సాక్షి, జగిత్యాల : పరవళ్లు తొక్కుతున్న గోదావరిని చూసి సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి నృసింహుని పాదాల చెంతకు సజీవ గోదా వరి సాక్షాత్కరిస్తోందని వ్యాఖ్యానించారు. 150 కిలోమీటర్ల మేర నిండుకుండలా ఉన్న గోదావరిని చూసి తనువు పులకరిస్తోందన్నారు. తన గర్భంలోని దాదాపు వంద టీఎంసీల నీటిని తెలంగాణ బిడ్డలకు ఇవ్వడానికి గోదావరి సంసిద్ధంగా ఉందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా మంగళవారం సీఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. అనంతరం జగిత్యాల జిల్లాలో ధర్మపురి లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఎవరూ కలలో కూడా అను కోలేదు, దీనిపై నాకు కూడా సందేహాలుండేవి. కానీ నేడు ఈ అద్భుతాన్ని నా కళ్లతో చూస్తున్నాను‘‘అని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం మనల్ని చూసి నేర్చుకుంటోందని, ప్రతి పక్షం రోజులకోసారి కేంద్ర ప్రభుత్వ, ఇతర రాష్ట్రాల కార్యదర్శులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారని చెప్పారు. సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని, మనల్ని మించినోడు దేశంలోనే లేడని వ్యాఖ్యానించారు.
కాళేశ్వరంతో 400 టీఎంసీల నీరు..
గోదావరి నది ద్వారా ఇంతకుముందు లభించే నీటి కంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్ ద్వారా అదనంగా 400 టీఎంసీల నీరు లభ్యం కానుందని సీఎం కేసీఆర్ వివరించారు. గోదావరి నదిపై సీడబ్ల్యూసీ పొందుపర్చిన 44 ఏళ్ల రికార్డులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. జూన్ నుంచి నవంబర్ వరకు నెలకు 60 టీఎంసీల చొప్పున 360 టీఎంసీలు, నవంబర్ నుంచి జూన్ వరకు వర్షాలు తక్కువ పడే కాలంలోనూ 40 టీఎంసీల చొప్పున మొత్తం 400 టీఎంసీల నీటితో 45 లక్షల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయని తెలిపారు.
మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి రోజుకు 3 టీఎంసీల చొప్పున, ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు ద్వారా మల్లన్నసాగర్‌కు రోజుకు 2 టీఎంసీలు, అక్కడి నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోస్తారని వివరించారు. ఎల్లంపల్లి ఇక ఎప్పటికీ ఎండిపోదని స్పష్టంచేశారు. ధర్మపురి నృసింహుని పాదాల చెంత గోదావరి 365 రోజులు నీటితో కళకళలాడుతూనే ఉంటుందని పేర్కొన్నారు. ఎస్సారెస్పీలో నీటి లభ్యత తక్కువగా ఉందని, ప్రస్తుతం 9 టీఎంసీల మేరకే పరిమితమైందని చెప్పారు. ఎల్లంపల్లి నుంచి వరద కాలువ ద్వారా 70 టీఎంసీల నీటిని ఎస్సారెస్పీకి తరలించి 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని కేసీఆర్ తెలిపారు.
గోదావరికి మించి వేరే మార్గం లేదు
రాష్ట్రానికి గోదావరి నదికి మించి ప్రత్యామ్నాయం లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సాగు, తాగు నీరు, పరిశ్రమలకు గోదావరి తప్ప మరో మార్గం లేదన్నారు. కానీ గోదావరి కింద కళకళలాడుతూ, పైన మాత్రం వెలవెలబోతోందన్నారు. మేడిగడ్డ వద్ద గోదావరి నది బెడ్ లెవల్ 88 మీటర్లు ఉండగా, బ్యారేజీ నిర్మాణం 100 మీటర్ల లెవల్ వరకు, అన్నారం వద్ద బెడ్ లెవల్ 106 మీటర్లు ఉండగా బ్యారేజీ నిర్మాణం 119 మీటర్లు, సుందిళ్ల వద్ద బెడ్ లెవల్ 118 మీటర్లు ఉండగా, బ్యారేజీ నిర్మాణం 130 మీటర్ల ఎత్తుకు, ఎల్లంపల్లి వద్ద 129 మీటర్ల నుంచి ప్రాజెక్ట్ నిర్మాణం 148 మీటర్ల ఎత్తుకు నిర్మించుకున్నామని వివరించారు. గత పాలకులైతే మరో 25 ఏళ్లైనా వీటిని పూర్తి చేసేవారు కాదని వ్యాఖ్యానించారు. ఎల్లంపల్లి పూర్తిస్థాయి సామర్థ్యానికి నిండిందని, ఇక్కడి నుంచి మిడ్‌మానేరుకు నీటి తరలింపు పూర్తయితే ప్రాజెక్ట్ లక్ష్యం 65 శాతం సాఫల్యమైనట్లేనని చెప్పారు. వారం రోజుల్లో మిడ్‌మానేరుకు నీరు విడుదల కావాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇకపై అప్పర్ మానేరు, మిడ్‌మానేరు నిండుకుండలా కళకళలాడతాయన్నారు. ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీకి నీటిని తరలించడం రివర్స్ పంపింగ్ కాదని, లిఫ్టింగ్ మాత్రమేనని ఆయన వివరించారు.
తెలివితక్కువ మాటలొద్దు..
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం భారీగా ఖర్చులు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మొత్తం 400 టీఎంసీలను ఎత్తిపోసేందుకు అయ్యే ఖర్చు ఏటా రూ.4,992 కోట్లు మాత్రమేనని చెప్పారు. అది కూడా అవసరమైనప్పుడు మాత్రమే ఎంత అవసరమో అంతే వినియోగించుకుంటారని వివరించారు. బహుముఖ ప్రయోజనాలు కలిగిన ఈ ప్రాజెక్టు కోసం తమ మెదళ్లను ఎంతగానో కరిగించామన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నది గర్భంలోనే 91 ఎకరాల విస్తీర్ణంలో నీరు నిల్వ ఉండేలా ప్రాజెక్టు రూపకల్పన చేశామని చెప్పారు. భూసేకరణతో రైతులకు ఇబ్బందులు కాకుండా చేశామన్నారు.
కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వకపోయినా సొంత నిధులు, తెలివితేటలతో ప్రాజెక్ట్ పూర్తి చేశామని వివరించారు. కొన్ని ప్రగతి నిరోధక, రాజకీయ శక్తులు ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు 300 కేసులు వేశాయని విమర్శించారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడిన జయప్రకాశ్ నారాయణకు తెలంగాణతో ఏం సంబంధమని కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రం వద్దన్న వ్యక్తి, సగం తెలివి ఉన్న ఆయనది ఏ సిద్దాంతమని నిలదీశారు. 50 వేల రైతు కుటుంబాల కంటే ముఖ్యమైన వారు రాష్ట్రంలో ఎవరున్నారన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్ర కోసం ఉద్యమించిన కేసీఆర్ బతికుండగా రాష్ట్రానికి అన్యాయం జరగనిస్తాడా, సోయి తప్పి పనిచేస్తాడా, రాష్ట్రానికి కష్టం, నష్టం రానిస్తాడా’’అని వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టులకు అయ్యే విద్యుత్ ఖర్చు రూ.5 వేల కోట్లు ఆదా చేసి ఎవరికి కిరీటం తొడగాలని ప్రశ్నించారు.
ధర్మపురి నృసింహుడు నమ్మిన దేవుడు..
ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి తాను నమ్మి మొక్కిన దేవుడని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమం వ్యాప్తి చెంది, ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిందని గుర్తుచేశారు. ఆలయాభివృద్ధికి ఇప్పటికే ప్రకటించిన రూ.50 కోట్లతోపాటు మరో 50 కోట్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నృసింహుని ఆలయంతోపాటు శివాలయం, కోనేరు అంతా ఒకే ప్రాంగణంలోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నెలరోజుల్లో ధర్మపురిలో ప్రత్యేకంగా పర్యటిస్తానని చెప్పారు. ధర్మపురి మున్సిపాలిటీకి రూ.10 కోట్లు, నియోజకవర్గంలోని మండల కేంద్రాలకు రూ.25 లక్షలు, ఒక్కో గ్రామపంచాయతీకి రూ.10 లక్షలు ప్రత్యేక నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత, కలెక్టర్ శరత్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, చెన్నమనేని రమేశ్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సుంకె రవిశంకర్ ఉన్నారు.
గోదారమ్మకు సారె
నిండుగా ప్రవహిస్తూ పరవళ్లు తొక్కుతున్న గోదావరికి సీఎం కేసీఆర్ సారె సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా మంగళవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీకి హెలికాప్టర్‌లో చేరుకున్నారు. జోరువానలో కాలినడకన ఆయన పర్యటన సాగింది. నిర్ణీత సమయానికంటే గంట ఆలస్యంగా మేడిగడ్డ చేరుకున్న కేసీఆర్.. తొలుత ఏరియల్ సర్వే ద్వారా బ్యారేజీని పరిశీలించారు. అనంతరం బ్యారేజీపై ఉన్న 35వ గేట్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. తన వెంట ఉన్న ప్రజాప్రతినిధులకు, ఇతర అధికారులకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరిస్తూ ముందుకు సాగారు. ఇప్పటివరకు ఎన్ని టీఎంసీల నీరు దిగువకు వెళ్లిందనే విషయాన్ని ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు మూసి ఉంటే 100 మీటర్ల నీటిమట్టం ఉంటుందని, అలాంటిది అన్ని గేట్లు తెరిచినా దాదాపు 96.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవాహం ఉండటం చూసి సీఎం ఆనందం వ్యక్తంచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యమే 180 టీఎంసీలు ఎత్తిపోయడమని.. అయితే ఒక్క వారంలోనే దాదాపు 250 టీఎంసీల నీరు కిందికి వెళ్లిందని తెలిసి.. అనుకున్నది సాధించామని ఆనందపడ్డారు. ప్రస్తుతం 4 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోందని అధికారులు సీఎంకు వివరించారు. దాదాపు 50 నిమిషాలపాటు అక్కడే గడిపిన కేసీఆర్.. బ్యారేజీ గేట్ల నిర్వహణ, వరద నియంత్రణకు సంబంధించి ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం గోదారమ్మకు పసుపు, కుంకుమ, పూలతో సారెను సమర్పించారు. మేడిగడ్డ పర్యటనలో సీఎం వెంట çమంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ ఆర్.భాస్కరన్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment