
లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం లక్ష్యంగా చంద్రబాబు కుట్ర
తన వీర విధేయ పోలీసు అధికారులతో సిట్
తాజాగా స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు సుప్రీం కోర్టు ఆదేశం
బెడిసికొట్టిన బాబు పన్నాగం
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన ‘సిట్’ స్కిట్ బెడిసికొట్టింది. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) షట్టర్ క్లోజ్ అయ్యింది.
లడ్డూ ప్రసాదం అంశంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించడంతో సిట్ కథ మఖలో పుట్టి పుబ్బలో ముగిసినట్లైంది. తన రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీవారి ఆలయ పవిత్రత, లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి భంగం కలిగించేందుకు సైతం చంద్రబాబు వెనుకాడరన్న వాస్తవం జాతీయస్థాయిలో బట్టబయలైంది.
కుట్ర పూరితంగానే సిట్
లడ్డూ ప్రసాదంపై తన దుష్ప్రచారానికి రాజముద్ర వేసేందుకు చంద్రబాబు పక్కా పన్నాగంతోనే సిట్‌ను ఏర్పాటు చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీతోపాటు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు చేసిన డిమాండ్‌ను అందుకే బేఖాతర్ చేశారు. టీడీపీ వీర విధేయులతో సిట్‌ను నియమించారు. అత్యంత వివాదాస్పద అధికారి, ఇటీవల ఎన్నికల్లో టీడీపీ కూటమి అక్రమాలకు కొమ్ము కాశారని ఆరోపణలు ఎదుర్కొన్న గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్ ఇన్‌చార్జ్‌గా నియమించడం ప్రభుత్వ పెద్దల కుట్రను బయటపెట్టింది.
ఈ బృందంలో విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టీ, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజులను సభ్యులుగా నియమించారు. గోపీనాథ్ జెట్టి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య అల్లుడు కావడం గమనార్హం. రిటైరైన తరువాత కొన్నేళ్లు హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్‌గా వ్యవహరించిన కృష్ణయ్యను 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్‌గా నియమించారు. ఇక 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పదవి కట్టబెట్టడం గమనార్హం.
సిట్ ఏర్పాటు చేసిన తరువాత టీటీడీ ద్వారా తిరుపతిలోని ఈస్ట్ పోలీసు స్టేషన్‌లో నెయ్యిలో కల్తీపై ఫిర్యాదు చేయించడం గమనార్హం. ఆ ఫిర్యాదు చేసే ముందు రోజు రాత్రే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐని బదిలీ చేసి ఆ స్థానంలో టీడీపీ అనుకూల పోలీసు అధికారిని నియమించడం ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేసింది. అనంతరం సిట్ బృందం తిరుమల–తిరుపతిలలో రెండు రోజుల పాటు దర్యాప్తు పేరిట హడావుడి చేసింది.
సుప్రీం కొరడా... సిట్ క్లోజ్
లడ్డూ అంశంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసును గత నెల 30న తొలిసారి విచారించిన సమయంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం హోదాలో ఉంటూ లడ్డూ ప్రసాదంపై నిరాధార ఆరోపణలు చేయడం ఏమిటని సీఎం చంద్రబాబును ఆక్షేపించింది.
కనీసం దేవుడిని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. లడ్డూ ప్రసాదం అంశంపై సిట్ దర్యాప్తు సరిపోతుందా..? లేదంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలా అన్నది ఆలోచిస్తామని ఆ రోజే తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు ప్రభుత్వం తిరుపతిలో దర్యాప్తు నిర్వహిస్తున్న సిట్ కార్యకలాపాలను తక్షణం నిలిపివేసింది.
తాజాగా శుక్రవారం ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి నిర్ణయాన్ని ప్రకటించిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర బృందం దర్యాప్తు నిర్వíßæంచాలని ఆదేశించింది. దాంతో కుట్రపూరితంగా టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ కథ సమాప్తమైంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది.
దేవ దేవుడి విశిష్టత కాపాడాలి
తిరుమల లడ్డూ ప్రసాదం కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పు వెలువరించింది. కోట్లాది మంది ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ వారికి టీటీడీపై నమ్మకం కలిగించేలా స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. లడ్డూ తయారీలో కల్తీ అయిన నెయ్యి వాడినట్టు తమకు ప్రాథమిక ఆధారాలు కనిపించట్లేదని అభిప్రాయపడింది.
ల్యాబ్ రిపోర్టు ఆధారంగా చేస్తున్న ఆరోపణలను తప్పుపట్టింది. ఆ రిపోర్టులో ఫాల్స్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని చెప్పింది. సీఎం దగ్గర ఏదైనా మెటీరియల్ ఉందా? తొందరపడి ముందుగా మాట్లాడటం ఏమిటి? దేవుడిని ఎందుకు రాజకీయాల్లోకి తీసుకొస్తారని నిలదీసింది. అదే సుప్రీంకోర్టు నిజాలను నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించడం శుభపరిణామం. ఈ క్రమంలోనే కోర్టును రాజకీయ రణరంగంగా వాడుకోవద్దని కూడా కోరింది. – ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు
మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు
ప్రజల కష్టాలను పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెడుతోంది. సచివాలయ, వలంటీర్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. ఇప్పుడు కొత్తగా ఊరికో మద్యం షాపును తెస్తోంది.
హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపింది. ఇందులో భాగమే శ్రీవారి లడ్డూ వివాదం. సనాతన ధర్మాన్ని ఇప్పుడు తానే కనిపెట్టినట్లు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. గతంలో కులాల మధ్య చిచ్చు పెట్టింది వీళ్లే. ఇప్పుడు మతాల మధ్య చిచ్పు పెడుతున్నారు. వీరందరికీ సుప్రీంకోర్టు తీర్పు గుణపాఠం కావాలి. – గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే
దేవుడితో రాజకీయాలు సరికాదు
దేశ సర్వోన్నత న్యాయ స్థానం శ్రీవారి ప్రతిష్టతను కాపాడే గొప్ప బాధ్యతను తీసుకుంది. దేవుడితో రాజకీయాలు చేయడం మంచిది కాదు. సర్వమతాలను సమానంగా గౌరవించాలి. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ఒక్కోసారి ఒక్కో విధంగా ఆరోపణలు వినిపించాయి. సుప్రీంకోర్టు టీటీడీపై ప్రజలకున్న విశ్వాసాన్ని కాపాడేందుకు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. దీనిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. – వేముల హజరత్తయ్య గుప్త, న్యాయవాది
కోర్టు తీర్పు గుణపాఠం కావాలి
పవిత్రమైన తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీం తీర్పు అవకాశవాదులకు గుణపాఠం కావాలి. తిరుమల లడ్డూ కల్తీ అయిందని సరైన ఆధారాలతో నిర్ధారించకుండానే భక్తుల మనోభావాలను ప్రభావితం చేసేలా రాజకీయ పార్టీ నేతలు మాట్లాడటం తగదు. దీనిని దేశంలోని అన్ని హైందవ మఠాలు, పీఠాధిపతులు ముక్తకంఠంతో ఖండించాలి.
సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో లడ్డూ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం హర్షణీయం. టీటీడీ పాలక మండలిలో రాజకీయేతర వ్యక్తులను నియమించాలి. – బ్రహ్మశ్రీ అనిపెద్ది వెంకట నరసింహ శర్మ మూర్తి, కాణ్వ విద్యా పీఠాధిపతి
Comments
Please login to add a commentAdd a comment