శ్రీవారి ప్రసాదం కల్తీ అయిందని ఏ ఆధారంతో చెబుతారు?
జూలైలో నివేదిక వస్తే సెప్టెంబర్ దాకా ఏం చేశారు?
దర్యాప్తు చేయకుండా కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎలా ప్రకటిస్తారు?
సుప్రీంకోర్టును సైతం కలవరపెట్టే ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి
ఏపీ సిట్‌తో వాస్తవాలు బయటపడవనే సుప్రీంకోర్టు జోక్యం కోరాను
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే ప్రకటించడం వెనుక కుట్ర కోణం ఉందని ప్రముఖ న్యాయవాది, మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని ఆరోపించడం ప్రపంచాన్ని కలవర పెట్టిందని అన్నారు. ప్రజల మనోభావాలను ప్రభావితం చేసే ఇలాంటి అంశాలను బహిరంగంగా ప్రకటించే ముందు దర్యాప్తు చేయాలన్నారు.
జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తిరుమల లడ్డూపై వచ్చిన ఆరోపణలపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి క్రైస్తవ ముద్ర వేసేందుకు చేసిన సందర్భాలను సైతం ఆయన ఇక్కడ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మీడియా సంస్థల బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపారు. ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్‌తో వాస్తవాలు తేలవని, అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన
ఇంకా ఏమన్నారంటే..
నెయ్యి శాంపిల్స్ పరీక్షలు చేసి, టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో వెనక్కు పంపించామని టీటీడీ ఈవో రిపోర్టులో స్పష్టంగా ఉన్నప్పటికీ, కల్తీ జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు పదే పదే బహిరంగంగా ప్రకటించడం దేనికి నిదర్శనం? ఇలా ఆరోపణలు చేశాక దర్యాప్తుకు ఆదేశిస్తారా? నిజానిజాలు నిర్ధారించుకోకుండా భక్తుల్లో అలజడి సృష్టించడానికి యతి్నంచడం కుట్ర కోణంగా భావించక తప్పదు. – ప్రముఖ న్యాయవాది, మాజీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్యస్వామి
జగన్ సీఎం అయినప్పటి నుంచి ఇదే వైఖరి
⇒ తిరుమల బాలాజీ లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని స్వయంగా ముఖ్యమంత్రే గత నెల 18న బహిరంగంగా ఆరోపించారు. ఆ తర్వాత ప్రసాదం కల్తీపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను నియమిస్తున్నట్టు సెపె్టంబర్ 26న ప్రకటించారు. ఇలాంటి తీవ్రమైన ఆరోపణ చేసేటప్పుడు సీఎం స్థాయిలో ఉన్న వారు వాస్తవమా.. కాదా
అని తొలుత దర్యాప్తు చేసి నిర్ధారించుకోవాలి.
⇒ కానీ ఇక్కడ అలా జరగలేదు. ముందు ఆరోపణ చేసి తర్వాత సిట్ దర్యాప్తు అన్నారు. పైగా కల్తీపై దర్యాప్తు కోసం అదే ప్రభుత్వం సిట్‌ను నియమించడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అనుకోవడం లేదు. జూలైలో కల్తీ జరిగిందని చెప్పి.. ఇంత కాలం తర్వాత ఇప్పుడు ఎందుకు సిట్‌ని నియమించారు? పైగా గత ప్రభుత్వంపై, నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన మంత్రులపై చాలా పెద్ద ఆరోపణలు చేశారు.
⇒ జగన్ సీఎం అయినప్పటి నుంచి తిరుపతిలో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారని ఓ ప్రణాళిక ప్రకారం ఆరోపణలు చేస్తూ వచ్చారు. తద్వారా నాటి సీఎం వైఎస్ జగన్‌పై మత ముద్ర వేసేందుకు చాలా ప్రయత్నం చేశారు. 2019లో సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేశారు. ఒక క్రైస్తవుడిని టీటీడీ చైర్మన్‌గా ఎలా నియమిస్తారని హిందూవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
⇒ వాస్తవమేంటంటే సుబ్బారెడ్డి గురించి తెలిసిన వారిని ఎవరిని అడిగినా ఆయన హిందువనే చెబుతారు. ఆయన 32 సార్లు మాల వేసుకుని శబరిమలకు వెళ్లివచ్చారు. ఇంట్లో గోశాల నిర్వహిస్తూ గోవులకు పూజ చేస్తున్నారు. ఇప్పుడు లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిపోయిందని చంద్రబాబు నాయుడు పత్రికల్లో పతాక స్థాయిలో స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇందులో సుప్రీంకోర్టును సైతం కలవరపెట్టే అంశాలు చాలా ఉన్నాయి. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించాను. ప్రస్తుతం ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ప్రత్యేక సిట్‌ను నియమించింది.
తప్పుడు వార్తలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
⇒ జూలైలో నెయ్యి శాంపిల్ తీసుకుని టెస్ట్ చేశారని టీటీడీ రిపోర్టులో ఉంది. ఆ రిపోర్టులో కల్తీ జరిగిందని గానీ, ఫిష్ ఆయిల్, కొవ్వు కలిసిందని గానీ ఎక్కడా లేదు. నెయ్యి నాణ్యత టీటీడీ ప్రమాణాలకు తగ్గట్టుగా లేనందున తిప్పి పంపించామని ఉందే తప్ప ప్రసాదం తయారీకి పంపించామని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఒక అబద్ధాన్ని సృష్టించి.. విస్తృతంగా ప్రచారం చేశారన్నది వాస్తవం. ఇలాంటప్పుడు కల్తీ జరిగిందని ఎలా చెబుతారు? ప్రసాదంపై చేసిన ఆరోపణ కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసేది. ఆరోపణలు చేయడం సులువే, కానీ వాటిని నిరూపించాలిగా!
⇒ వార్తాపత్రికలు కూడా జవాబుదారీగా ఉండాలి. రాజకీయ నాయకులు లడ్డూ ప్రసాదం, ఆలయ అంశాలను సమస్యగా మార్చి తమ గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేయవద్దని సుప్రీంకోర్టు గట్టిగానే చెప్పింది. ఈ హెచ్చరికను ప్రజలు ప్రశంసించారు. ఒకరి గుర్తింపును, ఎదుగుదలను రాజకీయంగా నాశనం చేసేందుకు తప్పుడు వార్తలను ప్రచారం చేసే ఏజెన్సీలు సైతం ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment