మంచిర్యాల రూరల్ : ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితులు గురువారం తమను ఆదుకోవాలని మంచిర్యాలలో ఆందోళనకు దిగారు. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడంతో ముంపు గ్రామాల సమీపంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరి నానా తిప్పలు పడాల్సి వస్తోందని ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ జగన్మోహన్‌ను కలిసి విన్నవించారు. కర్ణమామిడి, పడ్తన్‌పల్లి గ్రామాలకు ఇప్పటి వరకు ఇంటి డబ్బులు, ఇంటి అడుగు స్థలం డబ్బులు ఇవ్వలేదని, కర్ణమామిడి గ్రామానికి పునరావాస కాలనీ పనులు ఏర్పాటు చేయలేదని ఆయనకు వివరించారు.
స్పందించిన కలెక్టర్ నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిహారం ఎప్పుడు చెల్లిస్తారని ఎస్డీసీ తిరుపతిరావును అడగ్గా, పది రోజుల్లోగా కొంత పరిహారం నిధులు వస్తాయని తెలిపారు. ఎంపీపీ బేర సత్యానారయణ, జెడ్పీటీసీ రాచకొండ ఆశాలత, వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, పడ్తన్‌పల్లి, కర్ణమామిడి సర్పంచులు పాల్గొన్నారు.
గుళ్లకోట నిర్వాసితుల ఆందోళన
ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష జరుపుతున్న కలెక్టర్ బయటకు వచ్చి, నిర్వాసితుల సమస్యలను వినాలంటూ లక్సెట్టిపేట మండలం గుళ్లకోటకు చెందిన గ్రామస్తులు ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు బైఠాయించి, తమకు పరిహారం అందించేందుకు కలెక్టర్ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం బయటకు వెళ్తున్న కలెక్టర్‌ను అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
నిర్వాసితులను ఆదుకోండి..
Published Fri, Oct 17 2014 2:49 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
Advertisement