విజయనగరం కంటోన్మెంట్ : కల్తీ ఘనులు, నాణ్యత లేని వస్తువులను అందించే అక్రమార్కులు పైడితల్లమ్మ ప్రసాదాన్నీ వదల్లేదు. జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు అయిన పైడి తల్లమ్మ సిరిమానోత్సవ సంబరానికి, పండగ మూడు రోజుల పాటు భక్తులకు అందించే ప్రసాదాల తయారీకి కల్తీ సరుకులు అంటగడుతున్నారు. ఈ విషయం ఆహార కల్తీ నిరోధక శాఖ ఆధ్వర్యంలోని ఆహార భద్రతాధికారుల తనిఖీల్లో బట్టబయలైంది. సోమవారం రాత్రి సహాయ ఫుడ్‌కంట్రోలర్ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని బందం తనిఖీలు చేపట్టింది. ఆహార పదార్థాలను తయారు చేసే ప్రాంతాన్ని పరిశీలించి తనిఖీలు నిర్వహించింది. వీరి ప్రాధమిక తనిఖీల్లో వేరుశనగ గుళ్లు పాడయినవి వినియోగిస్తున్నట్టుగా గుర్తించారు. అందులో ఎఫ్లోటాక్సిన్ అనే రసాయన విష పదార్థం ఉన్నట్టు తేల్చారు. వీటిని వినియోగించవద్దని వెంటనే ఆలయ అధికారులు, తయారీదారులను ఆదేశించారు. అంతే గాకుండా అప్పటికే తయారై సిద్ధంగా ఉన్న పైడితల్లి అమ్మవారి లడ్డూతో సహా పది రకాల సరుకుల శాంపిళ్లను తీశారు. వాటిని విశాఖపట్నంలోని రీజనల్ ల్యాబ్‌కు తరలించి నాలుగు రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు.
ఉత్సవానికి సిద్ధమైన ప్రసాదాలు
సిరిమానోత్సవానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు పైడితల్లి అమ్మవారి ప్రసాదాన్ని అందజేస్తున్నారు. పులిహోర, లడ్డూ ఇందులో ముఖ్యమైనవి. వీటిని తయారు చేసేందుకు ఏటా కాంట్రాక్టు ఇస్తున్నారు. ఈ కాంట్రాక్టును పొందేందుకు ముగ్గురు నుంచి నలుగురు కాంట్రాక్టర్లు అలవాటుగా వస్తున్నారు. వీరు కేవలం సరుకులు కొనుగోలు చేసి ఇచ్చేందుకు మాత్రమే కాంట్రాక్టు పొందుతారు. సరుకులు ఇచ్చాక లడ్డూ తయారీని వేరే వ్యక్తికి అప్పగిస్తారు. ఈ ఏడాది 60వేల లడ్డూలను మూడు రోజుల పాటు పండగ సందర్భంగా అందజేసేందుకు సిద్ధం చేస్తున్నారు. తయా రు చేసిన లడ్డూలను అధికారులు తనిఖీ చేసి నాణ్య త బాగాలేదన్న నిర్ణయానికి వచ్చారు. లడ్డూ ప్రసాదంతో పాటు తయారీకి ఉపయోగించే పది రకాల సరుకుల శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపారు.
నాలుగు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించాం
పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా ప్రసాదాల తయారీకి వచ్చిన ముడి సరుకుల నాణ్యత బాగులేదు. సోమవారం రాత్రి సహాయ ఫుడ్ కంట్రోల ర్ ఎం.శ్రీనివాసరావు, పర్యవేక్షకులు ఎం.ఏ.కరీముల్లాల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించాం. ఇప్పటికే తయారు చేసిన లడ్డూతో పాటు పది రకాల సరకుల శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపించాం. నాలుగు రోజుల్లో రిపోర్టులు ఇవ్వాలని ఆదేశించాం. వేరుశనగ పలుకుల్లో ఎఫ్లోటాక్సిన్ అనే రసాయనం ఉన్నట్టు గుర్తించి వాటిని వెనక్కు పంపాలని ఆదేశాలు జారీ చేశాం. నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపించనున్నాం. –కె.వెంకటరత్నం, ఫుడ్‌సేఫ్టీ అధికారి, విజయనగరం
అధికారులు సేకరించిన శాంపిళ్ల వివరాలు:
పటిక బెల్లం, ఆవునెయ్యి(అమృత), ఆయిల్, ఆవాలు, పంచదార, వేరుశనగ పలుకులు, కిస్‌మిస్, జీడిపప్పు, లడ్డు, శనగపప్పు
అమ్మ ప్రసాదానికి కల్తీ మరక
Published Wed, Sep 27 2017 1:07 PM | Last Updated on Wed, Sep 27 2017 1:07 PM
Advertisement
Advertisement