స్వార్థ రాజకీయాల కోసం లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం కుతంత్రం పన్ని మహాపచారం చేశారు! పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూను సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారు. లడ్డూ తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ నిరాధారమైన దారుణ ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలతో చెలగాటమాడారు. నెయ్యి ట్యాంకర్లలో వెజిటబుల్ ఫ్యాట్స్ కలిసి కల్తీ అయ్యిందని నిర్ధారణ కాగానే వాటిని వెనక్కి పంపేశామని టీటీడీ ఈవో పదే పదే స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని వాడలేదని తేల్చిచెప్పారు. అయినా సరే సీఎం చంద్రబాబు తీరు మార్చుకోలేదు. జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారు చేశారంటూ పచ్చి అబద్ధాలు పదేపదే వల్లె వేస్తూ మహాపచారం చేస్తున్నారు.
ఈ ప్రశ్నలకు జవాబుందా బాబూ?
1. తాను టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించక ముందే సీఎం చంద్రబాబును కలిశానని.. తిరుమల ప్రసాదాల తయారీలో వినియోగిస్తున్న ముడిసరుకుల్లో నాణ్యత లేదని, జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యితో లడ్డూలు తయారు చేస్తున్నారని.. ఈనెల 20న మీడియాతో శ్యామలరావు చెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని మీరు కూడా ధ్రువీకరించారు. దీన్ని బట్టి స్వార్థ రాజకీయాల కోసమే శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దుష్ఫ్రచారం చేయడానికి జూన్ 14నే మహాకుతంత్రం పన్నారన్నది స్పష్టమవు తోంది కదా?
2. ఈనెల 18న కూటమి శాసనసభాపక్ష సమావేశం వేదికగా కోట్లాది భక్తుల విశ్వాసాలను.. టీటీడీ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ మీరు దారుణమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ మహాకుతంత్రంలో భాగం కాదా బాబూ?
3. ఏఆర్ డైయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ జూలై 6న, జూలై 15న సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల ఆవు నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్స్ కలిశాయని జూలై 23న ఎన్‌డీడీబీ నివేదిక ఇచ్చిందని అదే రోజు టీటీడీ ఈవో శ్యామలరావు ప్రకటించారు. కానీ.. రెండు నెలల తర్వాత ఎన్‌డీడీబీ నివేదికను టీడీపీ ఆఫీసులో విడుదల చేయడం వెనుక మీ కుట్రపూరిత ఆలోచన బహిర్గతమవుతోంది కదా?
4. కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేశామని, కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూలు తయారు చేయలేదని ఈవో శ్యామలరావు స్పష్టం చేసినప్పటికీ.. లడ్డూల తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ భావోద్వేగాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయంగా లబ్ధి పొందాలన్న మీ కుతంత్రం బట్టబయలైంది కదా?
5. మీ ప్రభుత్వ హయాంలో అక్టోబరు 2015 నుంచి మే 2019 వరకూ నందిని బ్రాండ్ నెయ్యిని టీటీడీకి కేఎంఎఫ్(కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్) సరఫరా చేయలేదు. కానీ.. కేఎంఎఫ్‌కు ఉద్దేశపూర్వకంగా నెయ్యి సరఫరా కాంట్రాక్టును వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇవ్వలేదంటూ మీరు పచ్చి అబద్ధాలు వల్లె వేయడంలో ఆంతర్యమేంటి?
6. కేజీ నెయ్యి రూ.319కే వస్తుందా? అని మీరు అంటున్నారు. తక్కువ ధరకు అప్పగించడం వల్లే కల్తీ నెయ్యిని సరఫరా చేశారంటున్నారు. మరి 2015 జూన్‌లో మీరు నిర్వహించిన టెండర్లలో రూ.324లకు కేజీ నందిని నెయ్యి సరఫరా చేస్తామని కోట్ చేసిన కేఎంఎఫ్‌ను కాదని.. రూ.276కే సరఫరా చేస్తామని గోవిందా గోవిందా మిల్క్ అండ్ మిల్క్ ప్రాడక్ట్ లిమిటెడ్ (మహారాష్ట్ర)కు నెయ్యి సరఫరా బాధ్యత ఎలా ఇచ్చారు? రూ.276కే ఇచ్చినప్పుడే కల్తీ జరగనప్పుడు రూ.319కి కొన్నప్పుడు కల్తీ ఎలా జరుగుతుంది? ఇంత చిన్న లాజిక్‌ను ఎలా మర్చిపోయి.. కళ్లార్పకుండా కమిట్‌మెంట్‌తో అబద్ధాలు చెప్పగలుగుతున్నారు?
7. టెండర్ల వ్యవస్థను నీరుగార్చి అధిక ధరలకు
కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం ద్వారా 2015–19 మధ్య ప్రభుత్వ ఖజానా నుంచి రూ.20 వేల కోట్లు మీరు దోచుకున్నారు. 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండరింగ్‌లో మీ అక్రమాలు బయటపడ్డాయి. ప్రభుత్వ ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా అయ్యింది. రివర్స్ టెండరింగ్ వల్లే టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని ఇప్పుడు మీరు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల వెనుక ఆంతర్యం మీ అక్రమాలను రివర్స్ టెండరింగ్ రట్టు చేసిందనే కడుపుమంటే కదా?
8. స్వార్థ రాజకీయాల కోసం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి మహాప్రసాదం లడ్డూపై మీరు చేసిన వ్యాఖ్యల వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గుతేల్చి.. టీటీడీ ఔన్నత్యాన్ని, భక్తుల విశ్వాసాలను పునరుద్ధరించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాస్తే మీకు అంత ఉలుకెందుకు? ప్రధాని మోదీకి లేఖ రాసేందుకు వైఎస్ జగన్‌కు ఎంత ధైర్యమని వ్యాఖ్యానిస్తారా? కేంద్రం జోక్యం చేసుకుని దర్యాప్తు చేయిస్తే మీ రాజకీయ కుతంత్రం బహిర్గతమవుతుందనే భయమే కదా? అందుకే కదా ‘సిట్’ వేసింది?
9. టీటీడీ చైర్మన్‌గా వ్యవమరించిన వైవీ సుబ్బారెడ్డి నిఖార్సైన హిందువు. 43 సార్లు అయ్యప్ప మాల ధరించారు. వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలత హిందువు. రోజూ ఉదయం గో పూజతోనే ఆమె దినచర్య ప్రారంభమవుతుంది. అలాంటి మహిళ బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారని.. అన్యమతస్థులను టీటీడీ చైర్మన్‌గా నియమించారని మీరు వ్యాఖ్యలు చేయడంలో ఆంతర్యం సున్నితమైన భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలన్న కుట్రే కదా?
10. టీటీడీ నిర్వహించే మూడు పరీక్షల్లో కల్తీ అయ్యిందని తేలితే నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేస్తారు. 2014–19 మధ్య 14–15 సార్లు.. 2019–24 మధ్య 18 సార్లు ఇలా వెనక్కి పంపేశారు. కల్తీ నెయ్యితో లడ్డూలు ఎన్నడూ తయారు చేయలేదని టీటీడీ ఈవో స్పష్టంగా చెబుతుంటే.. ఆలయంలో శాంతి హోమం నిర్వహించాలని మీరు ఆదేశించడంలో ఆంతర్యమేంటి? ఇదంతా మీరు నిరాధారమైన, దారుణమైన ఆరోపణలతో పరమ పవిత్రమైన లడ్డూను అపవిత్రం చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడంలో భాగమే కదా?
11. నిర్దిష్ట ప్రమాణాల మేరకు లేనందున తమిళనాడు డెయిరీ నుంచి వచ్చిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపేశామని, ఆ నెయ్యిని అసలు వాడలేదని ఈవో నివేదిక ఇవ్వలేదా?
12. తిరుమలలో రివర్స్ టెండర్లు ఏమిటీ? అక్కడ కూడా రివర్స్ టెండర్లు నిర్వహిస్తారా? అని ప్రశ్నించిన మీరు నిబంధనలకు విరుద్ధంగా రివర్స్ టెండర్లు పిలిచి నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఢిల్లీకి చెందిన ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థ 65 శాతం, నందిని డెయిరీ 35 శాతం సరఫరా చేసేలా ఈ ఏడాది ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక మతలబు ఏమిటీ?
ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే కుట్ర..
ఎన్నికల్లో కూటమి గెలుపొందటంతో జూన్ 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. జూన్ 14న టీటీడీ ఈవోగా శ్యామలరావును నియమించారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించక ముందే సీఎంను శ్యామలరావు కలిశారు. ఈ సమావేశంలోనే మహాకుట్రకు సీఎం చంద్రబాబు బీజం వేస్తూ.. తిరుమల ప్రసాదాల తయారీలో నాసిరకం ముడిసరుకులు వాడుతున్నారని, ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడుతున్నారని.. దాన్ని ప్రక్షాళన చేయాలని ఈవోను ఆదేశించారు. దీన్ని ఈవో శ్యామలరావు, సీఎం చంద్రబాబు మీడియా సాక్షిగా అంగీకరించారు. అంటే జూన్ 14నే మహాకుతంత్రానికి బీజం పడినట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment