తాను సృష్టించిన నెయ్యి వివాదంలో అడ్డంగా దొరికిపోయి ఉక్కిరి బిక్కిరి
పాలన వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు శ్రీవారినే రాజకీయాల్లోకి లాగిన వైనం
నెయ్యి కల్తీ జరగలేదని తేలడంతో ఇప్పుడు బయటపడటానికి నానాతంటాలు
కుట్రలు, కుతంత్రాలతో పాలనను పక్కనపెట్టేయడంతో ప్రజల్లో అసహనం
సాక్షి, అమరావతి: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామిని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందడానికి విఫలయత్నం చేసి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జరగని కల్తీని జరిగిందని చెబుతూ పెద్ద కుట్రకు తెరతీసి చివరికి ప్రజల ముందు దోషిగా నిలబడ్డారు. ఈ క్రమంలో ఒక తప్పు నుంచి బయట పడేందుకు మరో తప్పు చేస్తూ ఆయన వివాదాల ఊబిలో చిక్కుకుపోయారు.
ఇప్పుడు బయటపడడానికి నానాతంటాలు పడుతున్నారు. విజయవాడ వరద విపత్తును ఎదుర్కోవడంలో ఘోర వైఫల్యం చెందడం, తన వంద రోజుల పాలనా వైఫల్యాలపై ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేందుకు ఆయన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే దారుణమైన అబద్ధాన్ని తెరపైకి తీసుకువచ్చారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారని ఈనెల 18న ఆరోపించి ఆ దేవదేవుడినే తన కుట్రలోకి లాగారు. కానీ, జగన్‌మోహన్‌రెడ్డి ఆధారసహితంగా వాస్తవాలన్నీ వెల్లడిస్తుండడంతో చంద్రబాబు ఇరుకునపడ్డారు. పదిరోజులుగా జరిపిన డైవర్షన్ పాలిటిక్స్ చెల్లుబాటు కాకపోవడంతో చంద్రబాబు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు.
సమాధానం చెప్పలేక చేతులెత్తేసిన బాబు
» స్వామివారి లడ్డూ ప్రసాదం విషయంలో శుక్రవారం మాజీ సీఎం జగన్ లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకు సీఎం హోదాలో చంద్రబాబు సమాధానాలు చెప్పలేక చేతులెత్తేశారు.
» ‘చంద్రబాబు హయాంలో 2015లో ఆవు నెయ్యి కిలో రూ. 276కు. 2019 జనవరిలో రూ. 324కు కొన్నారు. మరి ఇప్పుడు రూ. 320కు కొంటే తప్పేంటి? టెండర్లలో ఎల్1 కింద ఎవరొస్తే వారికి కాంట్రాక్టు ఇచ్చారు. ఇది గతంలోనూ జరిగిందే’ అని మాజీ సీఎం జగన్ నిలదీస్తే.. సీఎం చంద్రబాబు మాత్రం ఎక్కువ మంది వ్యాపారులు వచ్చేలా టెండర్ల నిబంధనలు మార్చేశారని, అందుకే తక్కువ రేటుకు కొంటున్నారని చెప్పుకొచ్చారు.
» ‘లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే వ్యవహారం మొత్తం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే జరిగింది కదా? వచ్చిన ట్యాంకర్లలో నాలుగు ట్యాంకర్లు ల్యాబ్ రిపోర్టులో పాస్ అయ్యాయి. మరో నాలుగు రిజెక్ట్ కావడంతో వెనక్కి పంపించేశారు. అసలు వాడని నెయ్యితో.. లడ్డూ ఎలా తయారైంది’ అన్న జగన్ ప్రశ్నకు చంద్రబాబు దగ్గర సరైన సమాధానం లేదు.
» ‘ప్రశాంతంగా ఉన్న తిరుమలలో ఘర్షణలను ప్రోత్సహించేందుకు చంద్రబాబు ప్లాన్ వేశారు. నేను దర్శనానికి వెళ్తుంటే పోలీసులను ఎందుకు మోహరించడం’ అని ప్రశ్నిస్తే.. తిరుమలకు వెళ్లొద్దని ఎవ్వరూ చెప్పట్లే, ర్యాలీలు, జన సమీకరణలు చేయొద్దని మాత్రమే చెప్పామంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారు.
తిరుమలలో అకస్మాత్తుగా డిక్లరేషన్ ఫ్లెక్సీలు!
» వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడటంతో తొలగింపు
» కూటమి నేతల సూచనతో టీటీడీ ఇలా చేయడం సరికాదంటున్న భక్తులు
» రాజకీయాల్లో టీటీడీ పావుగా మారకూడదని సూచన
తిరుమల: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమలను టీటీడీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారుస్తోంది. రాజకీయ నాయకులు చెప్పిందల్లా చేస్తూ భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతోంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారని తెలుసుకొని టీటీడీ హుటాహుటిన శుక్రవారం మధ్యాహ్నం తిరుమలలో హైందవేతరుల ఆలయ ప్రవేశానికి సంబంధించిన డిక్లరేషన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడటంతో కొద్ది సేపటికే ఆ ఫ్లెక్సీలు తొలగించింది.
వాటిని చూసిన భక్తులు.. రాజకీయాల కోసం తిరుమలను కూడా వాడుకుంటున్నారా అని ఆశ్చర్యపోయారు. ఇన్ని రోజులు లేని డిక్లరేషన్ సూచిక బోర్డులు అకస్మాత్తుగా ప్రత్యక్షమవడంతో వైఎస్ జగన్ పర్యటన వల్లే ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఇలా ఒక్కరి కోసం ప్రత్యేకంగా ఫ్లెక్సీలు పెట్టడం సరికాదని మండిపడుతున్నారు. టీటీడీ అధికారులు కూడా రాజకీయాల్లో పావులుగా మారడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, కూటమి నేతల సూచన మేరకే టీటీడీ అధికారులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద, ఏటీసీ కూడలి వద్ద రాత్రికి రాత్రి తయారు చేయించి డిక్లరేషన్ ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారు. మతం పేరుతో టీటీడీని సైతం కూటమి నాయకులు రాజకీయంగా వాడుకోవడం కూడా సరికాదని భక్తులు విమర్శిస్తున్నారు. హిందుత్వం ముసుగులో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కూటమి పార్టీల నాయకులు, కొందరు స్వామీజీలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment