అవే నిబంధనలతో టీటీడీ టెండర్
10 లక్షల టన్నుల ఆవు నెయ్యి కొనుగోలుకు నోటిఫికేషన్
అంటే టెండర్‌పై బాబు ఆరోపణలన్నీ అబద్ధాలేగా!
అయిన వారి కోసమే టెండర్ నిబంధనలు మార్చారని బాబు గగ్గోలు
అందులో నిజం లేదని నిరూపించిన తాజా నోటిఫికేషన్
గత ప్రభుత్వ హయాంలో టెండర్ నిబంధనలు కఠినతరం.. రివర్స్ టెండరింగ్‌తో ఆదా
సాక్షి, అమరావతి: తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కలిపే ఆవు నెయ్యి సరఫరాకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహించిన టెండర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనన్న విషయం మరోసారి బహిర్గతమైంది. అయిన వారికి కట్టబెట్టడం కోసం అడ్డగోలుగా నిబంధనలు మార్చేశారంటూ ఆయన చేసిన ఆరోపణల్లో వీసమెత్తు నిజం లేదన్నది మరోసారి వెల్లడైంది.
ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు పది లక్షల కిలోల ఆవు నెయ్యి సరఫరాకు నిర్వహించిన టెండర్లలో ఏఆర్ డెయిరీ ఫుడ్స్ కాంట్రాక్టు దక్కించుకుంది. ఇప్పుడు అదే టెండర్ నిబంధనలతో తాజాగా పది లక్షల కిలోల ఆవు నెయ్యి సరఫరాకు ఈనెల 7న (సోమవారం) టీటీడీ మార్కెటింగ్ విభాగం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం సీఎం చంద్రబాబు బండారాన్ని బయటపెట్టింది. చంద్రబాబు ఆరోపణలన్నీ రాజకీయ దురుద్దేశంతో చేసినవేనన్న విషయాన్ని స్పష్టం చేసింది.
స్వచ్ఛత కోసం ప్రమాణాలు పెంపు
తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు, లడ్డూ, అన్న ప్రసాదాల తయారీలో వినియోగించే ఆవు నెయ్యి, ముడిసరుకుల సేకరణకు టీటీడీ మార్కెటింగ్ విభాగం ఎప్పటికప్పుడు టెండర్లు నిర్వహిస్తుంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యి సేకరణకు ఆర్నెల్లకు ఓ సారి టెండర్లు పిలుస్తుంది.
నెయ్యిలో తేమ శాతం 0.3 శాతానికి మించకూడదని, బూటిరో రిఫ్రాక్టో (బీఆర్) మీటర్ రీడింగ్ 40 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద 40–43 మధ్య ఉండాలని, ఆర్‌ఎం వాల్యూ కనిష్టంగా 26 ఉండాలని, బౌడౌన్, మినరల్ ఆయిల్, ఫారిన్ కలర్స్ టెస్టుల్లో నెగెటివ్ రావాలని, మెల్టింగ్ పాయింట్ 27–37 డిగ్రీల మధ్య ఉండాలనే ఎనిమిది ప్రమాణాలతో 2019 మే 29 వరకూ టెండర్లు పిలిచేవారు.
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత స్వచ్ఛమైన ఆవు నెయ్యి సేకరణకు మరో తొమ్మిది ప్రమాణాలను అదనంగా చేర్చింది. మొత్తం 17 ప్రమాణాలతో రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు నిర్వహించి, శ్రీవారి ఖజానాకు భారీగా ఆదా చేశారని టీటీడీ అధికారవర్గాలే చెబుతున్నాయి.
నిబంధనలు మరింత కఠినతరం
భూమన కరుణాకర్‌రెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యి సేకరణకు నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఈమేరకు 2023 నవంబర్ 14న టీటీడీ బోర్డు సమావేశంలో తీరా>్మనాన్ని ఆమోదించి అమలు చేశారు. ఆవు నెయ్యి సేకరణ టెండర్లలో పాల్గొనాలంటే కనీసం ఐదేళ్లు వరుసగా డెయిరీలో నెయ్యిని ఉత్పత్తి చేసి ఉండాలని, జాతీయ డెయిరీలైతే రోజుకు 4 లక్షల లీటర్లు, 1500 కిలోమీటర్ల పరిధిలోని డెయిరీలైతే రోజుకు 2 లక్షల లీటర్లు, రాష్ట్రంలోని డెయిరీలైతే రోజుకు లక్ష లీటర్ల పాలను సేకరిస్తుండాలని నిబంధనలు పెట్టారు.
జాతీయ డెయిరీలైతే నెలకు 360 టన్నులు లేదా ఏడాదికి 5 వేల టన్నుల ఆవు నెయ్యి ఉత్పత్తి చేసి ఉండాలని, రూ.500 కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలని షరతు విధించారు. 1,500 కిలోమీటర్ల పరిధిలోని డెయిరీలైతే నెలకు 180 టన్నులు లేదా ఏడాదికి 2,750 టన్నుల ఆవు నెయ్యిని ఉత్పత్తి చేసి ఉండి, రూ.250 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగి ఉండాలని నిబంధన పెట్టారు. రాష్ట్రంలోని డెయిరీలకైతే నెలకు 90 టన్నులు లేదా ఏడాదికి 1,500 టన్నుల ఆవు నెయియని ఉత్పత్తి చేసి ఉండి.. రూ.వంద కోట్ల టర్నోవర్ ఉండాలని షరతు విధించారు.
వాటిని నిక్కచ్చిగా అమలుచేయడంతో కాంట్రాక్టు పొందిన డెయిరీలు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని టీటీడీకి సరఫరా చేశాయి. ఇదే నిబంధనలతో ఎన్నికల సంఘం పర్యవేక్షణలో 2024 మార్చి 12న టీటీడీ పిలిచిన టెండర్లలో ఏఆర్ డెయిరీ ఫుడ్స్ నెయ్యి సరఫరా కాంట్రాక్టును దక్కించుకుంది. ఇప్పుడూ అవే నిబంధనలతో టీటీడీ టెండర్లు పిలవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment