adulteration goods
-
‘కల్తీ’ కథలు.. ఒకటేమిటీ అన్నీ అంతే.. తినేదెలా? బతికేదెలా?
కేసరి దాల్పైనే దాడులు పట్టణంలోని రాజీవ్నగర్కాలనీలోని ఓ ఇంట్లో దాచిన 112 బస్తాల నిషేధిత కేసరిదాల్ను 2017లో సీజ్‌చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్ నుంచి సరుకు ఇక్కడికి అక్రమంగా వస్తున్నట్టు అప్పట్లో అధికారుల విచారణలో తేలింది. 2018లో సైతం పుడ్‌సేప్టీ అధికారులు పలమనేరు ప్రాంతంలోని పలు వారపుసంతల్లో కల్తీ సరుకులపై దాడులు చేపట్టి భారీగా జరిమానాలు విధించారు. ఎముకలతో నూనెలు పలమనేరు సమీపంలోని గడ్డూరు వద్ద ఓ ఇంట్లో టన్నులకొద్దీ దాచి ఉంచిన ఎముకలను అధికారులు సీజ్ చేశారు. తమిళనాడులోని కబేళాలనుంచి వీటిని సేకరించి ఇక్కడ ఎండబెట్టి నూనెను తయారు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. దీంతో అప్పట్లో జిల్లా వ్యాప్తంగా వంటనూనెలపై తనిఖీలు చేశారు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు అధికారులు హడావుడి చేసి, ఆ తరువాత మళ్లీ పట్టించుకోవడంలేదు. దీంతో అక్రమార్కులు మళ్లీ కల్తీ సరుకును మార్కెట్లో్లకి తెచ్చి అమ్మకాలు మొదలెట్టారు. మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా కల్తీ వ్యాపారం సాగుతోంది. చౌక బేరమే ఈ కల్తీ వ్యాపారానికి ఆధారంగా మారింది. ఈ జిల్లా మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉండడం అక్రమార్కులకు కలసి వచ్చింది. తమిళనాడు నుంచి యథేచ్ఛగా కల్తీ సరుకు మార్కెట్లోకి దిగుతోంది. వారపు సంతల్లో అమ్ముడవుతోంది. మరోవైపు దుకాణాలు, హోటళ్లు, టీ స్టాళ్లు వంటి ఆహార పదార్థాలు విక్రయించే కేంద్రాలకు గుట్టు చప్పుడు కాకుండా చేరిపోతోంది. ఇలా కల్తీ సరుకు ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. పలమనేరు (చిత్తూరు): జిల్లాలో ఆహార పదార్థాల కల్తీ జోరందుకుంది. పప్పు దినుసులు, టీపొడి, నూనెలు తదితరాల్లో ఈ కల్తీలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీంతోపాటు కేసరి దాల్ అమ్మకాలు వారపు సంతల్లో భారీగా సాగుతున్నట్టు తెలుస్తోంది. సరిహద్దుల్లోని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కల్తీ సరుకులు ఇక్కడికి గుట్టుగా రవాణా అవుతున్నాయి. ఇలాంటి కల్తీ పదార్థాలను తింటే అనారోగ్యం తప్పదని తెలిసినా ఫుడ్‌సేఫ్టీ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. కల్తీ ఇలా వంటనూనెలే అధికం దుకాణాలకు వస్తున్న సరుకుల్లో ఒకటో రకం, రెండో రకం అంటూ స్థానిక వ్యాపారులే ఏది అసలో, ఏది నకిలీనో కనుక్కోలేకపోతున్నారు. బియ్యం మొదలుకొని శెనగపప్పు, కందిపప్పు, చక్కెర, పెసరపప్పు, మైదాపిండి, గసాలు, రవ్వ, జీలకర్ర, మిరియాలు, ఆఖరుకు వంటనూనెలు కల్తీ అవుతున్నాయి. ఈ కల్తీ వ్యాపారం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. స్థానికంగా దుకాణాల్లో లభించే ప్రముఖ కంపెనీల నూనె ప్యాకెట్లు ఈ ప్రాంతంలోని వారపు సంతల్లో సైతం అదే కంపెనీల పేరుతో నకిలీ ప్యాకెట్లు లభ్యమవుతున్నాయి. ధరలో కూడా భారీ తేడా ఉండడంతో ప్రజలు ఎగబడి వీటినే కొనుగోలు చేస్తున్నారు. అదే అదనుగా లీటరు ప్యాకెట్లలో 900 మిల్లీలీటర్ల నూనె నింపి సులభంగా సొమ్ముచేసుకుంటున్నారు. చోద్యం చూస్తున్న ఫుడ్ సేఫ్టీ విభాగం ఆహార పదార్థాల కల్తీని అరికట్టేందుకు జిల్లా మొత్తానికి ఇద్దరు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. అయితే వారు దుకాణాల వైపు కన్నెత్తి చూడడం లేదు. సంబందిత మున్సిపల్ కమిషనర్లకు తనిఖీలు చేసే అధికారం లేదు. ప్రభుత్వం ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్‌ను అమలు చేస్తున్నా ఇలాంటి అక్రమాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై ఆహార కల్తీ నిరోధక శాఖ విచారణాధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ అయినా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తమిళనాడునుంచి వచ్చిన కల్తీ టీపొడి టీపొడి భారీ వ్యాపారం కల్తీ టీ పొడి అక్రమార్కుల పంట పండిస్తోంది. సాధారణంగా మార్కెట్లో పావు కిలో బ్రాండెడ్ టీ పొడి కొనాలంటే రూ.150 నుంచి రూ.200 వరకు ఖర్చు పెట్టాలి. అంటే కిలో రూ.600 నుంచి రూ.800 వరకు ఉంది. అది కల్తీ టీ పొడి అయితే కిలో రూ.170కే దొరుకుతోంది. వినియోగించిన టీ పొడిలో చింతగింజల పొడి, రసాయనాలతో కూడిన చాక్లెట్ పొడి కలిపి చౌకగా దొరికే టీ పొడిని విక్రయిస్తున్నారు. ఈ చాక్లెట్ పొడిని కలపడం వల్ల ఎంత ఉడికించినా టీ రంగు మారదు. జిల్లాలోని పలు టీ దుకాణాల్లో ఈ కల్తీ టీపొడినే వాడుతున్నారు. దీని వల్ల వ్యాపారులకు ఆదాయం అధికంగా వస్తోంది. క్వింటాళ్ల కొద్దీ కల్తీ టీ పొడిని జిల్లాలోని మార్కెట్లో విక్రయించేస్తున్నారు. నిల్వ ఉంచిన కేసరిదాల్ను సీజ్ చేసిన అధికారి (ఫైల్) కేసరి దాల్‌పై 1961 నుంచే నిషేధం జిల్లాలో ప్రమాదకర కేసరి దాల్(లంకపప్పు) అమ్మకాలు మళ్లీ ఊపందుకున్నాయి. వీటిని తింటే పలు రకాల ఆరోగ్య సమస్యలు ఖాయం. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, అశోం రాష్ట్రాల్లో విరివిగా పండే లతిరస్ సటివస్ అనే మొక్క గింజలను పప్పులుగా చేస్తారు. వాటికి రసాయన రంగులను కలిపి కేసరి దాల్ పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇందులో న్యూరో టాక్సిన్ అనే విష పదార్థం ఉంటుంది. వీటిని తింటే నరాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అందుకే ప్రభుత్వం 1961 నుంచి ఈ పంటపై నిషేధం విధించింది. కానీ ఈ పప్పు ధర చౌకగా ఉండడంతో జనం దీన్ని కొనుగోలు చేస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. గతంలో పలమనేరు సమీపంలో అధికారులు సీజ్ చేసిన ఎముకల గోడోన్ కబేళాల నుంచి బోన్ ఆయిల్ జిల్లాలోని పలు పట్టణాల్లో తమిళనాడులోని కబేళాలతో లభ్యమయ్యే ఎముకలనుంచి తయారవుతున్న నూనెలను లూజు పామోలిన్, శెనిగనూనెలో కలిపి గట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్లు గతంలోనే అధికారులు గుర్తించారు. ముఖ్యంగా చిత్తూరు, నగిరి, పుత్తూరు, కుప్పం, పలమనేరు, పుంగనూరు తదితర ప్రాంతాల్లో చికెన్ కబాబ్ సెంటర్లు, కొన్ని హోటళ్లలో బిరియానీ, బోండా, బజ్జీలతో పాటు స్వీట్స్టాల్స్లో ఈ కల్తీ నూనెలు వినియోగిస్తున్నారు. తమిళనాడుకు చెందిన వ్యాపారులు ముఠాగా ఏర్పడి ఈ కల్తీ దందాను నడిపిస్తున్నారు. కారుచౌకగా ఈ నూనెను జిల్లాలో విక్రయిస్తున్నట్టు సమాచారం. పొట్టేలు మటన్‌లో లేగదూడల మాంసాన్ని సైతం కలిపి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. జీర్ణకోశ వ్యాధులు వస్తాయి వంటనూనెల కల్తీతో జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తొలుత గ్యాస్స్ట్రిక్తో ఈ సమస్య ప్రారంభమై ఆ తర్వాత తీవ్ర స్థాయికి వెళుతుంది. కల్తీ ఆహార పదార్థాలను తిన్న వెంటనే చర్మంపై దురదలు, అలర్జీ వచ్చిందంటే వెంటనే అక్కడ కల్తీ జరిగినట్లు భావించవచ్చు. కల్తీ అయిన నూనెలతో తయారు చేసే ఆహారపదార్థాలు, మధుమేహ వ్యాధి ఉన్నవారికి చాలా ప్రమాదకరం. – డా.హరగోపాల్, వైద్యాధికారి, పలమనేరు ఏరియా ఆస్పత్రి ఆకస్మిక దాడులు చేస్తాం జిల్లాలో కల్తీ ఆహార పదార్థాలు, వంటనూనెలు, హోటళ్లలో మాంసాహార పదార్థాలు, పప్పులు, రెండోరకం వస్తువులు, వారపుసంతలో విడి విక్రయ సరుకులపై త్వరలో ఆకస్మిక దాడులు నిర్వహిస్తాం. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న మన జిల్లాలో కల్తీ సరుకుల విక్రయానికి అవకాశం ఉంటుంది. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. తక్కువ ధరతో లభిస్తోందని ఏ వస్తువులను కొనుగోలు చేయొద్దు. – సతీష్‌కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్, చిత్తూరు -
అడుగడుగునా.. అమ్మకాల్లో దగా!
‘ఇందుగలడందు లేడని సందేహం వలదు... ఎందెందు వెదకి చూసినా... అందందేగలదు’ అన్నట్టు జిల్లాలో ఎక్కడ చూసినా తూనికలు... కొలతల్లో దగా... మోసం... కనిపిస్తూనే ఉన్నాయి. చిన్న కిరాణా కొట్టు మొదలు... పెద్ద పెద్ద బంగారు దుకాణాల వరకూ తూనికల్లో మోసాలకు పాల్పడుతున్నాయి. పాలనుంచి పెట్రోల్ వరకూ కొలతల్లో దగా చేస్తున్నారు. దీనివల్ల సగటు వినియోగదారుడు నిరంతరం మోసపోతూనే ఉన్నాడు. వీటిని నియంత్రించగల వ్యాపారులు చేష్టలుడిగి చూస్తున్నారు. లేనిపోని సాకులు చెబుతూ నామమాత్రంగా దాడులకు చేసి చేతులు దులుపుకుంటున్నారు. విజయనగరం పూల్‌బాగ్ : వ్యాపారుల్లో అత్యాశ పెరిగిపోతోంది. చిన్న కిరాణా కొట్టు మొదలుకుని బంగారుషాపు వరకు ఎక్కడికి వెళ్లినా వినియోగదారుడిని మోసం చేస్తున్నారు. చివరకు రేషన్‌డీలర్లు సైతం చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దుకాణా ల్లో వేసిన తూకం... ఇంటికెళ్లి చూస్తే తేడా కనిపిస్తోంది. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన తూనికలు కొలతలు శాఖ సిబ్బంది కొరత పేరుతో చోద్యం చూస్తోంది. కిరాణం, వస్త్ర దుకాణాలు, ప్యాన్సీ, హార్డ్‌వేర్, బంగారు షాపులు, ఇలా వివిధ రకాల దుకాణాలు జిల్లాలో 24,301 వరకూ ఉన్నాయి. చిరువ్యాపారులను కలుపుకుంటే 50 వేలమందికి పైగానే ఉంటారు. ఆయా దుకాణాల్లో ఘన పదార్థాలైతే తూకాలు, ద్రవ పదార్థాలైతే కొలతల్లో విక్రయిస్తారు. వీటికి నిర్థిష్ట ప్రమాణాలు ఉంటాయి. అయితే కొందరు వ్యాపారులు ధన దాహంతో జిమ్మిక్కులు చేస్తున్నారు. వినియోగదారునికి తెలియకుండానే మోసం చేస్తున్నారు. తూనికలు– కొలతల శాఖ నిబంధనల ప్రకారం వ్యాపారి రెండేళ్లకు ఒకసారి తప్పనిసరిగా తూకం రాళ్లు, ఏటా కాటాకు ప్రభుత్వ పరమైన ముద్రలు వేయించుకోవాలి. కాటాలో తేడాలు వస్తే రిపేరర్ వద్దకు వెళ్లి సరిచేయించుకోవాలి. అలా చాలా మంది వ్యాపారులు చేయించుకోవటం లేదు. తూనికలు కొలతలు శాఖ కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో వ్యాపారులు అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అడుగడుగునా దగా... జిల్లా వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో కూరగాయలు వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. సైకిళ్లపైన రోడ్డుకు ఇరుపక్కలా బళ్లపై నిత్యం వ్యాపారం సాగుతుంది. ఎలక్ట్రికల్ కాటాలతో సైతం వ్యాపారులు అక్రమాలకు తెరతీస్తున్నారు. ముందుగా వంద గ్రాములు తగ్గించి జీరో వచ్చేలా అమర్చుతున్నారు. కొన్ని దుకాణాల్లో కాటాపై ఉన్న పళ్లెం బరువును లెక్కించకుండా తూకంలో కలిపేసి మోసాలకు పాల్పడుతున్నారు. కేజీకి 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకే అధిక శాతం దుకాణాల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. గ్యాస్‌లోనూ చేతివాటం వంటగ్యాస్ సిలండర్ తూకంలోను వ్యత్యాసం ఉంటోందని వినియోగదారులు వాపోతున్నారు. సిలిండర్లను తూకం వేయకుండానే అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండునెలలకు రావాల్సిన సిలిండరు కేవలం 40 రోజులకే అయిపోతుందని గృహిణులు గగ్గోలు పెడుతున్నా రు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బంకుల్లో మాయాజాలం పెట్రోలు బంకుల్లో కూడా మోసం తారాస్థాయికి చేరుకుంటోంది. ఇంధనాన్ని నింపే సమయంలో వినియోగదారుడు జీరో రీడింగ్ చూసుకోకుంటే సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇచ్చిన నగదుకు సరిపడా ఇంధనం కొట్టించకపోవటంతో వాహనదారులు నిత్యం నష్టపోతున్నారు. మరిన్ని బంకుల్లో సాంకేతికతను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు కొరఢా ఝుళిపించాల్సిన అవసరం ఉంది. చేపలు, మాంసం దుకాణాల్లో.. ముఖ్యంగా చేపలు, మాం సం దుకాణాల్లో ఎక్కువగా కాటాల్లో కనిపిస్తోంది. ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు ఫోన్ చేసినా సిబ్బంది రావటం లేదు. కూరగాయల మార్కెట్లో తూకాలు సరిగ్గా ఉండవు. చాలామంది రాళ్లనుకూడా ఉపయోగిస్తున్నారు. – కొవ్వాడ నాగరాజు, నెల్లిమర్ల సిబ్బంది కొరత వేధిస్తోంది ప్రస్తుతం జిల్లాలో సిబ్బం ది కొరత ఉంది. జిల్లా సహాయ నియంత్రికులు–1, బొబ్బిలి–1, విజ యనగరం–1 ఇన్స్పెక్టరు ఉన్నారు. కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటు–1, ఆఫీస్ సబార్డినేట్–1, చౌకీదార్–1 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ఇప్పటివరకూ మెరుగైన ఫలితాలు సాధించాం. ఆ పోస్టులు భర్తీ అయితే దాడులు ముమ్మరం చేసి, మరింత మెరుగైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. – జి.రాజేష్‌కుమార్, ఉపనియంత్రికులు, విజయనగరం. -
అమ్మ ప్రసాదానికి కల్తీ మరక
విజయనగరం కంటోన్మెంట్ : కల్తీ ఘనులు, నాణ్యత లేని వస్తువులను అందించే అక్రమార్కులు పైడితల్లమ్మ ప్రసాదాన్నీ వదల్లేదు. జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు అయిన పైడి తల్లమ్మ సిరిమానోత్సవ సంబరానికి, పండగ మూడు రోజుల పాటు భక్తులకు అందించే ప్రసాదాల తయారీకి కల్తీ సరుకులు అంటగడుతున్నారు. ఈ విషయం ఆహార కల్తీ నిరోధక శాఖ ఆధ్వర్యంలోని ఆహార భద్రతాధికారుల తనిఖీల్లో బట్టబయలైంది. సోమవారం రాత్రి సహాయ ఫుడ్‌కంట్రోలర్ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని బందం తనిఖీలు చేపట్టింది. ఆహార పదార్థాలను తయారు చేసే ప్రాంతాన్ని పరిశీలించి తనిఖీలు నిర్వహించింది. వీరి ప్రాధమిక తనిఖీల్లో వేరుశనగ గుళ్లు పాడయినవి వినియోగిస్తున్నట్టుగా గుర్తించారు. అందులో ఎఫ్లోటాక్సిన్ అనే రసాయన విష పదార్థం ఉన్నట్టు తేల్చారు. వీటిని వినియోగించవద్దని వెంటనే ఆలయ అధికారులు, తయారీదారులను ఆదేశించారు. అంతే గాకుండా అప్పటికే తయారై సిద్ధంగా ఉన్న పైడితల్లి అమ్మవారి లడ్డూతో సహా పది రకాల సరుకుల శాంపిళ్లను తీశారు. వాటిని విశాఖపట్నంలోని రీజనల్ ల్యాబ్‌కు తరలించి నాలుగు రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. ఉత్సవానికి సిద్ధమైన ప్రసాదాలు సిరిమానోత్సవానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు పైడితల్లి అమ్మవారి ప్రసాదాన్ని అందజేస్తున్నారు. పులిహోర, లడ్డూ ఇందులో ముఖ్యమైనవి. వీటిని తయారు చేసేందుకు ఏటా కాంట్రాక్టు ఇస్తున్నారు. ఈ కాంట్రాక్టును పొందేందుకు ముగ్గురు నుంచి నలుగురు కాంట్రాక్టర్లు అలవాటుగా వస్తున్నారు. వీరు కేవలం సరుకులు కొనుగోలు చేసి ఇచ్చేందుకు మాత్రమే కాంట్రాక్టు పొందుతారు. సరుకులు ఇచ్చాక లడ్డూ తయారీని వేరే వ్యక్తికి అప్పగిస్తారు. ఈ ఏడాది 60వేల లడ్డూలను మూడు రోజుల పాటు పండగ సందర్భంగా అందజేసేందుకు సిద్ధం చేస్తున్నారు. తయా రు చేసిన లడ్డూలను అధికారులు తనిఖీ చేసి నాణ్య త బాగాలేదన్న నిర్ణయానికి వచ్చారు. లడ్డూ ప్రసాదంతో పాటు తయారీకి ఉపయోగించే పది రకాల సరుకుల శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపారు. నాలుగు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించాం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా ప్రసాదాల తయారీకి వచ్చిన ముడి సరుకుల నాణ్యత బాగులేదు. సోమవారం రాత్రి సహాయ ఫుడ్ కంట్రోల ర్ ఎం.శ్రీనివాసరావు, పర్యవేక్షకులు ఎం.ఏ.కరీముల్లాల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించాం. ఇప్పటికే తయారు చేసిన లడ్డూతో పాటు పది రకాల సరకుల శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపించాం. నాలుగు రోజుల్లో రిపోర్టులు ఇవ్వాలని ఆదేశించాం. వేరుశనగ పలుకుల్లో ఎఫ్లోటాక్సిన్ అనే రసాయనం ఉన్నట్టు గుర్తించి వాటిని వెనక్కు పంపాలని ఆదేశాలు జారీ చేశాం. నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపించనున్నాం. –కె.వెంకటరత్నం, ఫుడ్‌సేఫ్టీ అధికారి, విజయనగరం అధికారులు సేకరించిన శాంపిళ్ల వివరాలు: పటిక బెల్లం, ఆవునెయ్యి(అమృత), ఆయిల్, ఆవాలు, పంచదార, వేరుశనగ పలుకులు, కిస్మిస్, జీడిపప్పు, లడ్డు, శనగపప్పు -
వినియోగదారులూ.. మేల్కోండి!
► వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరం ► కలెక్టర్ లక్ష్మీనరసింహం శ్రీకాకుళం పాతబస్టాండ్ : వినియోగదారులకు తమ హక్కులపై సంపూర్ణ అవగాహన ఉండాలని కలెక్టర్ పి. లక్ష్మీనరసింహం అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆహార సురక్షిత అంశాలపై కల్తీ నిరోధక శాఖ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తాగునీరు, పాలు, కూరగాయలు తదితర అంశాల్లో కల్తీలను ఏ విధంగా ఎదుర్కోవాలన్న విషయాన్ని తెలియజేయాలని చెప్పారు. మెడికల్ దుకాణాలలో వైద్యుని చీటీ మీద మాత్రమే మందులు విక్రయించాలని తెలిపారు. కల్తీలను పరిశీ లించే అధికారులు.. చక్కగా, సకాలంలో ఈ తనిఖీలు చేయడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు మాట్లాడు తూ.. సినిమా థియేటర్లకు వెళ్లేటప్పుడు బయట తినుబండారాలను తీసుకువెళ్లవచ్చని, ఈ మేరకు న్యాయస్థానం తీర్పు ఉందన్నారు. వినియోగదారులు ఆలోచించడం మొదలు పెట్టాలని, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కాల పట్టికలో సూచించిన మేరకు సేవలు అందకపోయినా వినియోగదారుల ఫోరంలో కేసు వేయవచ్చని తెలిపారు. జిల్లా వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి ఎల్. శ్రీరామమూర్తి మాట్లాడుతూ.. వినియోగదారుల ఫోరంలో సత్వర న్యాయం లభిస్తుందన్నారు. సామాన్య వినియోగదారులను చైతన్యవంతం చేయాలని చెప్పారు. కలెక్ట ర్ కార్యాలయ న్యాయ సలహాదారు పప్పల జగన్నాథరావు మాట్లాడుతూ వినియోగదారుల చట్టం చాలా ప్రయోజనకరమైనదన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖా ధికారి డాక్టర్ ఎస్.తిరుపతిరావు మాట్లాడుతూ వైద్య సేవలు పొందేవారూ వినియోగదారులేనని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులు ధరల పట్టికను ప్రజలకు తెలిసే విధంగా ఉంచాలని చెప్పారు. జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు బగాది రామ్మోహనరావు మాట్లాడు తూ వినియోగదారుల ఉద్యమం బలోపేతం కావాలన్నారు. అంతకుముందు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో వైద్య ఆరోగ్యశాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను, రైతు బజారులో ఏర్పాటు చేసిన రైపెనింగ్ చాంబర్ మోడల్‌ను, తూనికలు, కొలతల శాఖ, డ్రగ్స్ కంటోల్ శాఖ, గ్యాస్ కంపెనీల ప్రదర్శనలను అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా పౌరసరఫరాల అధికారి హెచ్వీ జయరాం, ఫుడ్ సేఫ్టీ అధికారి జి. ప్రభాకరరావు, మార్కెటింగ్ సహాయ సంచాలకులు వైవీ శ్యామ్‌ప్రసాద్, సహాయ డ్రగ్ కంట్రోలర్ సీహెచ్ కిరణ్‌కుమార్, భారత్‌గ్యాస్ ప్రతినిధి ఆదినారాయణశాస్త్రి, హెచ్‌పీ గ్యాస్ ప్రతినిధి డి. శ్రీని వాసరావు పాల్గొన్నారు.