
‘విజయ’ నూనెలో కల్తీ
బయటపడిన బాగోతం.. 10 వేల కిలోల కల్తీ నూనె గుర్తింపు
హైదరాబాద్: ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ ఆయిల్‌ఫెడ్ విక్రయిస్తున్న ‘విజయ’ బ్రాండ్ నూనెల్లో కల్తీ జరుగుతోంది. కొందరు అధికారుల వ్యవహారం, అక్రమాలు ‘విజయ’కు మచ్చతెస్తున్నాయి. గురువారం కొందరు డీలర్లు నాలుగు లారీల లోడ్ వంటనూనెను హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న విజయ ఆయిల్ ప్యాకింగ్ యూనిట్‌కు తీసుకొచ్చారు. ఆ నూనె కల్తీదని గుర్తించిన అధికారులు తీసుకోవడానికి నిరాకరించారు. కానీ అక్కడి నాణ్యత నియంత్రణాధికారి ఒక లారీ (10 వేల కిలోల) నూనె తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ విషయం తెలియడంతో ఆయిల్‌ఫెడ్ ఎండీ వీరబ్రహ్మయ్య వెంటనే ఉన్నతాధికారులను పంపి తనిఖీ చేయించారు. వారు ఆ 10 వేల కిలోల నూనె కల్తీదని నిర్ధారించి, సీజ్ చేశారు. నాణ్యత నియంత్రణ అధికారిని సస్పెండ్ చేశారు.
ఉత్పత్తి కేంద్రాలను మూసేసి..
రాష్ట్రంలో పండే నూనె గింజల నుంచి ఆయిల్ తయారుచేసి వినియోగదారులకు తక్కువ ధరలో అందించేందుకు ఆయిల్‌ఫెడ్‌ను ఏర్పాటుచేశారు. అందులో భాగంగా 1989లో మహబూబ్‌నగర్ జిల్లా బీచ్‌పల్లిలో రూ.25 కోట్లతో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఆసియాలోనే పెద్దదైన ఈ ప్లాంట్‌ను 2001లో మూసేశారు. తర్వాత చిత్తూరు జిల్లా పీలేరు, అనంతపురంలోని ప్లాంట్లను అమ్మేశారు. అప్పటి నుంచి తాము ఉత్పత్తి చేయకున్నా పామాయిల్, సన్‌ఫ్లవర్, వేరుశనగ నూనెలన్నీ తామే తయారుచేస్తున్నట్లు ‘విజయ’ బ్రాండ్ ప్యాకెట్లపై ముద్రించి విక్రయిస్తున్నారు.
బ్రాండ్‌ను అడ్డం పెట్టుకుని..
విజయ బ్రాండ్ నూనెకు ప్రజల్లో బాగా ఆదరణ ఉంది. దీనిని అడ్డుపెట్టుకొని ఆయిల్‌ఫెడ్ అధికారులు అక్రమ వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆయిల్‌ఫెడ్ ఎక్కడా నూనె గింజలు ఉత్పత్తి చేయడం లేదు. ప్రైవేటు దళారుల నుంచి నూనెను తీసుకుని ప్యాకింగ్ చేసి విక్రయిస్తోంది. దీనినే కొందరు అధికారులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. వారిలో కొందరు బినామీ పేర్లతో డీలర్ల అవతారమెత్తి కల్తీ నూనెలను సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు అసలు నూనె ప్యాకింగ్ చేయడానికి ఆయిల్ ఫెడ్‌కు లెసైన్స్ లేదంటూ తూనికలు కొలతల శాఖ స్పష్టం చేయడం గమనార్హం.
కల్తీ నూనెగా నిర్ధారించాం..
రాజేంద్రనగర్‌లోని విజయ ప్యాకింగ్ యూనిట్‌కు గురువారం వచ్చిన లారీ నూనె కల్తీదని నిర్ధారించాం. దానిని తీసుకోవడానికి అనుమతించిన అధికారిని సస్పెండ్ చేశాం. ఆయిల్ ఫెడ్‌కు ప్యాకింగ్ యూనిట్‌గా లెసైన్సు ఉందా లేదా అన్న విషయం నాకు తెలియదు. దీనిపై పూర్తి విచారణ చేసి తగిన చర్యలు చేపడతాం..
- ఎం.వీరబ్రహ్మయ్య, ఆయిల్‌ఫెడ్ ఎండీ