నిజాల నిగ్గు తేల్చాలి | YSRCP General Secretary Sajjala Ramakrishna Reddy in a TV interview | Sakshi
Sakshi News home page

నిజాల నిగ్గు తేల్చాలి

Published Mon, Sep 23 2024 5:42 AM | Last Updated on Mon, Sep 23 2024 5:42 AM

YSRCP General Secretary Sajjala Ramakrishna Reddy in a TV interview

కల్తీ నెయ్యిని వాడనప్పుడు లడ్డూ కల్తీ ఎలా అవుతుంది?  

టీటీడీ ప్రాశస్త్యాన్ని చంద్రబాబు అప్రతిష్టపాల్జేశారు 

స్వార్థ రాజకీయాల కోసం దేవుణ్ని వాడుకోవడం దారుణం 

టీవీ ఇంటర్వ్యూలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి  

సాక్షి, అమరావతి : ‘వందల కోట్ల మందికి శ్రీవారు ఆరాధ్య దైవం. తిరుమల ప్రసాదానికి అత్యంత పవిత్రత ఉంది. అలాంటి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు కలిపారన్న అనుమానాలు రేకెత్తించింది ముఖ్యమంత్రి చంద్రబాబే కాబట్టి.. వాటి నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కూడా ఆయనదే. అసలు కల్తీ నెయ్యిని వాడనప్పుడు.. అపచారానికి తావే లేదు. ఈ విషయంలో పూర్తి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన చంద్రబాబు.. కోట్లాది మంది భక్తుల మనోభావాలపై దెబ్బకొట్టారు.

దాన్ని సవరించాల్సిన బాధ్యతను విస్మరించి సంప్రోక్షణ అంటూ ఇంకా డ్రామాలు చేస్తున్నారు’ అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూ వివాదంపై ఆయన ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు ప్రస్తావించారు. స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు దేవుణ్ని వాడుకోవడం దారుణం అన్నారు. ‘నిజానికి నెయ్యిని అలా కల్తీ చేయడం సాధ్యమా? ఎవరైనా ఆ పని చేస్తారా? ఒకవేళ చేస్తే దేశ ద్రోహులు మాత్రమే ఆ పని చేయాలి. టెర్రరిస్టులో లేక మత విద్వేషం ఉన్న వారో చేయాలి. 

ఒకవేళ నెయ్యిలో నాణ్యత లేకపోతే, దాన్ని లోపలికి కూడా పోనివ్వరు. అలాంటప్పుడు నాణ్యత లేని నెయ్యిని వాడే అవకాశమే లేదు. కానీ, చంద్రబాబు ఉన్మాదిలా మాట్లాడుతున్నారు. అందుకే మా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రధానికి, సీజేఐకి లేఖ రాస్తానని చెప్పారు. పూర్తి స్థాయిలో విచారించాలని కోరారు. వాస్తవాలు తేల్చాలని, భక్తుల మనోభావాలు నిలబెట్టాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.   

చంద్రబాబు కుట్ర కోణం  
మూడు రోజులుగా జరుగుతున్న తతంగం చూస్తే, అసలు దాన్ని విపరీతంగా ప్రస్తావించింది, ప్రచారం చేసింది సీఎం చంద్రబాబేనని సజ్జల చెప్పారు. నెయ్యిలో కల్తీ కాదు.. ఏకంగా జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన నెయ్యి వాడుతున్నారని పచ్చిగా నింద మోపుతూ, చాలా నింపాదిగా  మాట్లాడటం స్పష్టంగా కనిపించిందన్నారు. బాబు మాటలను బట్టి ఇదంతా కుట్ర అని స్పష్టమవుతోందన్నారు. ‘జూలై 23న నెయ్యి పరీక్ష రిపోర్ట్‌ వస్తే.. ఇన్ని రోజులు ఎందుకు ఆగారు? ఆ రిపోర్ట్‌ అంత సీరియస్‌గా ఉంటే టీటీడీ ఈవో కానీ, సీఎం కానీ తక్షణ చర్యలకు ఎందుకు దిగలేదు? నెయ్యిలో ఏవో వెజిటబుల్‌ ఫ్యాట్‌ (వనస్పతి) గుర్తించామని, తగిన చర్యలు తీసుకుంటున్నామని తొలుత ఈవో చెప్పారు. ఇప్పుడు రెండు నెలల తర్వాత మాట మార్చి చెబుతున్నారు. 

అందుకే ఇది కుట్ర అని అనుమానాలు వస్తున్నాయి. అదుపులో లేని వ్యాధితో బాధ పడుతున్న వారు లేదా.. స్వార్థం కోసం కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్నా ఫరవాలేదనుకునే శాడిస్ట్‌లే ఇలాంటి పని చేస్తారు’ అని ధ్వజమెత్తారు. ‘ఏదైతే ఫీడ్‌ (ఆహారం) ఇస్తారో.. అంటే పామాయిల్‌ కేక్‌ వంటివి.. ఆ ఆవుల పాలలో అది కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు చంటి పిల్లల తల్లులు తీసుకునే ఆహారం వల్ల వారి పాలల్లో కూడా వాటి లక్షణాలు ఉంటాయి. సరిగ్గా.. ఇక్కడ కూడా ఆ పశువులకు ఇచ్చే దాణాలో ఉండే పదార్థ లక్షణాలు వాటి పాలలో కనిపిస్తాయి. 

ఇది సహజం. అంత మాత్రాన జంతువుల కొవ్వు ఉందని చెప్పడం దుర్మార్గం’ అన్నారు. ‘అమెజాన్‌లో కొట్టి చూడండి. నెయ్యి కేజీ బ్రాండ్‌ను బట్టి రూ.450 నుంచి రూ.550 వరకు ఉంటుంది. టీడీపీ హయాంలో కూడా నెయ్యి కిలో రూ.350కే సరఫరా చేశారు. మరి అప్పుడు నాణ్యత లేని, కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లా? నెయ్యిలో కల్తీ చేస్తే చెడు వాసన వస్తుంది. సొంత డెయిరీ ఉన్న చంద్రబాబుకు ఈ విషయాలు తెలీవా?’ అని సజ్జల మండిపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement