‘మహా’ జాతరకు రాజన్న ప్రసాదం | Vemulawada Rajanna Prasadam For Maha Shivaratri | Sakshi
Sakshi News home page

‘మహా’ జాతరకు రాజన్న ప్రసాదం

Published Thu, Feb 28 2019 8:20 AM | Last Updated on Thu, Feb 28 2019 8:20 AM

Vemulawada Rajanna Prasadam For Maha Shivaratri - Sakshi

లడ్డూలు తయారు చేస్తున్న కార్మికులు 

వేములవాడ: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కొలువబడుతున్న ఎములాడ రాజన్నను దర్శించుకునే భక్తులు రాజన్న ప్రసాదాలపై అంతే మక్కువ చూపుతారు. మార్చి 3 నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మూడు నుంచి నాలుగు లక్షల మంది వస్తారన్న అంచనాలో అధికార యంత్రాంగం ఉంది. భక్తులకు రాజన్న లడ్డూ ప్రసాదం అందించేందుకు ఆలయ ప్రసాదాల గోదాం ఇన్‌చార్జీలు రెండురోజులుగా పనుల్లో వేగం పెంచారు. ప్రస్తుతం ఉన్న లేబర్‌కు తోడు మరింత మందిని ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గోదాంలోని ఓ గది నిండా ట్రేలలో తయారు చేసిన లడ్డూలు సిద్ధం చేశారు. వచ్చేనెల 2 వరకు నాలుగు లక్షల లడ్డూలు సిద్ధం చేసి ఉంచుతామని, 3, 4, 5 తేదీల్లోనూ భక్తుల రద్దీని బట్టి మరో లక్ష లడ్డూల వరకు తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గత శివరాత్రి జాతరలో 3.23 లక్షల లడ్డూ ప్రసాదాల విక్రయాలు జరిగినట్లు తెలిపారు. 

జాతరకు ప్రత్యేక కౌంటర్లు 
రాజన్న లడ్డూ ప్రసాదం రుచిగా ఉండేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ అందుకు అనుగుణంగా దిక్టం (ప్రసాదాల్లో వాడే వస్తువుల కొలతలు) రూపొందించింది. దీని ప్రకారం స్వచ్ఛమైన నెయ్యి, నాణ్యమైన శనగపప్పు, కాజు, మిష్రి, కిస్‌మిస్, బాదాం, యాలకులతో పాటు సుగంధ ద్రవ్యాలను సైతం ఇందులో పొందుపరుస్తుండటంతో రాజన్న లడ్డూ తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. మార్కెట్లో చక్కెర ధర అధికంగా ఉన్నా భక్తులకు తక్కువ ధరకే లడ్డూ ప్రసాదం అందించాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర దేవాదాయశాఖ రూ.15కు ఒక లడ్డూ చొప్పున విక్రయించాలని ఆదేశించింది. ఆమేరకు స్వామివారి ఓపెన్‌స్లాబ్‌లో ప్రసాదాల విక్రయాల కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు స్వామివారి ప్రసాదం అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మొన్నటి వరకు కొనసాగిన ఆంధ్రాబ్యాంకు భవనంలో ప్రత్యేక ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో రాజన్నను దర్శించుకుని దక్షిణ ద్వారం గుండా బయటకు వెళ్లే భక్తులు నేరుగా ప్రసాదాల కౌంటర్‌కు చేరుకుని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది.
  
రాజన్న హుండీ ఆదాయం రూ. కోటిన్నర
వేములవాడ రాజన్నను దర్శించుకునే భక్తులు హుండీలలో వేసిన  కానుకలను ఆలయ అధికారులు బుధవారం కట్టుదిట్టమైన భద్రత నడుమ స్వామివారి ఓపెన్‌స్లాబ్‌లో లెక్కించారు. 22 రోజుల్లో రాజన్నకు రూ. 1,50,29,406 నగదు, 652 గ్రాముల బంగారం, 13 కిలోల 900 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో దూస రాజేశ్వర్‌ తెలిపారు. 

నాలుగేళ్లుగా వస్తున్న ఆదాయం ఇలా..  
2014–15 రూ. 7.30 కోట్లు 
2015–16 రూ. 8.89 కోట్లు 
2016–17 రూ. 8.38 కోట్లు 
2017–18 (అక్టోబర్‌ వరకు) రూ. 5.63 కోట్లు 
2017–18 నవంబర్‌లో –రూ. 90 లక్షలు 
2017–18 డిసెంబర్‌లో– రూ. 1.35 కోట్లు 
2018–19 జనవరిలో – రూ.1.40 కోట్లు 

మూడులక్షల లడ్డూలు సిద్ధం చేస్తాం
జాతరకు వచ్చే భక్తులకు రాజన్న ప్రసాదం అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశ్యంతో ఈసారి 5 లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచాలని ఈవో ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు సిబ్బందిని రప్పించి లడ్డూ ప్రసాదాలు త యారు చేయిస్తున్నాం. ఇప్పటికే 2 లక్షల లడ్డులు సిద్ధం చేశాం. జాతర సందర్భంగా మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజన్న భక్తులకు ప్రసాదాలను అందుబాటులో ఉంచేం దుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం. – వరి నర్సయ్య, గోదాం ఇన్‌చార్జి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement