తిరుమల మహా ప్రసాదంపై సీఎం చంద్రబాబు ఉన్మాద వ్యాఖ్యలు
ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేయడం క్షమార్హం కాదు
టీటీడీ మాజీ చైర్మన్‌లు భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మండిపాటు
ఏమాత్రం విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి.. ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హతే లేదు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారుతానని మరోమారు నిరూపించారు
అలిపిరి ఘటనలో దేవదేవుడి దయ వల్లే బతికి బయటపడి ఇప్పుడిలా దారుణ వ్యాఖ్యలు
ఇలా అన్యాయంగా అభాండాలు వేస్తే సర్వనాశనమవుతారు
తిరుమల వేదికగా చంద్రబాబు చేసిన విష ప్రచారాలు అన్నీ ఇన్నీకావు
సాక్షి, అమరావతి: ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడు తిరుమల మహా ప్రసాదమైన లడ్డూపై చేసిన ఉన్మాద వ్యాఖ్యల పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వందల కోట్ల భక్తులు విస్తుపోతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినే రీతిలో విస్మయకరమైన వ్యాఖ్యలు నిరాధారంగా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. జంతువుల నూనెలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేశారని ఒక హిందువుగా చంద్రబాబు నోటి వెంట అలాంటి మాటలు ఎలా వచ్చాయని నివ్వెరపోతున్నారు. అత్యంత సున్నితమైన అంశాన్ని కావాలని వివాదంగా మార్చి, రాజకీయంగా లబ్ధి పొందాలనే దుగ్ధకు తిరుమలను వాడుకోవడం దారుణం, దుర్మార్గమని నిప్పులు చెరుగుతున్నారు.
మనిషి పుట్టుక పుట్టిన వారెవ్వరూ ఇంత దారుణంగా మాట్లాడరని, రాజకీయాల కోసం దేవదేవుడినీ వదలక పోవడం పెద్ద పాపమని చెబుతున్నారు. కొంత కాలంగా చంద్రబాబు మానసిక పరిస్థితి పలు సందేహాలకు తావిస్తోందంటున్నారు. ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల తేకపోగా, వచ్చిన సీట్లను కూడా వద్దని కాలదన్నడం.. వరదల్లో అమరావతి మునగడం ప్రత్యక్షంగా అందరి కళ్లకు కనిపిస్తున్నా, ఆ మాటంటే నోటికి తాళమేస్తానని హెచ్చరించడం.. వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమవ్వడం.. వీటన్నిటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తాజాగా తిరుమల ప్రసాదాన్ని వివాదం చేశారని స్పష్టమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఏమాత్రం విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు అని, ఇలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హతే లేదని మండిపడుతున్నారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రంగా మార్చి లబ్ధి పొందాలనుకుంటే సర్వనాశం అవుతారని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు మాజీ చైర్మన్‌లు భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు నిప్పులు చెరిగారు.
పరాకాష్టకు బాబు బురద రాజకీయాలు
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు చేసిన ఆరోపణలు అత్యంత దుర్మార్గం. రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ స్వార్థం కోసం భగవంతుడ్ని వాడుకుంటే.. అలాంటి ఆరోపణలు చేసినవాడ్ని భగవంతుడు క్షమించడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. శ్రీ వేంకటేశ్వరస్వామి దుష్టశిక్షణ చేస్తాడని స్వయంగా చంద్రబాబే పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. కనుక ఇలాంటి నీచమైన ఆరోపణలు చేసిన వ్యక్తిని భగవంతుడు చూస్తూ ఊరుకోడు.
రాజకీయ ప్రత్యర్థులను దృష్టిలో ఉంచుకుని భగవంతుడి పేరుమీద ఆరోపణలు చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు చేసిన సందర్భాలున్నాయి. దీనికి అప్పుడు భగవంతుడు శిక్ష కూడా విధించాడు. అయినా చంద్రబాబు మారలేదు. ఇప్పుడు మళ్లీ అలాంటి ఆరోపణలే చేస్తున్నాడు. వాస్తవం ఏంటంటే, తిరుమలలో అన్న ప్రసాదాలు తయారు చేసే విషయంలో అధికారులకు ఎలాంటి ప్రమేయం ఉండదు. పవిత్రమైన శ్రీ వైష్ణవుల అమృత హస్తాల మీదుగా ఈ పదార్థాలు తయారవుతాయి.
ప్రసాదాల్లో పదార్థాల వినియోగం వారి చేతుల మీదుగా ఉంటుంది. అలాంటి వారి హస్తాల మీదుగా తయారయ్యే ప్రసాదాల మీద చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడంటే ఆయన బురద రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. ఈ దఫా అధికారంలోకి వచ్చింది మొదలు తిరుమల వేదికగా చంద్రబాబు చేసిన విష ప్రచారాలు అన్నీ ఇన్నీకావు. చివరకు ఏమీ దొరక్క పోవడంతో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. – భూమన కరణాకర్‌రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్
చంద్రబాబు పెద్ద పాపమే చేశాడు
దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బ తీసి పెద్ద పాపమే చేశాడు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. మనిషి పుట్టుక పుట్టిన వారెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఇలాంటి ఆరోపణలు చేయరు.
రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడడని మరోమారు నిరూపించుకున్నారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా? – వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు, టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment