అది ముమ్మాటికీ చెంప దెబ్బే! | Sakshi Guest Column On Chandrababu Govt TTD Laddu Issue | Sakshi
Sakshi News home page

అది ముమ్మాటికీ చెంప దెబ్బే!

Published Tue, Oct 1 2024 6:15 AM | Last Updated on Tue, Oct 1 2024 6:15 AM

Sakshi Guest Column On Chandrababu Govt TTD Laddu Issue

అభిప్రాయం

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత దేశ ప్రజలు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరు పతి దేవస్థానం లడ్డూ ప్రసాదంపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ధర్మం నాలుగు పాదాల నడుస్తు న్నదని చెప్పడానికి నిదర్శ నంగా నిలిచాయి. సుప్రీం వ్యాఖ్యలు ముమ్మాటికీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలకు చెంపపెట్టు లాంటివే. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలంటే కుదరదని సుప్రీం వ్యాఖ్యలు రుజువు చేశాయి. 

ఇక ప్రాయశ్చిత్త దీక్ష నాటకాలు అన్నీ వట్టివేనని కుండబద్దలు కొట్టినట్లయింది. కల్తీ నెయ్యి జరిగినట్లు సాక్ష్యాలు లేవన్న సుప్రీం... సిట్‌ విచారణ ఎందుకంటూ నిలదీసింది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డిపై వేసిన నిందారోపణలన్నీ అసత్యాలని ప్రజలకు అర్థమైంది. ఒక వ్యక్తిని రాజకీయంగా హత్య చేసేందుకు పరమ పవిత్రమైన ఏడు కొండల వాడిని వాడుకున్న నీచ రాజకీయం ‘చంద్రబాబు అండ్‌ కో’దని అందరికీ అర్థమైంది.

సెప్టెంబరు 18న ఏపీ సీఎం చంద్రబాబు లడ్డూ ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు రోజుకో మలుపు తిరుగుతూ వస్తున్నాయి. నిజంగా జంతువుల కొవ్వు కలిపి ఉంటే∙ప్రసాదం నిల్వ ఉండదనీ, వెంటనే పాడైపోవడం, వాసన రావడం... ఇలా అనేక సమస్యలు ఎదురవుతాయని నిపుణులు పదే పదే చెబుతూ వచ్చారు. అదీకాకుండా అసలు ఈ తతంగమంతా చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టాకే జరిగింది. 

దానిని వదిలేసి అదేదో జగన్‌ హయాంలో జరిగిందంటూ మసిపూసి మారేడుకాయను చేసే ప్రక్రియను తలకెత్తుకున్న చంద్రబాబు తలదించుకొనేలా సుప్రీం వ్యాఖ్యలు చేసింది. అసలు కల్తీ జరిగింది అనడానికి ఆధారా లెక్కడున్నాయంటూ ప్రశ్నించింది. ఇప్పుడు దీనికి చంద్రబాబు ప్రజలకు ఏం సమాధానం చెబుతారో చూడాలి.

ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రపంచ దేశాల్లో భక్తులు కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానంపైన, ఆల య ప్రతిష్ఠపైన, లడ్డూ ప్రసాదం చరిత్రపైన మాయని మచ్చ వేయగలిగారు. ఆయన వ్యాఖ్యలు నిజమా, కాదా అని తెలుసుకోకుండా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో హడావిడి చేశారు. జనాన్ని నమ్మించేందుకు దుర్గమ్మ గుడికి వెళ్లి మెట్లపూజ చేశారు. చంద్రబాబు రాజకీయ వ్యూహంలో బలైపోయారు. 

వాస్తవానికి జనసేనాని ఈ వ్యాఖ్యలు చేయలేదు. చేసింది చంద్రబాబు. కానీ, ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించ డానికి కారకులైంది పవన్‌. ఇప్పుడు పవన్‌ ప్రజలకు సమాధానం చెప్పుకునేందుకు ఏం చేయా లన్నదానిపై మల్లగుల్లాలు పడాల్సిన దుఃస్థితి నెలకొంది. ఇప్పటికైనా పవన్‌ తొందరపడకుండా నింపాదిగా రాజకీయాలు చేస్తేనే చంద్రబాబు వ్యూహాల నుండి తప్పించుకుని తనదైన శైలిలో తన అభిమానుల మనసులో ముద్ర వేసుకో గలుగుతారు. ఇక బీజేపీ పెద్దలు అచ్చంగా చంద్ర బాబు మౌత్‌ పీస్‌లుగా మారినట్లు కనిపించింది.

ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశంపై స్పందించిన తీరు ఆ పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేసింది. హిందూ ధర్మ పరిరక్షణకు బీజేపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందంటూ చెబుతూనే, లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ జరిగిందంటూ వ్యాఖ్యానించారు. దీనికి ఆ పార్టీ నేతలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవడం అనేది ఏ విధంగానూ జరిగే అవకాశం లేదు. పాలకులు ఎవరున్నా అంతటి నీచ పరిస్థితికి దిగజారే అవకాశాలు ఉండవు. చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపిన దాఖలాలు ఉన్నాయి కదా! కేవలం 2014–19 మధ్యే ఆయన హయాంలో 14 సార్లు వెనక్కు పంపారు కదా! అంతమాత్రం చేత చంద్రబాబు హయాంలో జంతు కొవ్వు కలిపిన లడ్డూలు తయారైనట్లు భావించాలా? ఇది ఏమాత్రం సహేతుకం?

ముస్లింలకు 4 శాతం ఉన్న రిజర్వేషన్లు రద్దుచేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ముస్లిం ఓటు బ్యాంకుకు పూర్తిగా దూరమైనట్లు చంద్రబాబు గ్రహించి ఈ కుట్రకు తెరలేపినట్లు కనిపిస్తోంది. దీనివల్ల హిందువుల ఓట్లను కన్‌సాలిడేట్‌ చేసుకోవచ్చని ఆయన భావించి ఉంటారని అనుకోవాల్సి వస్తోంది. లేకపోతే ఆ నివేదికను ఒక రాజకీయ వేదిక మీద ఎందుకు చంద్రబాబు చదువుతారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

తమ ఇలవేల్పు అయిన వేంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం కల్తీ జరిగింది అంటే ఎవరికైనా ఇట్టే ఆగ్రహావేశాలు వస్తాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ, జగన్‌ ప్రధానికి లేఖ రాయడం, సీజేఐకి కూడా రాస్తానని చెప్పడం, నేషనల్‌ మీడియాకు వాస్తవాలు వివరించడం, సుబ్బారెడ్డి లాంటి వారు సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడం, కరుణాకర్‌ రెడ్డి లాంటి వారు ప్రమాణాలు చేయడం ఇలా అనేకానేక కార్య క్రమాల నేపథ్యంలో సామాన్య మానవుల్లో ఆలో చన రేకెత్తింది. 

కల్తీ జరిగిందని తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు 2024 జూలై 12న తిరుమలకు వచ్చాయి. ఆ ట్యాంకర్లలోని నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదు. ఏది ఏమైనప్పటికీ తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు సామన్య జనాల్లో పెద్ద ఎత్తున చర్చ నీయాంశంగా మారాయి. నిజానిజాలు నిగ్గు తేల్చేలా సీబీఐతో విచారణ చేయించాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే ప్రజలు స్వాగతిస్తారు. దేశ ప్రధాని కూడా ఈ అంశం మీద నోరు విప్పాలి. ప్రజల్లో దెబ్బతిన్న మనోభావాలను తిరిగి ప్రతిష్ఠించేలా చర్యలు తీసుకోవాలి.

పూనూరు గౌతమ్‌ రెడ్డి 
వ్యాసకర్త ఏపీ అధ్యక్షులు,వైయస్సార్‌ టీయూసీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement