సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ద్వారా ఎత్తిపోస్తున్న గోదావరి జలాల సమగ్ర వినియోగమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న ప్రభుత్వం వరద కాల్వపై మరో ఎత్తిపోతల పథకానికి ప్రాణం పోస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింది ఆయకట్టుకు పూర్తి భరోసా కల్పించేలా సూరమ్మ చెరువు ఎత్తిపోతలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ ఎత్తిపోతల ద్వారా సుమారు 60 వేల ఎకరాలకు సాగునీరిచ్చేలా సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమవుతోంది. ఇప్పటికే వేసిన అంచనాల ప్రకారం.. ఈ ఎత్తిపోతల వ్యయం రూ.340 కోట్లుగా ఉంటుందని ఇంజనీర్లు తేల్చారు.
ఎల్లంపల్లికి పూర్తి భరోసా..
శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం ద్వారా వరద కాల్వ కింది ఆయకట్టుకు పూర్తి భరోసా కల్పించిన ప్రభుత్వం, ఎల్లంపల్లి కింది ఆయకట్టుకు సైతం ఇదే పథకం నుంచి నీళ్లందించాలని గతంలోనే నిర్ణయించింది. ఎల్లంపల్లి కింద 2 లక్షల ఎకరాల ఆయకట్టుండగా, ప్రస్తుతం లక్ష ఎకరాలకే నీరందుతోంది. మరో 44 వేల ఎకరాలకు నీళ్లందించేందుకు ఎల్లంపల్లి నుంచి ఐదు దశల్లో వేమనూరు, మేడారం, గంగాధర, కొడిమ్యాల, జోగాపూర్ వరకు నీటిని లిఫ్టు చేసి సూరమ్మ చెరువుకు ఎత్తిపోతలు చేపట్టారు. అయితే ఈ విధానం ద్వారా కాకుండా వరద కాల్వ నుంచి ఒకే ఒక్క దశలో నీటిని లిఫ్టు చేసి ఈ చెరువుకు తరలించేలా గతంలో జరిగిన సమీక్షల సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రతిపా దించారు.
వరద కాల్వ 52వ కిలోమీటర్ నుంచి నీటిని మళ్లించి, దాన్ని పంపుల ద్వారా 85 నుంచి 90 మీటర్ల మేర ఎత్తిపోసి 10 కిలోమీటర్ల ఫ్రెషర్ మెయిన్స్ ద్వారా సూరమ్మ చెరువులోకి తరలించేలా ప్రతిపాదన సిద్ధం చేశారు. నీటి లభ్యత పెంచేందుకు చెరువు సామర్థ్యాన్ని 0.15 టీఎంసీ నుంచి 0.45 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించారు. దీంతోపాటే వరద కాల్వ ద్వారా తూములు నిర్మించి 139 చెరువులను నింపాలని నిర్ణయించారు. ఈ మొత్తం ప్రతిపాదనకు రూ.340 కోట్ల మేర ఖర్చవుతుందని లెక్కగట్టారు. వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని మల్యాల, కథలాపూర్, మేడిపల్లి మండలాల్లో 60వేల ఎకరాలకు సాగునీరందేలా దీన్ని డిజైన్ చేసినట్లు ఈఎన్‌సీ అనిల్‌కుమార్ వెల్లడించారు.
వరద కాల్వపై మరో ఎత్తిపోతల
Published Thu, Sep 3 2020 5:38 AM | Last Updated on Thu, Sep 3 2020 5:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment