చిన్నారుల నుంచి పెద్దవారి వరకు ఐస్‌క్రీములను ఇష్టపడనివారు ఉండరు. వేసవిలో అయితే అందరూ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఐస్‌క్రీములు తినాల్సిందే. అయితే మనం తినే ఐస్‌క్రీముల వెనుక అనేక చేదు నిజాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఐస్‌క్రీముల్లో విపరీతంగా రంగులు వాడుతున్నారని, వీటివల్ల ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మోతాదుకు మించి రంగులు వాడటం, అనుమతి లేని కల్తీ రంగులు వినియోగిస్తుండటంతో ప్రమాదం పొంచి ఉందని పేర్కొంటున్నారు.
సాక్షి, అమరావతి : ఈ వేసవిని ఐస్‌క్రీమ్ తయారీ ఫ్యాక్టరీలు సొమ్ము చేసుకుంటున్నాయి. అనేక రంగులతో ఆకర్షణీయంగా కనిపించే ఈ ఐస్‌క్రీముల్లో కల్తీ జరుగుతున్నట్టు ఆహార భద్రతా అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ప్రతి ఐస్‌క్రీములోనూ నాసిరకం రంగులే వాడుతున్నారని తేలింది. అంతేకాకుండా ఐస్‌క్రీముల్లో వాడే ప్రతి పదార్థం నాసిరకమైందేనని లేదా కల్తీ జరుగుతున్నదేనని స్పష్టమైంది. రాష్ట్రంలో మూడు వేలకుపైగా చిన్నాపెద్ద ఐస్‌క్రీము ఫ్యాక్టరీలు ఉండగా వాటిలో 90 శాతం ఫ్యాక్టరీలకు అనుమతి లేదు. లైసెన్స్ ఉందా? లేదా? అని అడిగే అధికారులూ లేరు. దీంతో వేసవిలో నాలుగు నెలలపాటు ఐస్‌క్రీముల వ్యాపారం కోట్ల రూపాయల్లో జరుగుతోంది. ఈ స్థాయిలో వ్యాపారం జరుగుతున్నా ఐస్‌క్రీముల్లో నాణ్యత ఉందా? లేదా?, ఆహార భద్రతా ప్రమాణాల మేరకే ఇవి తయారవుతున్నాయా వంటి విషయాలపై అటు ప్రభుత్వం, ఇటు అధికారులు దృష్టి సారించడం లేదు. లక్షలాది మంది నిత్యం ఐస్‌క్రీములను తింటూ అనారోగ్యం పాలవుతున్నా ప్రభుత్వ యంత్రాంగానికి చీమకుట్టినట్టు కూడా లేదు. ప్రధానంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారులు కల్తీ పదార్థాలతో కూడిన ఐస్‌క్రీములు తినడం వల్ల శ్వాసకోశ, గొంతువాపు, జీర్ణకోశ వ్యాధులకు గురవుతున్నారు.
అన్నింటా అనుమతి లేని రంగులే..
ఎక్కువ శాతం ఐస్‌క్రీముల్లో అనుమతి లేని రంగులు వాడుతున్నారు. దీంతోపాటు తయారీ కంపెనీలకు లైసెన్సులు లేవు. అత్యంత హాని కలిగించే శాక్రిన్‌ను మోతాదుకు మించి వాడుతున్నట్టు తేలింది. దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. డ్రమ్ముల్లో నీళ్లు నింపి వారం పది రోజుల తర్వాత కూడా అవే నీటిని ఐస్‌క్రీముల తయారీకి వినియోగిస్తున్నారు. సాధారణంగా ఐస్‌క్రీముల్లో హై ఫ్యాట్, మీడియం ఫ్యాట్, లో ఫ్యాట్ రకాలు వాడతారు. కానీ ఈ ఫ్యాట్ మోతాదు సరైన స్థాయిలో ఉండకపోవడంతో ఐస్‌క్రీమ్ నిల్వలో తేడా వస్తుంది. అదేవిధంగా ప్యాకింగ్ లేబుళ్లపై తయారీ తేదీ, ఎక్స్‌పెయిరీ తేదీ ఉండటం లేదు. ఆయా ఫ్యాక్టరీల్లో పారిశుధ్యం అత్యంత ఘోరంగా ఉన్నట్టు తేలింది. విజయవాడ, గుంటూరు కల్తీ ఐస్‌క్రీములకు అడ్డాగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేసవిలో రాష్ట్రవ్యాప్తంగా నెలకు రూ.200 కోట్లకుపైనే ఐస్‌క్రీముల వ్యాపారం జరుగుతున్నట్టు అధికారుల అంచనా.
తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నాం
ఐస్‌క్రీముల్లో అనుమతి లేని రంగులు వాడుతుంది నిజమే. కొద్దిరోజుల క్రితం తనిఖీలు నిర్వహించి కొన్ని కేసులు కూడా నమోదు చేశాం. తిరిగి తనిఖీలు నిర్వహిస్తాం. ఎలాంటి లోపాలున్నా ఆయా కంపెనీలను సీజ్ చేసి, వారిపై కేసులు నమోదు చేస్తాం. లైసెన్సు లేకపోయినా ఆయా ఫ్యాక్టరీలు సీజ్ చేస్తాం. – పూర్ణచంద్రరావు, ఆహార భద్రతా నియంత్రణాధికారి
Comments
Please login to add a commentAdd a comment