హక్కులు దక్కితేనే రైతుకు రక్ష! | Dileep Reddy Article On Farmers Rights | Sakshi
Sakshi News home page

హక్కులు దక్కితేనే రైతుకు రక్ష!

Published Fri, Jun 14 2019 12:36 AM | Last Updated on Fri, Jun 14 2019 12:36 AM

Dileep Reddy Article On Farmers Rights - Sakshi

ఎంత చేసినా వ్యవసాయం వాణిజ్య వ్యాపకంగా మనలేని గడ్డు స్థితులు నేడు దేశవ్యాప్తంగా నెలకొన్నాయి. వ్యవసాయాన్ని గౌరవప్రదమైన వృత్తిగా బతకనీయాలంటే రైతుకు పనికొచ్చే సహాయక చర్యలు ఇంకా పెంచాలి. వాటికో చట్టబద్ధత తీసుకురావాలి. కేంద్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు రైతుకు పెట్టుబడి ఆర్థిక సహాయం చేస్తున్నాయి. ఇది ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగంలో వచ్చిన ఆహ్వానించదగ్గ పరిణామం! అయితే, ఇది మాత్రమే సరిపోదు. సమాచార హక్కు కమిషన్‌ తరహాలో కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ‘వ్యవసాయ కమిషన్లు’ ఏర్పాటు కావాలి. స్వతంత్ర ప్రతిపత్తితో, చట్టబద్ధమైన అధికారాలతో పనిచేసే ఈ కమిషన్లకు గట్టి అధినేతలు రావాలి. అలాగే రైతుకు సాంప్రదాయికంగా ఉంటున్న విత్తన హక్కును కాపాడటం, ఎమ్మెన్సీల దాష్టీకం నుంచి వారిని బయటపడేయటం కూడా చాలా ముఖ్యం.

ఇప్పుడు సాయం అవసరమైన స్థితిలో వ్యవసాయం ఉంది. ఒకేరకమైన సహాయంతో తీరేది కాదు. అనేక రకాల సహాయాలు అంది తేనే వ్యవసాయం బతికి బట్టకడుతుంది. ‘అజాత శత్రువే అలిగిన నాడు...’ అన్నట్టు, రైతన్నకు కోపమొచ్చి ‘నా తిండికి సరిపడా నే పండించుకు తింటాను, మిగతా భూమి పడావ్‌ (పంట విరామం) వేస్తా, ఏం చేసుకుంటారో చేసుకోండి..!’ అని ఆగ్రహిస్తే దేశం మలమల మాడాల్సి వస్తుంది. ఆ చేదు అనుభవాన్నీ తెలుగునేల ఎప్పుడో చవి చూపింది. ఎంత చేసినా వ్యవసాయం వాణిజ్య వ్యాపకంగా మనలేని గడ్డు స్థితులు నేడు దేశవ్యాప్తంగా నెలకొన్నాయి. మనది, కార్పొరేట్‌ వ్యవసాయం సాధ్యపడని చిన్న కమతాల దేశం. అందుకే, ఉన్నంతలో... పెట్టుబడి నుంచి గిట్టుబాటు ధర వరకు అన్ని దశల్లో రైతు బాగోగులు చూసి ఆదుకుంటేనే వ్యవసాయం. ఈ ఎరుకతోనే ప్రభుత్వాలు రైతుకు అంతో ఇంతో సహాయం చేయడానికి, చేసినట్టు కనబడటానికి ప్రయత్ని స్తాయి. కానీ, నిజంగా ఆదుకొని వ్యవసాయాన్ని గౌరవప్రదమైన వృత్తిగా బతకనీయాలంటే రైతుకు పనికొచ్చే సహాయక చర్యలు ఇంకా పెంచాలి. వాటికో చట్టబద్ధత తీసుకురావాలి. వ్యవసాయ విధానాలు, చట్టాలు, నిబంధనలు, విధివిధానాల అమలుపై సరైన నిఘా, నియం త్రణ ఉండాలి. ఇందుకు ప్రభుత్వాలు మరింత చొరవ చూపాలి. వృత్తికి భరోసా ఇవ్వాలి. బతుక్కి భద్రత కల్పించాలి. కష్టాల్లో రైతాంగాన్ని ఆదుకోవాలి.

కేంద్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు రైతుకు పెట్టుబడి ఆర్థిక సహాయం చేస్తున్నాయి. ఇది ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగంలో వచ్చిన ఆహ్వానించదగ్గ పరిణామం! అయితే, ఇది మాత్రమే సరిపోదు. నిన్నటికి నిన్న గుజరాత్‌లో బంగాళదుంప రైతాం గానికి, పెప్సీ కంపినీకి మధ్య జరిగిన న్యాయపోరాటం, రైతుకు కావాల్సిన ఇతరేతర భద్రతాచర్యల అవసరాన్ని నొక్కి చెప్పింది. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ‘వ్యవసాయ కమిషన్లు’ ఏర్పాటు కావాలి. స్వతంత్ర ప్రతిపత్తితో, చట్టబద్దమైన అధికారాలతో పనిచేసే ఈ కమిషన్లకు గట్టి అధినేతలు రావాలి. ప్రభుత్వాల తాబేదారులుగా ఉండే ‘జీ హుజూర్‌’లు కాకుండా కాసింత వెన్నెముక ఉన్న అధిపతులు వస్తేనే, దేశపు వెన్నెముక అయిన రైతుకు రక్ష. ఈ విషయంలో ‘మేం వ్యవసాయ కమిషన్‌’ ఏర్పాటు చేయబోతున్నాం అని ప్రకటించి ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్య మంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఒక అడుగు ముందుకు వేశారు. వివిధ రాష్ట్రాల నుంచి ఆ దిశలో సాగే మరిన్ని అడుగులు ఢిల్లీ పీఠం వరకూ సాగాలి.

పెట్టుబడి చేయూత గొప్ప సాయమే!
రెండు తెలుగు రాష్ట్రాల నేతలు తెగువతో రైతుకు పెట్టుబడి నగదు సహాయం ప్రకటించి, అమలు పరచి అఖిల భారత నాయకత్వానికి దారి చూపుతున్నారు. తెలంగాణలో కే. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా వరంగల్‌ సభలో, ఏపీలో వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందే గుంటూరు పార్టీ ప్లీనరీలో ఈ పెట్టుబడి సహాయం గురించి తొలుత ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ‘రైతు బంధు’ పేరిట ఏటా ఎకరాకి ఎనిమిది వేల రూపాయలు రెండు విడతల్లో (నాలుగేసి వేలుగా) గత సంవత్సరమే ఇచ్చింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని పదివేల రూపా యలకు పెంచి ఇస్తున్నారు. ఏపీలోనూ ‘రైతు భరోసా’కింద కుటుంబా నికి ఏటా రూ. 12,500 చొప్పున నాలుగేళ్ల పాటు ఇవ్వాలన్నది పథకం. వచ్చే ఖరీఫ్‌ నుంచి ప్రారంభమౌతుందని ముందు ప్రకటించినా, రైతులకు వీలయినంత తొందరగా మేలు కల్పించాలని ప్రస్తుత రబీ నుంచే, అంటే అక్టోబర్‌ 15 నుంచి ఇవ్వనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

తెలంగాణలో 54.50 లక్షలు, ఏపీలో ఉజ్జాయింపుగా 56 లక్షలు, మొత్తంగా కోటి కుటుంబాలకు పైగా ఈ ప్రత్యక్ష ప్రయోజనం పొందు తున్నాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలకు ముందరి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతు కుటుంబాలకు ఏటా ఆరేసి వేల రూపాయల చొప్పున నగదు సహాయాన్ని ప్రకటించింది. అయిదెకరాల లోపు భూమి ఉన్న రైతులకే అని ముందు ప్రకటించినప్పటికీ, సదరు పరిమితి లేకుండా ఇవ్వడానికి సిద్దపడింది. ఊబిలో పీకల్లోతుకు కూరుకొనిపోయి ఉన్న రైతాంగాన్ని, పెట్టుబడి సాయమొక్కటే గట్టెక్కించకపోవచ్చు! కానీ, వ్యవసాయ సీజన్‌ మొదలయ్యేటప్పుడు ఖాళీ చేతులతో ఉండే సగటు రైతుకు ఈ నగదు సహాయం ఓ వరం, ఎంతో భరోసా! కౌలు రైతులకు ఈ సహాయం అందటం లేదన్నదే, వ్యవసాయ రంగం శ్రేయో భిలాషుల మనసును కలచివేసే బాధ!

