తిరుమల లడ్డూ విషయంలో రాజకీయ పార్టీలు, ధార్మిక సంస్థలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తి
హిందూ ధార్మిక విశ్వాసాలను దెబ్బతీసే కుట్రలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఏపీ సర్కారుకు సూచన
సాక్షి, హైదరాబాద్: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న అంశాన్ని సంచలనాత్మకంగా మార్చొద్దని రాజకీయ పార్టీలు, ధార్మిక సంస్థలకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సనాతన ధర్మాన్ని, హిందూ ధార్మిక విశ్వాసాలను దెబ్బతీసే కుట్రలు గతంలోనూ జరిగిన నేపథ్యంలో వాటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులను శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలతో భక్తుల నమ్మకం, విశ్వాసం సడలే ప్రమాదం ఉందని కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో పార్టీలు, ధార్మిక సంస్థలు బాధ్యతతో వ్యవహరించి సంయమనం పాటించాలని ఓ ప్రకటనలో సూచించారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి నిత్యం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు.. వారి మనోభావాలను పరిరక్షించేందుకు కృషి చేయాలని కిషన్ రెడ్డి కోరారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని పేర్కొన్నారు. హిందువులు ముఖ్యంగా శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం క్షమార్హం కాదన్నారు.
కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన నేరస్తులకు తగిన శిక్ష పడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దిశగా పోలీసు యంత్రాంగం, దర్యాప్తు సంస్థలు ముందుకు వెళ్తున్నాయని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి దురాగతానికి బాధ్యులైన వారందరినీ గుర్తించి తగిన శిక్ష పడేలా చేయాలని కోరారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలేవీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కిషన్‌రెడ్డి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment