
పోలీసులను ఆశ్రయించిన అవనిగడ్డకు చెందిన న్యాయ విద్యార్థి బడే గౌతమ్
అవనిగడ్డ: తిరుపతి వెంకటేశ్వరస్వామి లడ్డూ వ్యవహారంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, అవనిగడ్డ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ నేత మాధవీలతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కృష్ణాజిల్లా అవనిగడ్డలోని ఏడో వార్డుకు చెందిన న్యాయ విద్యార్థి బడే గౌతమ్ అవనిగడ్డ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమది హిందూ కుటుంబమని, తరచూ తిరుపతి వెళ్లి స్వామిని దర్శించుకుని లడ్డూ ప్రసాదాలు స్వీకరిస్తామని చెప్పారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు లడ్డూలో పందికొవ్వు కలిసిందని ఆరోపించడం తగదన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందువులను రెచ్చగొట్టేలా ప్రసంగించారని, హోంమంత్రి వంగలపూడి అనిత, తెలంగాణ బీజేపీ నేత మాధవీలత లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని మీడియో ముందు మాట్లాడారని, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ లడ్డూలో కల్తీ జరిగిందని దేవాలయాల్లో పూజలు చేయించారని చెప్పారు.
హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడంతో పాటు చట్టవ్యతిరేక విధానాలు అవలంబించిన వీరందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు గౌతమ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment