స్థానికంగా దుకాణాల్లో లభించే ప్రముఖ కంపెనీల నూనె ప్యాకెట్‌లు ఈ ప్రాంతంలోని వారపు సంతల్లో సైతం అదే కంపెనీల పేరుతో నకిలీ ప్యాకెట్లు లభ్యమవుతున్నాయి. ధరలో కూడా భారీ తేడా ఉండడంతో ప్రజలు ఎగబడి వీటినే కొనుగోలు చేస్తున్నారు. అదే అదనుగా లీటరు ప్యాకెట్లలో 900 మిల్లీలీటర్ల నూనె నింపి సులభంగా సొమ్ముచేసుకుంటున్నారు.
చోద్యం చూస్తున్న ఫుడ్ సేఫ్టీ విభాగం
ఆహార పదార్థాల కల్తీని అరికట్టేందుకు జిల్లా మొత్తానికి ఇద్దరు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. అయితే వారు దుకాణాల వైపు కన్నెత్తి చూడడం లేదు. సంబందిత మున్సిపల్ కమిషనర్లకు తనిఖీలు చేసే అధికారం లేదు. ప్రభుత్వం ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్‌ను అమలు చేస్తున్నా ఇలాంటి అక్రమాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై ఆహార కల్తీ నిరోధక శాఖ విచారణాధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ అయినా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
తమిళనాడునుంచి వచ్చిన కల్తీ టీపొడి
టీపొడి భారీ వ్యాపారం
కల్తీ టీ పొడి అక్రమార్కుల పంట పండిస్తోంది. సాధారణంగా మార్కెట్లో పావు కిలో బ్రాండెడ్ టీ పొడి కొనాలంటే రూ.150 నుంచి రూ.200 వరకు ఖర్చు పెట్టాలి. అంటే కిలో రూ.600 నుంచి రూ.800 వరకు ఉంది. అది కల్తీ టీ పొడి అయితే కిలో రూ.170కే దొరుకుతోంది. వినియోగించిన టీ పొడిలో చింతగింజల పొడి, రసాయనాలతో కూడిన చాక్లెట్ పొడి కలిపి చౌకగా దొరికే టీ పొడిని విక్రయిస్తున్నారు. ఈ చాక్లెట్ పొడిని కలపడం వల్ల ఎంత ఉడికించినా టీ రంగు మారదు. జిల్లాలోని పలు టీ దుకాణాల్లో ఈ కల్తీ టీపొడినే వాడుతున్నారు. దీని వల్ల వ్యాపారులకు ఆదాయం అధికంగా వస్తోంది. క్వింటాళ్ల కొద్దీ కల్తీ టీ పొడిని జిల్లాలోని మార్కెట్లో విక్రయించేస్తున్నారు.
నిల్వ ఉంచిన కేసరిదాల్‌ను సీజ్ చేసిన అధికారి (ఫైల్)
కేసరి దాల్‌పై 1961 నుంచే నిషేధం
జిల్లాలో ప్రమాదకర కేసరి దాల్(లంకపప్పు) అమ్మకాలు మళ్లీ ఊపందుకున్నాయి. వీటిని తింటే పలు రకాల ఆరోగ్య సమస్యలు ఖాయం. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, అశోం రాష్ట్రాల్లో విరివిగా పండే లతిరస్ సటివస్ అనే మొక్క గింజలను పప్పులుగా చేస్తారు. వాటికి రసాయన రంగులను కలిపి కేసరి దాల్ పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇందులో న్యూరో టాక్సిన్ అనే విష పదార్థం ఉంటుంది. వీటిని తింటే నరాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అందుకే ప్రభుత్వం 1961 నుంచి ఈ పంటపై నిషేధం విధించింది. కానీ ఈ పప్పు ధర చౌకగా ఉండడంతో జనం దీన్ని కొనుగోలు చేస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు.
గతంలో పలమనేరు సమీపంలో అధికారులు సీజ్ చేసిన ఎముకల గోడోన్
కబేళాల నుంచి బోన్ ఆయిల్
జిల్లాలోని పలు పట్టణాల్లో తమిళనాడులోని కబేళాలతో లభ్యమయ్యే ఎముకలనుంచి తయారవుతున్న నూనెలను లూజు పామోలిన్, శెనిగనూనెలో కలిపి గట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్లు గతంలోనే అధికారులు గుర్తించారు. ముఖ్యంగా చిత్తూరు, నగిరి, పుత్తూరు, కుప్పం, పలమనేరు, పుంగనూరు తదితర ప్రాంతాల్లో చికెన్ కబాబ్ సెంటర్లు, కొన్ని హోటళ్లలో బిరియానీ, బోండా, బజ్జీలతో పాటు స్వీట్‌స్టాల్స్‌లో ఈ కల్తీ నూనెలు వినియోగిస్తున్నారు. తమిళనాడుకు చెందిన వ్యాపారులు ముఠాగా ఏర్పడి ఈ కల్తీ దందాను నడిపిస్తున్నారు. కారుచౌకగా ఈ నూనెను జిల్లాలో విక్రయిస్తున్నట్టు సమాచారం. పొట్టేలు మటన్‌లో లేగదూడల మాంసాన్ని సైతం కలిపి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది.
జీర్ణకోశ వ్యాధులు వస్తాయి
వంటనూనెల కల్తీతో జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తొలుత గ్యాస్‌స్ట్రిక్‌తో ఈ సమస్య ప్రారంభమై ఆ తర్వాత తీవ్ర స్థాయికి వెళుతుంది. కల్తీ ఆహార పదార్థాలను తిన్న వెంటనే చర్మంపై దురదలు, అలర్జీ వచ్చిందంటే వెంటనే అక్కడ కల్తీ జరిగినట్లు భావించవచ్చు. కల్తీ అయిన నూనెలతో తయారు చేసే ఆహారపదార్థాలు, మధుమేహ వ్యాధి ఉన్నవారికి చాలా ప్రమాదకరం.
– డా.హరగోపాల్, వైద్యాధికారి, పలమనేరు ఏరియా ఆస్పత్రి
ఆకస్మిక దాడులు చేస్తాం
జిల్లాలో కల్తీ ఆహార పదార్థాలు, వంటనూనెలు, హోటళ్లలో మాంసాహార పదార్థాలు, పప్పులు, రెండోరకం వస్తువులు, వారపుసంతలో విడి విక్రయ సరుకులపై త్వరలో ఆకస్మిక దాడులు నిర్వహిస్తాం. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న మన జిల్లాలో కల్తీ సరుకుల విక్రయానికి అవకాశం ఉంటుంది. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. తక్కువ ధరతో లభిస్తోందని ఏ వస్తువులను కొనుగోలు చేయొద్దు.
– సతీష్‌కుమార్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్, చిత్తూరు
Comments
Please login to add a commentAdd a comment