గోదావరిఖని, న్యూస్‌లైన్ : కోల్‌బెల్ట్ ప్రజలకు నీటి ముప్పు పొంచి ఉంది. తలాపునే గోదావరి ఉన్నా తాగునీటికి నానా తిప్పలు పడే రోజులు రానున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంతో నీరు కిందకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో అవస్థలు తప్పేలా లేవు. కార్మికుల శ్రేయస్సే ధ్యేయమని చెబుతున్న సింగరేణి యాజమాన్యం ముందస్తు చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.
తాగునీటికి ఖర్చు చేసేందుకు వెనుకంజ
సింగరేణి సంస్థ గోదావరి నది ఒడ్డున గల ఫిల్టర్‌బెడ్ నుంచి పారిశ్రామిక ప్రాంతానికి నీటిని సరఫరా చేస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుతో నదిలో ప్రవాహం నిలిచిపోయే పరిస్థితి ఉన్నందున సింగరేణి సంస్థకు ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ నీటిని పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిం ది. సింగరేణి అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరిఖని వరకు ఏర్పాటు చేసే పైపులైన్లు, స్టోరేజీ ట్యాంకులు.. తదితర నిర్మాణాల కోసం కన్సల్టెంట్ సంస్థతో సర్వే నివేదికను తయారు చేయించారు.
ఈ పైపులైన్ల ఏర్పాటుకు సుమారు రూ.220 నుంచి రూ.250 కోట్లు ఖర్చవుతుందని ఆ సంస్థ ప్రాథమికంగా అంచనా వేసి నివేదికను సింగరేణికి అప్పగించింది. సింగరేణి యాజమాన్యం ఈ ఖర్చుకు వెనకడుగు వేసి ఎల్లంపల్లి నుంచి నీటిని పైపులైన్ల ద్వారా తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తు తం సింగరేణి మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులో ఊటగా వచ్చే నీటిని మోటార్ల ద్వారా నదిలోకి వదిలితే ఆ నీరే దిగువప్రాంతానికి ప్రవహిస్తోంది. సింగరేణి ఫిల్టర్‌బెడ్‌కు ఎగువ ప్రాంతం లో గోదావరిఖని పట్టణం నుంచి వచ్చే మురుగునీరు వచ్చి నదిలో చేరుతోంది. ఇలా ప్రస్తు తం సింగరేణి నీటిని అందిస్తోంది.
ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి
సింగరేణి మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు కోసం ప్రస్తుతం మట్టి, బొగ్గు వెలికితీయగా తయారైన కందకంలో ప్రతీ వర్షాకాలంలో నదిలో వచ్చే వరద నీటిని నింపాలని యాజమాన్యం ఆలోచిస్తోంది. నిల్వ చేసిన నీటిని తిరిగి కార్మికుల అవసరాలకు ఉపయోగించుకోవాలని చూస్తోం ది. ఈ ప్రయోగం తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా... వర్షాలు కురవక వరద రాకపోతే భవిష్యత్‌లో తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడే పరిస్థితి ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎల్లంపల్లికి గేట్లు బిగించడంతో ఇప్పటికే కిందవైపునకు నీటి ప్రవాహం నిలిచి పోయినట్లయింది.
పాజెక్టు ప్రారంభించే ముం దు స్థానిక అవసరాలకు నీటిని కేటాయించాల్సిందేనంటూ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఇటీవల ఆందోళన నిర్వహించారు. మామూలు రోజుల్లో నే నీటికి ఇబ్బంది ఏర్పడితే.. వేసవిలో అవస్థలు ఎలా ఉంటాయో ఊహించొచ్చు. ఇప్పటికే రామగుండం కార్పొరేషన్ నుంచి జరుగుతున్న ప్రయత్నాలు ముందుకు సాగకపోగా... సింగరేణి యాజమాన్యం కూడా పట్టింపులేకుండా వ్యవహరిస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నీటి ఇబ్బందుల పరిష్కారానికి సింగరేణి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.
కోల్‌బెల్ట్‌కు నీటి కష్టాలు!
Published Mon, Jan 6 2014 4:41 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
Advertisement