లడ్డూల దందా.. సొమ్ము గోవింద! | TTD workers Illegal sales of laddu prasadam | Sakshi
Sakshi News home page

లడ్డూల దందా.. సొమ్ము గోవింద!

Published Tue, Jan 24 2017 8:09 AM | Last Updated on Sat, Aug 25 2018 7:11 PM

లడ్డూల దందా.. సొమ్ము గోవింద! - Sakshi

లడ్డూల దందా.. సొమ్ము గోవింద!

వెంకన్న సన్నిధిలో మితిమీరిన లడ్డూల అక్రమ విక్రయాలు
దళారులు, వైకుంఠం కౌంటర్‌ సిబ్బంది, ట్రే లిఫ్టర్లు మిలాఖత్‌
దళారులకు ఇంటి దొంగల సహకారం
రోజూ రూ.5 నుండి రూ.10 లక్షల వరకు చేతులు మారుతున్న వైనం
చోద్యం చూస్తున్న టీటీడీ విజిలెన్స్‌ విభాగం


సాక్షి, తిరుమల: ఇంటి దొంగలు దళారులతో చేతులు కలపడంతో భక్తులు ప్రీతిపాత్రంగా స్వీకరించే శ్రీవారి లడ్డూల అక్రమ విక్రయాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. లడ్డూ అక్రమ విక్రయాల ద్వారా రోజూ రూ.5 నుండి రూ.10 లక్షల వరకు చేతులు మారున్నట్టు ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతుంటే టీటీడీ విజిలెన్స్‌ విభాగం చోద్యం చూస్తుండ టం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదం కోసం ఎంత ఖర్చు చేయడానికికైనా వెనుకంజ వేయరు. భక్తుల్లో ఉన్న ఈ భావనే అక్రమార్కులకు  కాసులు కురిపిస్తోంది. భక్తుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు మాఫియాలా రింగ్‌ అయ్యారు. ప్రధానంగా దళారులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ లో లడ్డూ టోకెన్లు ఇచ్చే సిబ్బంది, స్కానింగ్‌ చేసే సిబ్బంది, లడ్డూ కౌంటర్‌ సిబ్బంది, లడ్డూల ట్రే లిఫ్టర్లు.. ఇలా వరుసగా మిలాఖత్‌  అయ్యారు. అందరూ కలసికట్టుగా శ్రీవారి లడ్డూలను నల్లబజారులోకి తరలిస్తూ అక్రమార్జనలో పడ్డారు.  

అక్రమార్కుల చేతుల్లో లడ్డూ టోకెన్లు
భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా స్వీకరించే ఒక లడ్డూ తయారు చేయడానికి టీటీడీకి ప్రస్తుతం రూ.30 దాకా ఖర్చు అవుతోంది. ధర్మప్రచారం, సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని టీటీడీ  కాలిబాటల్లో నడిచి వచ్చిన భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా అందజేస్తోంది. సర్వదర్శనం భక్తులకు సబ్సిడీ ధరతో రూ.20కే రెండు లడ్డూలు అందజేస్తున్నారు. అలాగే, రూ.25 చొప్పున రూ.50కి మరో రెండు లడ్డూలు ఇస్తుంటారు. అంటే కాలిబాటలో వచ్చిన భక్తులకు ఒకరికి ఉచిత లడ్డూతో కలిపి 5 లడ్డూ టోకెన్లు, సర్వదర్శనం భక్తులకు 4 లడ్డూల టోకెన్లు పొందే అవకాశం ఉంది. వీటిలో దాదాపు 20 శాతం వరకు నల్ల బజారుకు తరలిపోతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కాలిబాటల్లో నడిచివచ్చే భక్తులకు ఇచ్చే టోకెన్లకు ఒక లడ్డూ ఉచితంగా పొందవచ్చు. అలాంటి టోకెన్లను కొందరు సిబ్బంది దొడ్డిదారిన దళారులకు అందజేస్తుంటారు. వాటిని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో కొందరు స్కానింగ్‌ సిబ్బందితో ఒప్పుందం కుదుర్చుకుని పద్దతి ప్రకారం స్కానింగ్‌ చేస్తారు.  అనంతరం వాటిని వెలుపల ట్రేలిఫ్టర్లు, దళారులకు అందజేస్తారు. కాలిబాట భక్తులకు రూ.20 రెండు లడ్డూల సబ్సిడీ టోకెన్లు కూడా అదే పద్దతి ప్రకారమే   వెలుపుల దళారులకు అందజేస్తారు. వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

విజిలెన్స్‌ విభాగం ఏం చేస్తోంది?
శ్రీవారి లడ్డూ అక్రమ విక్రయాల్లో సింహభాగం ఇంటిదొంగలదే. కౌంటర్‌ సిబ్బంది నుండి ట్రే లిఫ్టర్ల వరకు ఎక్కువ మంది వాటాదారులే.  చాలా సందర్బాల్లో వీరే నేరుగా భక్తులకు లడ్డూలు విక్రయిస్తుంటారు. మరికొందరు దళారులతో ఈ అక్రమ దందా నడిపిస్తున్నారు. ఇలా ఆలయం  సమీప ప్రాంతాల్లో సుమారు 300మందికిపైగా లడ్డూ దళారులు అక్రమ విక్రయాల్లో తలమునకలయ్యారు. ఈ దందాలో అక్రమార్కుల భరతం పట్టిన టీటీడీ విజిలెన్స్‌ విభాగంలో ఏమాత్రం స్పందన కనిపించడం లేదు. ఏడాది కాలంగా ఒక్క దళారీ.. ఒక్క ఇంటి దొంగైనైనా పట్టుకున్న దాఖలాలు లేవు.

2016లో 2.66 కోట్ల మంది భక్తులు తిరుమలేశుడిని దర్శించుకున్నారు. అంటే సరాసరి రోజూ 72 వేల మంది తిరుమల సందర్శిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. వీరి కోసం టీటీడీ రోజూ 3 లక్షల లడ్డూలు విక్రయిస్తోంది. ఇందులో సర్వదర్శనం భక్తులు ఒక్కొక్కరికి 4 (రూ.25 చొప్పున రెండు, రూ.10 చొప్పున 2), కాలిబాట భక్తులు ఒక్కొక్కరికి 5 (ఒకటి ఉచితం, రూ.25 చొప్పున రెండు, రూ.10 చొప్పున 2), రూ.300 టికెట్ల భక్తులు ఒక్కొక్కరికి 2, వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల భక్తులకు ఒకరికి 2, వివిధ దర్శన టికెట్లతోపాటు అదనపు లడ్డూల కోసం నగదు చెల్లించిన వారికి 2 నుండి 6 లడ్డూలు పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement