Sri Raja Rajeshwara temple
-
వేములవాడ రాజన్న ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి పూజలు
-
వేములవాడ రాజన్న సన్నిధిలో విషాదం
సాక్షి, రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. రాజన్న దర్శనం కోసం వచ్చిన ఓ భక్తురాలు.. క్యూ లైన్ కుప్పకూలి కన్నుమూసింది. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ లింగాపూర్‌కు చెందిన లక్ష్మి తన కుటుంబంతో సోమవారమే రాజన్న ఆలయ సన్నిధికి చేరుకుంది. అయితే.. దర్శనం కోసం ఇవాళ వేకువఝామున ఆలయానికి చేరుకున్నారు. ఉదయం నుంచే క్యూ లైన్లో నిల్చున్నారు. ఈ క్రమంలో తనకు అస్వస్థతగా ఉందని చెబుతూనే ఆమె కుప్పకూలిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. లక్ష్మిని పరిశీలించిన వైద్యులు.. ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రకటించారు. ఆలయ ప్రాంగంలోనే ఆమె కన్నుమూయడం, లక్ష్మి కూతురి రోదనలు చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. -
ఇక 'రాజన్న' మహా ఆలయం
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు తుది దశకు చేరుకోవడంతో ప్రభుత్వం ఇక వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంపై దృష్టి సారించింది. యాదాద్రి తరహాలోనే ఈ ఆలయాన్ని కూడా సమూలంగా అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. గర్భాలయాన్ని అలాగే ఉంచి మహామండపం నుంచి ఆలయాన్ని పూర్తిస్థాయిలో కొత్తగా నిర్మించనుంది. ఇప్పటికే పనులు మొదలు కావాల్సి ఉన్నప్పటికీ యాదాద్రి పనులు పూర్తి కాకపోవడం, అనుకున్న దానికంటే ఆలయ నిర్మాణ వ్యయం పెరగడంతో వేములవాడ పనులను ప్రభుత్వం ఇంకా ప్రారంభించలేదు. మరికొన్ని నెలల్లోనే యాదాద్రి ఆలయం పూర్తిస్థాయిలో సిద్ధమై మూలవిరాట్టు దర్శనభాగ్యం భక్తులకు కలగనుండటంతో ఈ సంవత్సరాంతానికి వేములవాడ ఆలయంలో పనులు ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. మార్చిలో ప్రవేశపెట్టే 2020–21 వార్షిక బడ్జెట్లో దాదాపు రూ. 400 కోట్లను వేములవాడ అభివృద్ధి కోసం సర్కారు ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో తొలుత రూ. 100 కోట్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. రాతి శిలలతోనే నిర్మాణం... ఇక ప్రధాన ఆలయాన్ని యాదాద్రి తరహాలో మాడవీధులతో పునర్నిర్మించనున్నారు. గర్భాలయంలోని మూలవిరాట్టుకు ఎలాంటి ఆటంకం లేకుండా అలాగే ఉంచి మిగతా ఆలయాన్ని పూర్తిగా తొలగించి విశాలంగా నిర్మించనున్నారు. దాదాపు నాలుగు ఎకరాల స్థలంలో మహా ఆలయం కొలువు దీరనుంది. యాదాద్రి తరహాలోనే ఈ ఆలయాన్ని కూడా పూర్తిగా రాతి శిలలతో నిర్మించనున్నారు. సిమెంటు నిర్మాణంలో అలనాటి శోభ ఉట్టిపడే అవకాశం చాలా తక్కువ. రాతి శిలలతో నిర్మిస్తేనే చారిత్రక నిర్మాణ వైభవం కనిపిస్తుంది. దాని జీవితకాలం కూడా ఎక్కువగా ఉంటుంది. కనీసం వెయ్యేళ్లపాటు మనగలగేలా రాతి కట్టడంతో వైభవంగా దేవాలయం రూపుదిద్దుకోనుంది. గతంలో రూపొందించిన ప్రణాళికలను మరోసారి సమీక్షించి శృంగేరీ పీఠాధిపతుల మార్గదర్శనంలో మార్పుచేర్పులు చేసి తుది నమూనాను సిద్ధం చేయనున్నారు. యాదాద్రి దేవాలయం చిన జీయర్ స్వామి సూచనలను పరిగణనలోకి తీసుకుని నిర్మిస్తే, వేములవాడ శైవాలయాన్ని శృంగేరీ పీఠం మార్గదర్శనంలో నిర్మించనున్నారు. త్వరలో శృంగేరీ పీఠాధిపతులు ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉంది. మరోవైపు రాజరాజేశ్వరస్వామి ప్రధాన ఆలయంతోపాటు ఉప ఆలయాలైన అనంత పద్మనాభస్వామి ఆలయం, రామాలయాలను కూడా అభివృద్ధి చేయనున్నారు. వాటితోపాటు శివరాత్రి ఉత్సవాలకు వీలుగా భారీ కల్యాణ మండపం, శ్రీరామ నవమి వేడుకల కోసం మరో విశాల మండపం, కోనేరును కూడా నిర్మించనున్నారు. 35 ఎకరాల సేకరణ... ప్రస్తుతం వేములవాడ ఆలయం ఇరుకుగా మారింది. పూర్తిగా ఇళ్ల మధ్యలో ఉండటంతో భక్తులకు సరైన వసతి సదుపాయాలు అందుబాటులో లేవు. ప్రత్యేక ఉత్సవాల వేళ అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలయాన్ని విశాలంగా చేయడంతోపాటు భక్తులకు వసతి సదుపాయాల కోసం సర్కారు ప్రత్యేక నిర్మాణాలు చేపట్టనుంది. ఇందుకోసం సమీపంలో 35 ఎకరాల సేకరించింది. ఇందులో యాత్రికుల కోసం దాదాపు 200 గదులతో కూడిన భవన సముదాయం, విశ్రాంతి మందిరాలు నిర్మించనుంది. -
వేములవాడలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు
సాక్షి, సిరిసిల్ల : కరీంనగర్ ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్ శుక్రవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి వేములవాడ చేరుకున్న ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్డీఏ తరఫున 351 మంది సభ్యులు అధికారంలోకి రావడంతో.. 351 కోడెలను కట్టి రాజన్న మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు బండి సంజయ్ దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ.. ప్రజల తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేద ప్రజల కోసం పని చేస్తానని అన్నారు. రాజన్న ఆశీస్సులతోనే తాను గెలిచానని తెలిపిన ఆయన.. ఆలయ అభివృద్ధి కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భాగస్వామ్యం అవుతానని.. అందరితో కలిసి ప్రజాసమస్యల పరిష్కారం కోసం పాటుపడతానని తెలిపారు. బీజేపీ ఎటువంటి అవకాశం ఇచ్చినా పని చేస్తానని పేర్కొన్నారు. -
‘మహా’ జాతరకు రాజన్న ప్రసాదం
వేములవాడ: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కొలువబడుతున్న ఎములాడ రాజన్నను దర్శించుకునే భక్తులు రాజన్న ప్రసాదాలపై అంతే మక్కువ చూపుతారు. మార్చి 3 నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మూడు నుంచి నాలుగు లక్షల మంది వస్తారన్న అంచనాలో అధికార యంత్రాంగం ఉంది. భక్తులకు రాజన్న లడ్డూ ప్రసాదం అందించేందుకు ఆలయ ప్రసాదాల గోదాం ఇన్చార్జీలు రెండురోజులుగా పనుల్లో వేగం పెంచారు. ప్రస్తుతం ఉన్న లేబర్‌కు తోడు మరింత మందిని ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గోదాంలోని ఓ గది నిండా ట్రేలలో తయారు చేసిన లడ్డూలు సిద్ధం చేశారు. వచ్చేనెల 2 వరకు నాలుగు లక్షల లడ్డూలు సిద్ధం చేసి ఉంచుతామని, 3, 4, 5 తేదీల్లోనూ భక్తుల రద్దీని బట్టి మరో లక్ష లడ్డూల వరకు తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గత శివరాత్రి జాతరలో 3.23 లక్షల లడ్డూ ప్రసాదాల విక్రయాలు జరిగినట్లు తెలిపారు. జాతరకు ప్రత్యేక కౌంటర్లు రాజన్న లడ్డూ ప్రసాదం రుచిగా ఉండేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ అందుకు అనుగుణంగా దిక్టం (ప్రసాదాల్లో వాడే వస్తువుల కొలతలు) రూపొందించింది. దీని ప్రకారం స్వచ్ఛమైన నెయ్యి, నాణ్యమైన శనగపప్పు, కాజు, మిష్రి, కిస్మిస్, బాదాం, యాలకులతో పాటు సుగంధ ద్రవ్యాలను సైతం ఇందులో పొందుపరుస్తుండటంతో రాజన్న లడ్డూ తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. మార్కెట్లో చక్కెర ధర అధికంగా ఉన్నా భక్తులకు తక్కువ ధరకే లడ్డూ ప్రసాదం అందించాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర దేవాదాయశాఖ రూ.15కు ఒక లడ్డూ చొప్పున విక్రయించాలని ఆదేశించింది. ఆమేరకు స్వామివారి ఓపెన్‌స్లాబ్‌లో ప్రసాదాల విక్రయాల కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు స్వామివారి ప్రసాదం అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మొన్నటి వరకు కొనసాగిన ఆంధ్రాబ్యాంకు భవనంలో ప్రత్యేక ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో రాజన్నను దర్శించుకుని దక్షిణ ద్వారం గుండా బయటకు వెళ్లే భక్తులు నేరుగా ప్రసాదాల కౌంటర్‌కు చేరుకుని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. రాజన్న హుండీ ఆదాయం రూ. కోటిన్నర వేములవాడ రాజన్నను దర్శించుకునే భక్తులు హుండీలలో వేసిన కానుకలను ఆలయ అధికారులు బుధవారం కట్టుదిట్టమైన భద్రత నడుమ స్వామివారి ఓపెన్‌స్లాబ్‌లో లెక్కించారు. 22 రోజుల్లో రాజన్నకు రూ. 1,50,29,406 నగదు, 652 గ్రాముల బంగారం, 13 కిలోల 900 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో దూస రాజేశ్వర్ తెలిపారు. నాలుగేళ్లుగా వస్తున్న ఆదాయం ఇలా.. 2014–15 రూ. 7.30 కోట్లు 2015–16 రూ. 8.89 కోట్లు 2016–17 రూ. 8.38 కోట్లు 2017–18 (అక్టోబర్ వరకు) రూ. 5.63 కోట్లు 2017–18 నవంబర్‌లో –రూ. 90 లక్షలు 2017–18 డిసెంబర్లో– రూ. 1.35 కోట్లు 2018–19 జనవరిలో – రూ.1.40 కోట్లు మూడులక్షల లడ్డూలు సిద్ధం చేస్తాం జాతరకు వచ్చే భక్తులకు రాజన్న ప్రసాదం అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశ్యంతో ఈసారి 5 లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచాలని ఈవో ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు సిబ్బందిని రప్పించి లడ్డూ ప్రసాదాలు త యారు చేయిస్తున్నాం. ఇప్పటికే 2 లక్షల లడ్డులు సిద్ధం చేశాం. జాతర సందర్భంగా మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజన్న భక్తులకు ప్రసాదాలను అందుబాటులో ఉంచేం దుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం. – వరి నర్సయ్య, గోదాం ఇన్చార్జి -
వేములవాడలో నత్తనడకన వసతి గదుల నిర్మాణం
రాజన్న భక్తులకు ఎములాడలో వసతి గదులు లభించడం లేదు. పాతకాలపు వసతి గదులు మినహా ఇప్పటివరకు కొత్తగా వసతి గదుల సౌకర్యం కల్పించలేకపోతున్నారు. భీమేశ్వరాలయం చెంతనే రూ.11 కోట్ల వ్యయంతో చేపట్టిన వంద గదుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. గతేడాది మహాశివరాత్రికే అందుబాటులోకి తేవాల్సిన గదులు.. ఈఏడాది పండుగకు సైతం నిర్మాణం పూర్తిచేసుకోలేదు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలు వస్తున్నాయి. సాక్షి, వేములవాడ: రాజన్న ఆలయ అనుబంధ భీమేశ్వరస్వామి దేవస్థానం సమీపంలో గల ఖాళీ స్థలంలో వంద వసతి గదులు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. సుమారు రెండేళ్లక్రితం రూ.11 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. పనులు నత్తనడకన సాగడంతో నేటికీ గదుల నిర్మాణం పూర్తికాలేదు. మహాశివరాత్రి వరకైనా అందేనా..? వచ్చే ఉడాది మహాశివరాత్రి జాతర వరకైనా కొత్త వసతి గదులు భక్తులకు అందుబాటులో వస్తాయా? రావా? అనే సందేహాలు నెలకొన్నాయి. వచ్చే మార్చి మొదటివారంలోనే మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలోగా వసతి గదుల నిర్మాణం పూర్తికావడం సందేహాస్సదమేనని భక్తులు అంటున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వీడితే తప్ప పనుల్లో వేగం పెరగదని పేర్కొంటున్నారు. గదులు లేవట కుటుంబసభ్యులతో కలిసి ఎములాడ రాజ న్న దర్శనం కోసం వచ్చినం. ఆలయ వస తి గదులు లేవట. ప్రైవేటు లాడ్జి తీసుకున్నం. పైసలు ఎక్కువైనయి. ఏటా కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఆలయంలో వసతి గదులు ఏకపోవడం శోచనీయం.– రాజేందర్, భక్తుడు, వరంగల్ ఎప్పుడైనా తిప్పలే.. దర్శనం కోసం పిల్లలతో కలిసి వచ్చినం. ఉండేతందుకు గదులు లేవు. అనేక ఏండ్ల నుంచి ఏటా ఇక్కడ గివే తిప్పలు. గిన్నేండ్ల నుంచి రూముల తిప్పలు తొలగించలేరా? భక్తులకు కనీసం వసతి గదులు ఇవ్వకుంటే ఎట్లా చెప్పుండ్రి. భక్తులకు రాగానే గదులు ఇవ్వాలి.– సులోచన, భక్తురాలు పూర్తిచేస్తాం రాజన్న భ క్తులకు వసతి కల్పిం చేందుకు భీమేశ్వర ఆలయం సమీపంలోని ఖాళీస్థలంలో వంద గదులు నిర్మిస్తున్నాం. పనుల్లో జాప్యం జరుగుతోంది. పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్‌ను హెచ్చరించాం. మహాశివరాత్రి జాతర వరకు వీటిని అందుబాటులోకి తెస్తాం. – రాజేశ్, ఈఈ -
మహిళలను అనుమతించవద్దంటూ ఆదేశాలు
► హుండీ లెక్కింపునకు మహిళలు దూరం వేములవాడ: రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హుండీ లెక్కింపులో అనుసరిస్తున్న విధానాలపై సీరియస్‌గా వ్యవహరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. హుండీ లెక్కింపు సందర్బంగా మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని నిబంధన పెట్టారు. ఈ మేరకు రాజన్నసిరిసిల్ల వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ ఈవో డి.రాజేశ్వర్ హుండీ లెక్కింపులో ఎలాంటి పరిస్థితుల్లోనూ మహిళలను అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇంతేకాకుండా ఆలయ అధికారులు, సిబ్బంది తప్ప ఇతర దేవాదాయశాఖకు సంబంధంలేని వారిని దూరంగా ఉంచాలని స్పష్టం చేశారు. హుండీ లెక్కింపు సందర్భంగా కొందరు బంగారం, నగదును దోచుకున్నట్లు, దాచుకున్నట్లు విచారణలో తేలడంతో కమిషనర్ సీరియస్‌గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆలయ ఉద్యోగులెవ్వరూ హుండీ లెక్కింపు రోజున సెలవులు పెట్టొద్దనీ, అలా పాల్పడినట్లైతే గైర్హాజరు వేయడంతోపాటు శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. హుండీ లెక్కింపు సందర్బంగా రాష్ట్ర దేవాదాయశాఖ తీసుకున్న నిర్ణయానికి భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయల జీతాలు పుచ్చుకుంటున్న ఉద్యోగులు, సిబ్బంది హుండీ లెక్కింపులో భాగస్వాములు కాకుండా ప్రైవేట్ వ్యక్తులను అనుమతించడంతో భక్తుల మనోభావాలు దెబ్బతినే విధమైన చర్యలకు అవకాశం కల్పించినట్లవుతుందన్న చర్చ సాగుతోంది. అయితే కొంత మంది ఉద్యోగులు తమతమ పలుకుబడిని ఉపయోగించుకుని హుండీ లెక్కింపులో హాజరు కాకుండా చూసుకుంటున్నట్లు ఆశాఖ ఉన్నతాధికారులకు, మంత్రి దృష్టికి వెళ్లినట్లు సమాచారం. 3న హుండీ లెక్కింపు వేములవాడ రాజన్నను దర్శించుకున్న భక్తులు హుండీలలో వేసిన కట్నాలు, కానుకలను ఆలయ అధికారులు వచ్చేనెల 3న ఉదయం 7.30 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తున్నట్లు ఈవో రాజేశ్వర్ తెలిపారు. ఉద్యోగులంతా విధిగా లుంగీ, ధోవతి మాత్రమే ధరించి రావాలనీ, బనియన్ సైతం వేసుకోకుండా హుండీ లెక్కింపులో హాజరు కావాలని ఆదేశించారు. ఇందుకు భిన్నంగా వ్యవహరించిన ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు. హుండీ లెక్కింపు సందర్భంగా మరింత భద్రత పెంచుతామనీ, సీసీ కెమెరాల నిఘా సైతం పెంచినట్లు ఆయన చెప్పారు.