రైతు హక్కులకు రక్షణ ఏది?
తగిన చట్టాలు లేక కొంత, ఉన్నపుడు కూడా వాటి అమలు సవ్యంగా లేక మరికొంత... వ్యవసాయ రంగం, తద్వారా దేశమే స్థూలంగా నష్టపో తోంది. ఫలితంగా రాజ్యాంగ, చట్ట బద్దమైన హక్కులు రైతుకు దక్కని పరిస్థితి. బాధ్యతగా ఉండే ప్రభుత్వాలకు కొంత చొరవ ఉన్నచోట సరే! కానీ, అటువంటి చొరవ కొరవడిన చోట రైతుకు ఏ సహాయమూ లభించటం లేదు. భూ యాజమాన్య హక్కుల నుంచి రైతుకు అన్నీ సమస్యలే! పట్టాదారు పాసు పుస్తకాలు పొందడమూ గగనమే! రైతుకు దన్నుగా ఉండే సహజవనరుల్ని కార్పొరేట్లు, పలుకుబడి కల్గిన వారు స్వార్థంతో కొల్లగొడుతున్నారు. నాణ్యమైన విత్తనం లభించదు. బ్యాంకు రుణాలు, ఎరువులు, సరైన క్రిమిసంహారకాలు... ఏది పొందడమైనా రైతాంగానికి ఓ పోరాటమే. అతివృష్టి–అనావృష్టి వంటి ప్రకృతి వైప   రిత్యాల నష్టపరిహారాల నుంచి పంట భీమా వర్తించి లబ్ధి దొరకటం వరకు... ప్రతిదీ జీవన్మరణ సమస్య. పంట పండి చేతికి అందడం ఒక ఎత్తయితే, చేతికందిన పంటకు ధర, మార్కెట్, నిలువ వసతి లభించడం అంతే సవాల్‌గా పరిణమిస్తోంది.

ప్రభుత్వ పరంగా కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకటిస్తారు తప్ప అది ఖచ్చితంగా రైతుకు లభించేలా చూడరు. ఒకోసారి, ఉత్పత్తి అంతా రైతు చెయ్యిదాటి దళా రుల వశమయ్యాక ఎమ్మెస్పీతో కొనుగోళ్లు జరిగేలా ప్రభుత్వాలు అప్రమత్తమవుతాయి. ప్రత్యేక చర్యలు తీసుకుంటాయి. అది ఎవరి ప్రయోజనాల కోసమో ఇట్టే అర్థమవుతుంది. పంటకు ఆశించిన ధర లభించనపుడు, నేరుగానో, ఇతరేతరంగానో నిలువ చేద్దామన్నా తగి నన్ని గిడ్డంగులుండవు. వ్యవసాయాధారిత పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాలు కూడా ఉండవు. ప్రయివేటు, ప్రభుత్వ రంగంలో సదరు పరిశ్రమల్ని ప్రోత్సహించకపోవడం రైతుకు శాపంగా తయారవుతోంది. వీటన్నిటినీ అధిగమించడానికి కేంద్ర, రాష్ట్రాల స్థాయిల్లో చట్టబద్ధమెన ‘వ్యవసాయ కమిషన్లు’ ఏర్పడవలసిన అవసరం ఉంది.

విత్తనంపై ఎమ్మెన్సీల పెత్తనం
వేల సంవత్సరాల నుంచి మన దేశంలో ఓ గొప్ప సంప్రదాయంగా వస్తున్న రైతాంగం విత్తన హక్కు క్రమంగా హరించుకుపోతోంది. ఇప్పు డది తీవ్ర ప్రమాదంలో పడింది. పాతిక, ఇరవై సంవత్సరాల కిందటి దాకా కూడా, వీసమెత్తు భంగం లేకుండా రైతు అనుభవించిన అప్రతి హతమైన హక్కు ఇది. గత దశాబ్ద కాలంలో పరిస్థితులు చాలా మారాయి. విత్తన స్వేచ్ఛ, హక్కు నుంచి రైతును మెలమెల్లగా దూరం చేసే అంతర్జాతీయ కుట్ర యధేచ్ఛగా సాగుతోంది. ఇది పరోక్షంగా దేశ సార్వభౌమాధికారంపైనే దాడి. చట్టాల్లో తగు రక్షణ కల్పించినప్పటికీ వాటికి వక్ర భాష్యాలెక్కువయ్యాయి. విధాన పరంగా ప్రభుత్వాలు, సాంకేతికాంశాల వల్ల అక్కడక్కడ న్యాయస్థానాలు కూడా రైతును కాదని కార్పొరేట్లు, బహుళజాతి కంపెనీ (ఎమ్మెన్సీ)ల వైపే మొగ్గుతున్నాయి. పేటెంట్‌ చట్టాలు, మేథోసంపత్తి హక్కులు, ట్రిప్స్‌–డబ్లుటీవో ఒప్పం దాల నీడలో ఈ ఎమ్మెన్సీలు పెట్రేగిపోతున్నాయి. మోన్‌సాంటో, పెప్సీ, బేయర్‌... వంటి బడా కంపెనీల అకృత్యాలు, ఆధిపత్య ధోరణులు పెచ్చుమీరాయి.

గుజరాత్‌లో బంగాళదుంప రైతులపై పెప్సీ కంపెనీ దావా వేయడం ఈ దాష్టీకాల్లో భాగమే! పెద్ద ఎత్తున ‘ఆలు చిప్స్‌’ తయారీకి స్థానికంగా రైతులతో ఒప్పందం కుదుర్చుకొని పండిస్తున్న ‘ఎఫ్‌.ఎల్‌ 2027’ రకం బంగాళదుంపపై తనకు పేటెంట్‌ హక్కులు న్నాయనేది వాదన. తన అనుమతి లేకుండా నలుగురు రైతులు ఆ రకం పంట పండించి, అమ్ముకుంటున్నారనేది పెప్సీ కంపెనీ అభియోగం. అంతకు ముందు అయిదుగురిపైన ఇవే రకం ఆరోపణలు. ఒక్కో రైతు కోటి రూపాయల పైన నష్టపరిహారం చెల్లించాలని దావా! స్థానిక రైతులు, రైతాంగ సంఘాల వారు, మేథావులు అహ్మదాబాద్‌లో సమా వేశమై ప్రతిఘటించారు. దావా వేయడానికి పెప్సీ కంపెనీ, ‘ప్లాంట్‌ రకాలు, రైతుల హక్కుల (పిపివి అండ్‌ ఎఫ్‌ ఆర్‌) చట్టం–2001’ లోని సెక్షన్‌ 64ని ఉటంకిస్తే, రైతులు అదే చట్టంలోని సెక్షన్‌ 39ని వాడు కున్నారు. ‘తమ వ్యవసాయ ఉత్పత్తికి విత్తనాలను దాచుకోవడం, వాడడం, విత్తనాలను నాటడం, తిరిగి నాటడం, మార్చుకోవడం, పంచు కోవడం లేదా విక్రయించుకోవడం....’ వంటి రైతు హక్కుల్ని చట్టంలోని ఈ సెక్షన్‌ రక్షిస్తుంది. అయితే, ఈ చట్టం కింద ‘బ్రాండెడ్‌ సీడ్‌’ను విక్రయించ కూడదు. రైతు పోరాటం ఫలితంగా పెప్సీ కంపెనీ తన కేసుల్ని ఉపసంహరించుకోవడం ఒక రకంగా రైతాంగ విజయమే! అన్ని చోట్ల, అన్ని సార్లూ ఇది సాధ్యపడకపోవచ్చు. అందుకే, న్యాయాధికారా లతో కూడిన ఓ చట్టబద్ధ కమిషన్‌ అవసరం.

ముసాయిదా సిద్ధంగానే ఉంది
తమ హక్కులకు భంగం కలిగిన ప్రతి సందర్భంలోనూ రైతులు ఈ కమిషన్‌ను సంప్రదించవచ్చు. మానవహక్కుల సంఘం, సమాచార హక్కు కమిషన్‌ తరహాలో వ్యవసాయానికి కేంద్ర, రాష్ట్ర కమిషన్లను ఏర్పాటు చేసుకోవాలి. వ్యవసాయానికి సంబంధించిన అన్ని చట్టాల అమలును పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు ఈ కమిషన్‌లు వ్యవసాయాభివృద్ధికి సంబంధించిన సిఫారసులు చేస్తాయి. రైతుకు నష్టం జరిగిన పుడు బాధ్యులపై చర్యలు పుర మాయిస్తూనే, రైతుకు సత్వర న్యాయం జరిగేలా ప్రభుత్వాలకు తగు ఆదేశాలిస్తాయి. వ్యవసాయానికి జరిగిన, జరుగుతున్న, జరుగబోయే నష్టాల్ని కూడా కమిషన్‌ నివారించగలుగు తుంది. కమిషన్‌ పరిధి, అధికారాలు, పనితీరు, విధి–విధానాలకు సంబం ధించిన అంశాలతో ముసాయిదా ఎప్పుడో సిద్దమైంది. ఉమ్మడి ఆంధ్ర   ప్రదేశ్‌ న్యాయశాఖ దీన్ని లోతుగా పరిశీలన చేసింది. ఇలాంటి విషయాల్లో ‘ముసాయిదా’ కన్నా ‘సంకల్పం’ (విల్‌ రాదర్‌ దెన్‌ బిల్‌) ముఖ్యం.


దిలీప్‌ రెడ్డి 
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement