ప్యాకింగ్ చేసిన బస్తాలను పరిశీలిస్తున్న సీఐ సునీత
మొయినాబాద్(చేవెళ్ల): సాధారణ బియ్యం, కందిపప్పులను బ్రాండెడ్ పేర్లతో ప్యాకింగ్ చేస్తున్న గోదాంపై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. గోదాంలోని బియ్యం, కందిపప్పుతోపాటు ఇతర సరుకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మొయినాబాద్ మండలంలోని అమ్డాపూర్ రోడ్డులో ఉన్న ఓ వ్యవసాయ క్షత్రంలో మంగళవారం సాయంత్రం వెలుగుచూసింది.
మొయినాబాద్ సీఐ సునీత తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బేగంబజార్‌కు చెందిన రాంనివాస్‌సోలంకీకి మొయినాబాద్ మండలంలో జేబీఐఈటీ కళాశాల సమీపంలో అమ్డాపూర్ రోడ్డు పక్కన వ్యవసాయ క్షేత్రం ఉంది.అందులో గరిమ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో గోదాం నిర్మించాడు. ఒడిశా నుంచి తక్కువ ధరకు సాదారణ బియ్యం, కందిపప్పు కొనుగోలు చేసి ఇక్కడి గోదాంకు తీసుకొస్తారు. గోదాంలో వాటిని బ్రాండెడ్ పేర్లతో ప్యాకింగ్ చేస్తారు.
కోహినూర్ బాస్మతి రైస్, రియల్ డైమండ్, ఇండియా గేట్ వంటి బ్రాండ్ల పేర్లతో తయారు చేసిన కవర్లలో బియ్యాన్ని, అంకుల బ్రాండ్‌తో తయారు చేసిన కవర్లలో కందిపప్పును ప్యాక్ చేసి నగరంలోని బేగం బజార్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించారు.ఎస్‌ఓటీ సీఐ ప్రవీణ్‌రెడ్డి, ఏఎస్సై అంతిరెడ్డి సిబ్బందితో వచ్చి దాడి చేశారు. గోదాంలో 200 టన్నుల బియ్యం, 12 టన్నుల కందిపప్పు ఉన్నట్లు గుర్తించారు. వీటితోపాటు సాధారణ గోధుమ పిండి ఉంది.
స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ సునీత సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బ్రాండెడ్ పేర్లతో ప్యాక్ చేసిన 200 టన్నుల బియ్యం, 12 టన్నుల కందిపప్పును స్వాధీనం చేసుకుని గోదాంను సీజ్ చేశారు. ఈ అక్రమ దందాకు పాల్పడుతున్న వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం, కందిపప్పు విలువ సుమారు రూ. 1 కోటి వరకు ఉంటుందని.. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. రెండేళ్లుగా ఈ దందా సాగుతున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment