
టీటీడీకి బీఈఈ సహకారం అందజేస్తోందని తెలిపే ప్రచారచిత్రంతో బీఈఈ డీజీ అభయ్ బాక్రే, టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి (ఫైల్ ఫొటో)
సాక్షి, అమరావతి: ‘క్లీన్ కుకింగ్’ విధానంలో తిరుమల లడ్డూ మహా ప్రసాదం తయారు చేయటానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందజేసేందుకు కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి, రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్(ఏపీఎస్‌ఈసీఎం)కు బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే తాజాగా ఓ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో 2030 నాటికి 6.68 టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వెలెంట్ (ఎంటీవోఈ) ఇంధన ఆదాకు అవకాశం ఉందని, దేశ వ్యాప్తంగా బొగ్గు, విద్యుత్ కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో భవిష్యత్ విద్యుత్ అవసరాల కోసం ఈ లక్ష్యాన్ని సాధించేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇంకా ఆ లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి.
టీటీడీకి బీఈఈ సహకారం
► తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో పవిత్ర లడ్డూ మహా ప్రసాదం తయారు చేయటానికి క్లీన్ కుకింగ్ విధానం ఉపయోగించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను పూర్తిగా తగ్గించవచ్చు. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని బీఈఈ అందిస్తుంది.
► టీటీడీ సహకారంతో ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను ఏపీఎస్‌ఈసీఎం పంపించాలి. ఈ విధానంలో ప్రసాదం తయారీకి కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే గ్యాస్‌కు బదులు ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఉపయోగిస్తారు.
► కొద్ది రోజుల క్రితం మేము తిరుమలలో పర్యటించాం. ఆ సందర్భంలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ కుకింగ్, ఆస్పత్రులు, భవనాల్లో ఇంధన సామర్థ్య చర్యల అమలుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేఎస్ జవహర్‌రెడ్డికి సూచించాం. ట్యూబ్ లైట్లు, ఫ్యాన్ల స్థానంలో విద్యుత్ ఆదా చేసే ఎల్‌ఈడీ ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లను అమర్చాలని చెప్పాము. ఇందుకోసం ఇప్పటికే ఏపీఎస్‌ఈసీఎం టెండర్లు ఆహ్వానించింది.
విద్యుత్ బిల్లులు ఆదా
► టీటీడీలో ఏపీఎస్‌ఈసీఎం ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్‌ను బీఈఈ నిర్వహించింది. ఇక్కడ ఏటా 68 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా, 30% పునరుత్పాదక ఇంధనం, 70% సంప్రదాయ విద్యుత్ ఉంది.
► విద్యుత్ బిల్లుల కోసం టీటీడీ ఏటా రూ.40 కోట్లు వెచ్చిస్తోంది. ఇంధన సామర్థ్య చర్యల ద్వారా ఇందులో రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు వ్యయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 213 నీటి పంపుసెట్లలో 118 ఇంధన సామర్థ్య పంపుసెట్లను అమర్చడం వల్ల ఏటా 4.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేయవచ్చని అధ్యయనంలో తేలింది.
► టీటీడీలో ఇదివరకు రోజుకు 34 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తుండగా, ఇప్పుడు అది 44 లక్షల గ్యాలన్లకు చేరింది. ఈ దృష్ట్యా జల వనరుల సమర్థ నిర్వహణకు కూడా చర్యలు తీసుకుంటున్నాం.
పెట్టుబడుల సద్వినియోగం
► దేశంలో 2031 నాటికి రూ.10.02 లక్షల కోట్ల మేర ఇంధన సామర్థ్య పెట్టుబడులకు అవకాశముంది. ఏపీ ఇప్పటికే ఎనర్జీ ఎఫిషియెన్సీ రంగంలో దేశంలో ఉత్తమ రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. అందువల్ల ఇంధన సామర్థ్య పెట్టుబడులను ఆహ్వానించడంలోనూ క్రీయాశీలకంగా వ్యవహరించాలి.
► దీని వల్ల పరిశ్రమలు, రవాణా, విద్యుత్, భవన నిర్మాణం వంటి కీలక రంగాలలో ఇంధన వినియోగ సామర్థ్యాన్ని మెరుగు పరచడమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించవచ్చు. తద్వారా ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పనను మెరుగు పరచవచ్చు.
► కేంద్ర ప్రభుత్వం నేషనల్ కార్బన్ మార్కెట్ల(ఎన్‌సీఎం) అభివృద్ధికి చేపడుతున్న చర్యలపై బీఈఈ ఒక నమూనా కార్యాచరణ తయారు చేసింది. దీనిపై ఏపీ తరుఫున అభిప్రాయాలు, సూచనలు తెలపాల్సిందిగా ఏపీఎస్‌ఈసీఎంకి సూచించాం.
Comments
Please login to add a commentAdd a comment