ఆవు నెయ్యి.. టీడీపీకి గొయ్యి! | TDP was found to have distorted the NDDB test report | Sakshi
Sakshi News home page

ఆవు నెయ్యి.. టీడీపీకి గొయ్యి!

Published Fri, Sep 20 2024 5:34 AM | Last Updated on Fri, Sep 20 2024 7:19 AM

TDP was found to have distorted the NDDB test report

తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ సీఎం చంద్రబాబు 

శ్రీవారి లడ్డూ తయారీకి జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడారని ఉన్మాద వ్యాఖ్యలు 

వాటిపై ప్రపంచ వ్యాప్తంగా నిప్పులు చెరిగిన భక్తులు 

రాజకీయ లబ్దికి శ్రీవారికి అపచారం చేస్తారా అంటూ ఆగ్రహం 

దాంతో ఎన్‌డీడీబీ పరీక్ష నివేదికను వక్రీకరించబోయి అడ్డంగా దొరికిన టీడీపీ 

పరీక్ష కోసం ఆవు నెయ్యి శాంపిల్‌ను జూలై 12న ఎన్‌డీడీబీకి పంపిన టీటీడీ 

అది 17న తమకు చేరిందని.. జూలై 23న నివేదిక ఇచ్చామన్న ఎన్‌డీడీబీ 

అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమే 

ఆవు నెయ్యిలో వెజిటబుల్‌ ఫ్యాట్‌ కలిసిందని ఈవో శ్యామలరావు  వెల్లడి

అయితే జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం బాబు దు్రష్పచారం.. 

ఎన్‌డీడీబీ నివేదిక సాక్షిగా బయటపడ్డ బాబు నిజస్వరూపం

అడ్డంగా దొరికిపోయినా తీరు మార్చుకోని తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్‌  

వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించ డానికేనంటున్న భక్తులు, టీటీడీ వర్గాలు  

సాక్షి, అమరావతి : తిరుమల శ్రీవారి మహా ప్రసాదమైన లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిపై ఉన్మాద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డారు. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించారంటూ దుర్మార్గపు ఆరోపణలు చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా భక్తులు భగ్గుమన్నారు. 

వైఎస్సార్‌సీపీపై దుష్ఫ్రచారం చేసి, రాజకీయంగా లబ్ధి పొందడానికి తిరుమల శ్రీవారిని వాడుకుంటారా.. అంటూ హిందువులు నిప్పులు చెరిగారు. దాంతో తాను చేసిన ఆరోపణలను సమర్థించుకోవడానికి గురువారం ఎన్‌డీడీబీ (నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు) పరీక్ష నివేదికను వక్రీకరించి.. జంతువుల కొవ్వు నెయ్యిలో కలిపారంటూ సామాజిక మాధ్యమాల్లో టీడీపీ మూకలతో హోరెత్తించారు. 

కానీ.. ఆ పరీక్ష నివేదికను పరిశీలిస్తే.. ఆవు నెయ్యిని పరీక్షల కోసం 2024 జూలై 12న టీటీడీ పంపగా, అది తమకు జూలై 17న చేరిందని.. పరీక్షించి జూలై 23న నివేదిక ఇచ్చినట్లు అందులో స్పష్టంగా ఉంది. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమే. దానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు ప్రభుత్వమే.

అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. 
టీటీడీ ఈవోగా జె.శ్యామలరావును జూన్‌ 14న చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. ఎన్‌డీడీబీ పరీక్ష నివేదిక టీటీడీకి ఇచ్చిన రోజు అంటే.. జూలై 23న టీటీడీ ఈవో జె.శ్యామలరావు తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ ఒక ఆవు నెయ్యి ట్యాంకర్‌లో వనస్పతి వంటి వెజిటబుల్‌ ఫ్యాట్‌లు కల్తీ అయినట్లు ఎన్‌డీడీబీ నివేదిక ఇచ్చిందని చెప్పారు. 

ఆవు నెయ్యి కల్తీ చేసి సరఫరా చేసిన సంస్థను బ్లాక్‌ లిస్ట్‌లో ఎందుకు పెట్టకూడదో చెప్పాలంటూ షోకాజ్‌ నోటీసు ఇచ్చామని చెప్పారు. మరో ట్యాంకర్‌ ఆవు నెయ్యిలోనూ వెజిటబుల్‌ ఫ్యాట్‌ కలిపినట్లు తేలిందని, దాన్ని సరఫరా చేసిన సంస్థకు షోకాజ్‌ నోటీసు ఇచ్చామని ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. 

ఎన్‌డీడీబీ జూలై 23న రెండు ట్యాంకర్ల ఆవు నెయ్యిపై ఇచ్చిన పరీక్షల నివేదికలను విశ్లేషిస్తే.. అందులో వెజిటబుల్‌ ఫ్యాట్‌ కలిసినట్లు ఉందే తప్ప, ఎక్కడా జంతువుల కొవ్వు కలిసినట్లు లేదని టీడీపీ అధికార వర్గాలతోపాటు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కూడా తేల్చి చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే.. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించారంటూ చంద్రబాబు చేసిన ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టమవుతోంది.

ఈ ప్రశ్నలకు బదులేది

1 2024 జూలై 23న ఎన్‌డీడీబీ నివేదిక వచ్చిన వెంటనే టీటీడీ ఈవో శ్యామలరావు ప్రెస్‌మీట్‌ పెట్టి ఆవు నెయ్యిలో వనస్పతి వంటి వెజిటబుల్‌ ఫ్యాట్‌లు కల్తీ అయ్యాయని చెప్పారా లేదా?

2 దాదాపు రెండు నెలల తర్వాత చంద్రబాబు ఎన్డీఏ కూటమి మీటింగ్‌లో ‘‘నెయ్యికి బదులు’’ జంతువుల కొవ్వు వాడుతున్నారు అని చెప్పడం దురుద్దేశం కాక మరేమిటి?. ఈ రెండు నెలల ఎందుకు మౌనంగా ఉన్నారు. బుధవారం సడెన్‌గా రాజకీయ వేదికపై ఎందుకు మాట్లాడారు.?

3  టీటీడీ ఈవో మాట్లాడిన దానికి భిన్నంగా చంద్రబాబు అండ్‌ కో రాజకీయ విమర్శలు చేయడంలో ఆంతర్యం ఏమిటి.?  

4 తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎన్‌డీడీబీ రిపోర్టును రిలీజ్‌ చేయడం వెనుక మీకున్న కుట్రపూరిత ఆలోచన బహిర్గతం అవుతోంది కదా?  

5 నీ హయాంలోనే ఎన్‌డీడీబీకి టెస్ట్‌కు  పంపించావు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతే రిపోర్టు వచ్చింది. దానికి ఎవరు బాధ్యులు? సమాధానం చెప్పాల్సిన నువ్వే.. చెప్పకుండా, పైగా అరుస్తావెందుకు?

టెండర్ల ద్వారా స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనుగోలు 
శ్రీవారి నైవేద్యాలు, లడ్డూల తయారీ కోసం రోజుకు 15 టన్నుల నెయ్యిని టీటీడీ వినియోగిస్తోంది. ఈ నెయ్యిని ఈ – ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌ ద్వారా టెండర్లు పిలిచి కొనుగోలు చేస్తుంది. తక్కువ ధరకు కోట్‌ చేసిన సంస్థలకు ఆవు నెయ్యి సరఫరా బాధ్యతలను అప్పగిస్తుంది. టెండర్లలో పేర్కొన్న ప్రమాణాల మేరకు నెయ్యిని సరఫరా సంస్థలు ట్యాంకర్లలో టీటీడీకి సరఫరా చేయాలి. 

ప్రతి ట్యాంకర్‌ నెయ్యిని టీటీడీ అధికారులు తనిఖీ చేయిస్తారు. పరీక్షల్లో టెండర్లలో పేర్కొన్న ప్రమాణాల మేరకు నెయ్యి ఉంటేనే తీసుకుంటారు. లేదంటే.. సరఫరా సంస్థకు వెనక్కు పంపుతారు. కల్తీ నెయ్యి సరఫరా చేసినందుకు బ్లాక్‌ లిస్ట్‌లో ఎందుకు పెట్టకూడదో వివరణ ఇవ్వాలంటూ సంబంధిత సరఫరా సంస్థకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తారు. 

టీటీడీ చరిత్రలో ఇప్పుడే కాదు.. ఎప్పుడూ జంతవుల కొవ్వుతో కల్తీ అయిన నెయ్యిని సరఫరా సంస్థలు సరఫరా చేసిన దాఖలాలు లేవని.. అప్పుడప్పుడు వెజిటబుల్‌ ఫ్యాట్‌ కలిసిన నెయ్యిని సరఫరా చేస్తే.. దానిని వెనక్కు పంపుతున్నామని.. నెయ్యి కొనుగోలులో కీలక భూమిక పోషిస్తున్న టీటీడీ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.

దొంగల్లా దొరికినా రుబాబే 
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీకీ ఆ సంస్థ సరఫరా చేసిన రెండు ట్యాంకర్ల ఆవు నెయ్యిలో వెజిటబుల్‌ ఫ్యాట్‌ కలిసినట్లు మాత్రమే ఎన్‌డీడీబీ పరీక్ష నివేదిక ఇచ్చింది. జంతువుల కొవ్వు కలిసిన దాఖలాలే లేవని ఆ నివేదిక స్పష్టం చేయడం.. అప్పుడు అధికారంలో ఉన్నది తామే కావడంతో సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికపోయారు. అయినా సరే.. తాను చేసిన ఆరోపణలు నిజమని చాటిచెప్పేందుకు యథేచ్ఛగా గురువారం కూడా అబద్ధాలతో రుబాబు చేశారు. 

సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేశ్‌ మరో అడుగు ముందుకేసి అవాస్తవాలు వల్లె వేస్తూ.. హిందువుల మనోభావాలతో చెలగాటమాడుతూ వైఎస్సార్‌సీపీపై రంకెలు వేయడం గమనార్హం. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారంటూ చంద్రబాబు, లోకేశ్‌పై శ్రీవారి భక్తులు, టీటీడీ అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

నాడు.. నేడు సరఫరా సంస్థలు ఒక్కటే
» టీటీడీకి 2013 అక్టోబరు నుంచి 2019 మార్చి వరకు బరేలికి చెందిన ప్రీమియర్‌ ఆగ్రి ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ 33 లక్షల కేజీల ఆవు నెయ్యి సరఫరా చేసింది. అప్పట్లో ఐదేళ్లు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.

»   2016 మార్చి నుంచి ఆర్నెళ్లపాటు ప్రీమియర్‌ ఆగ్రి ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకే పూర్తి స్థాయిలో నెయ్యి సరఫరా బాధ్యతలను టీటీడీ అప్పగించింది. 2016 సెప్టెంబరులో నిర్వహించిన టెండర్లలోనూ మరో ఆర్నెళ్లపాటు నెయ్యి సరఫరా బాధ్యతలను టీటీడీ అదే సంస్థకు అప్పగించింది. అప్పట్లో అధికారంలో ఉంది చంద్రబాబు ప్రభుత్వమే. 

»   2017 ఏప్రిల్‌లో ప్రీమియర్‌ ఆగ్రి ఫుడ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకే 8.35 లక్షల కేజీల ఆవు నెయ్యిని సరఫరా చేసే బాధ్యతలను టెండర్ల ద్వారా టీటీడీ అప్పగించింది. 2017 అక్టోబర్‌లో 8,58,216 కేజీలు, 2018 జనవరిలో 23.30 లక్షల కేజీల ఆవు నెయ్యి సరఫరా చేసే బాధ్యతలను ఇదే సంస్థకే అప్పగించింది. 2018 జూన్‌ 29.. 2018 అక్టోబర్‌ 10న నిర్వహించిన టెండర్లలోనూ ఇదే సంస్థకే నెయ్యి సరఫరా బాధ్యతలను టీటీడీ అప్పగించింది. అప్పుడంతా అధికా­రంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే.

»   వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రీమియర్‌ ఆగ్రి ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తోపాటు పలు సంస్థలకు టెండర్ల ద్వా­రా ఆవు నెయ్యిని సరఫరా చేసేందుకు టీ­టీ­డీ అప్పగించింది. ఈ ఏడాది జూలై 12న ఎ­­న్‌­డీడీబీకి టీటీడీ పంపిన ఆవు నెయ్యి శాంపు­ల్‌ ప్రీమియర్‌ ఆగ్రి ఫుడ్స్‌ సరఫరా చేసిందే. 

» చంద్రబాబు చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే.. 2014 జూన్‌ 8 నుంచి 2019 మే 29 వరకు అంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రీమియర్‌ ఆగ్రి ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. జంతువుల కొవ్వు కలిసిన ఆవు నెయ్యినే టీటీడీకి సరఫరా చేసిందనుకోవాలని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ.. టీటీడీ చరిత్రలో ఎన్నడూ అలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని తేల్చి చెబుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement