దండేపల్లి : శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుపై నిర్మించిన దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణస్వామి ఎత్తిపోతల పథకం నీటిని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మంగళవారం విడుదల చేయనున్నారు. దీంతో కడెం ఆయకట్టు చివరి రైతుల్లో ఆనందం నెలకొంది. ఆయకట్టు పరిధిలోని డి–30నుంచి డి–42 వరకు గూడెం ఎత్తిపోతల నీటిని అందించనున్నారు. ఎత్తిపోతల పథకానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి రూపకల్పన చేసి రూ.118 కోట్లు నిధులు మంజూరు చేసి 2009 జనవరి 27న పనులకు శంకుస్థాపన చేశారు. నిధుల కొరతతో మిగిలిపోయిన పనులకు ప్రస్తుత సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు 2014లో బడ్జెట్‌ను రూ.180 కోట్లకు పెంచి పనులు పూర్తి చేశారు. 2015 జూన్ 5న ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి రైతులకు అంకితం చేశారు. అదే సంవత్సరం ఎత్తిపోతల నీటిని కడెం ప్రధాన కాల్వకు విడుదల చేసి ఖరీప్‌లో ఆయకట్టు చివరిదాక సాగునీరందించారు.
యాసంగికి మొదటిసారి..
ఎత్తిపోతల పథకం ప్రారంభించినప్పటి నుంచి యాసంగికి నీళ్లు ఇవ్వడం ఇదే మొదటిసారి. 2015లో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అదే సంవత్సరం ఖరీఫ్ సాగుకు నీరందించారు. నీటి కొరత కారణంగా 2016లో రబీకీ నీరందించలేకపోయారు. మొన్నటి ఖరీఫ్‌కు కడెం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీరుండటంతో ఆయకట్టు చివరిదాక కడెం ప్రాజెక్టు నీటినే అందించారు. అయితే.. యాసంగి సాగుకు కడెం నీరు చివరిదాక సరిపోనందున గూడెం ఎత్తిపోతల నీరు అందించాలని అధికారులు ఇటీవలే నిర్ణయించారు. యాసంగిలో ఆరుతడి పంటలకు గూడెం ఎత్తిపోతల నీటిని అందిస్తుండటంతో ఆయకట్టు చివరి రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
17,775ఎకరాలకు సాగునీరు..
గూడెం ఎత్తిపోతల ద్వారా దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో 30 వేల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. అయితే.. ఈ యాసంగిలో మాత్రం ఆరుతడి పంటల కోసం 2.26 టీఎంసీల నీటిని 17,775 ఎకరాలకు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. గూడెం పంప్‌హౌజ్ నుంచి 11 కిలోమీటర్ల పైప్‌లైన్ ద్వారా దండేపల్లి మండలంలోని తానిమడుగు వద్ద కడెం ప్రాజెక్టు డి–30 వద్ద నిర్మించిన డెలివరి సిస్టర్న్ ద్వారా కడెం ప్రధాన కాల్వలో నీటిని విడుదల చేస్తారు. దీంతో గూడెం ఎత్తిపోతల నీరు కడెం ఆయకట్టు చివరిదాక వెళ్లనుంది.
అన్నదాతల్లో ఆనందం
Published Tue, Jan 10 2017 10:45 PM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM
Advertisement