సాక్షి, హైదరాబాద్: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు తుది దశకు చేరుకోవడంతో ప్రభుత్వం ఇక వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంపై దృష్టి సారించింది. యాదాద్రి తరహాలోనే ఈ ఆలయాన్ని కూడా సమూలంగా అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. గర్భాలయాన్ని అలాగే ఉంచి మహామండపం నుంచి ఆలయాన్ని పూర్తిస్థాయిలో కొత్తగా నిర్మించనుంది. ఇప్పటికే పనులు మొదలు కావాల్సి ఉన్నప్పటికీ యాదాద్రి పనులు పూర్తి కాకపోవడం, అనుకున్న దానికంటే ఆలయ నిర్మాణ వ్యయం పెరగడంతో వేములవాడ పనులను ప్రభుత్వం ఇంకా ప్రారంభించలేదు. మరికొన్ని నెలల్లోనే యాదాద్రి ఆలయం పూర్తిస్థాయిలో సిద్ధమై మూలవిరాట్టు దర్శనభాగ్యం భక్తులకు కలగనుండటంతో ఈ సంవత్సరాంతానికి వేములవాడ ఆలయంలో పనులు ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. మార్చిలో ప్రవేశపెట్టే 2020–21 వార్షిక బడ్జెట్‌లో దాదాపు రూ. 400 కోట్లను వేములవాడ అభివృద్ధి కోసం సర్కారు ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో తొలుత రూ. 100 కోట్లు విడుదల చేయనున్నట్లు సమాచారం.
రాతి శిలలతోనే నిర్మాణం...
ఇక ప్రధాన ఆలయాన్ని యాదాద్రి తరహాలో మాడవీధులతో పునర్నిర్మించనున్నారు. గర్భాలయంలోని మూలవిరాట్టుకు ఎలాంటి ఆటంకం లేకుండా అలాగే ఉంచి మిగతా ఆలయాన్ని పూర్తిగా తొలగించి విశాలంగా నిర్మించనున్నారు. దాదాపు నాలుగు ఎకరాల స్థలంలో మహా ఆలయం కొలువు దీరనుంది. యాదాద్రి తరహాలోనే ఈ ఆలయాన్ని కూడా పూర్తిగా రాతి శిలలతో నిర్మించనున్నారు. సిమెంటు నిర్మాణంలో అలనాటి శోభ ఉట్టిపడే అవకాశం చాలా తక్కువ. రాతి శిలలతో నిర్మిస్తేనే చారిత్రక నిర్మాణ వైభవం కనిపిస్తుంది. దాని జీవితకాలం కూడా ఎక్కువగా ఉంటుంది. కనీసం వెయ్యేళ్లపాటు మనగలగేలా రాతి కట్టడంతో వైభవంగా దేవాలయం రూపుదిద్దుకోనుంది.
గతంలో రూపొందించిన ప్రణాళికలను మరోసారి సమీక్షించి శృంగేరీ పీఠాధిపతుల మార్గదర్శనంలో మార్పుచేర్పులు చేసి తుది నమూనాను సిద్ధం చేయనున్నారు. యాదాద్రి దేవాలయం చిన జీయర్ స్వామి సూచనలను పరిగణనలోకి తీసుకుని నిర్మిస్తే, వేములవాడ శైవాలయాన్ని శృంగేరీ పీఠం మార్గదర్శనంలో నిర్మించనున్నారు. త్వరలో శృంగేరీ పీఠాధిపతులు ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉంది. మరోవైపు రాజరాజేశ్వరస్వామి ప్రధాన ఆలయంతోపాటు ఉప ఆలయాలైన అనంత పద్మనాభస్వామి ఆలయం, రామాలయాలను కూడా అభివృద్ధి చేయనున్నారు. వాటితోపాటు శివరాత్రి ఉత్సవాలకు వీలుగా భారీ కల్యాణ మండపం, శ్రీరామ నవమి వేడుకల కోసం మరో విశాల మండపం, కోనేరును కూడా నిర్మించనున్నారు.
35 ఎకరాల సేకరణ...
ప్రస్తుతం వేములవాడ ఆలయం ఇరుకుగా మారింది. పూర్తిగా ఇళ్ల మధ్యలో ఉండటంతో భక్తులకు సరైన వసతి సదుపాయాలు అందుబాటులో లేవు. ప్రత్యేక ఉత్సవాల వేళ అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలయాన్ని విశాలంగా చేయడంతోపాటు భక్తులకు వసతి సదుపాయాల కోసం సర్కారు ప్రత్యేక నిర్మాణాలు చేపట్టనుంది. ఇందుకోసం సమీపంలో 35 ఎకరాల సేకరించింది. ఇందులో యాత్రికుల కోసం దాదాపు 200 గదులతో కూడిన భవన సముదాయం, విశ్రాంతి మందిరాలు నిర్మించనుంది.
Comments
Please login to add a commentAdd a comment