
ఖైరతాబాద్ లో భక్తులపై లాఠీచార్జి
హైదరాబాద్: ఖైరతాబాద్ వినాయకుడి లడ్డూ ప్రసాదం కోసం భక్తులు ఎగబడడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ప్రసాదం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నగరంలోని వారే కాకుండా జిల్లాల నుంచి భక్తులు రావడంతో శుక్రవారం ఉదయం ఖైరతాబాద్ కిక్కిరిసింది. ఈ తెల్లావారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో వారంతా ఇబ్బంది పడాల్సి వచ్చింది.
కొంత మంది తమకు తెలిసిన వారికే ప్రసాదం పంచిపెట్టారు. దీంతో వరుసలో నించున్న భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ప్రసాదం తమకు దక్కదేమోనన్న ఆందోళనతో భక్తులు ముందుకు తోసుకువచ్చారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి పరిస్థితి అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఒక భక్తుడి తలకు తీవ్ర గాయమయినట్టు తెలుస్తోంది. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కొంతసేపు ప్రసాదం పంపిణీ నిలిచిపోయింది. సరైన ఏర్పాట్లు చేయని నిర్వాహకులపై భక్తులు మండిపడుతున్నారు. ఉదయం 11 గంటలకు ప్రసాదం పంపిణీ పూర్తయింది.