కోల్‌బెల్ట్‌కు జలగండం | Ramagundam drinking water | Sakshi
Sakshi News home page

కోల్‌బెల్ట్‌కు జలగండం

Published Fri, Dec 19 2014 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM

కోల్‌బెల్ట్‌కు జలగండం

కోల్‌బెల్ట్‌కు జలగండం

 గోదావరిఖని : రామగుండం ప్రాంతంలో రానున్న వేసవిలో తాగునీటికి కటకటాలు తప్పేలా లేవు. చలికాలంలోనే నీటి ఎద్దడి తీవ్రత పెరుగుతుండడంతో వేసవిలో నీటిగండం ఎలా ఉంటుందో ఊహించని విధంగా తయారైంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరిలో ప్రవాహం లేక నది పూర్తిగా ఎండిపోయింది.
 
 కనుచూపు మేరలో గోదారమ్మ ఎడారిని తలపిస్తోంది. దీంతో ఊట నీటినే ఫిల్టర్ చేసి ప్రజలకు అందించాల్సిన పరిస్థితి ఇటు కార్పొరేషన్‌కు, అటు సింగరేణి యాజమాన్యానికి ఏర్పడింది. 2004లో ఎల్లంపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టిన తరుణంలోనే భవిష్యత్‌లో కోల్‌బెల్ట్ ప్రాంతానికి తాగునీటికి ఇక్కట్లు తప్పవని అధికారులకు తెలుసు. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసినప్పటికీ కార్పొరేషన్, సింగరేణి యంత్రాంగం దృష్టి సారించకపోవడం వల్ల సమస్య జటిలంగా మారింది.
 
 రామగుండం కార్పొరేషన్ పరిధిలో సుమా రు 15వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. గోదావరినది ఒడ్డున గల ఫిల్టర్‌బెడ్ ద్వారా 135 హెచ్ పీ సామర్థ్యం గల మోటార్‌తో నీటిని తోడి శారదానగర్‌లోని ట్యాంకుకు చేరుస్తారు. అక్కడినుంచి వివిధ ప్రాంతాలలో గల ట్యాంకులకు సమయానుకూలంగా నీటిని అందిస్తారు. అయి తే ప్రస్తుతం గోదావరినదిలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో నదిలో ఇన్‌ఫిల్ట్రేషన్ గ్యాలరీ సమీపంలో నీటికోసం గుంతలు తవ్వి ఊట నీటిని ఫిల్టర్‌బెడ్‌లోకి పంపింగ్ చేస్తున్నారు. అక్కడినుంచి పలు కాలనీలకు నీటిని అంది స్తుండగా మరికొన్ని కాలనీలకు ట్యాంకర్లతో నీరందించాల్సిన పరిస్థితి దాపురించింది.
 
 ప్రత్యామ్నాయ చర్యలు ఫలించేనా..?
 ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ నీటిని వినియోగించుకునేందుకు కార్పొరేషన్‌కు అవకాశం ఉంది. ఇందుకోసం ప్రాజెక్టు నుంచి గోదావరిఖని వరకు పైపులైన్ నిర్మాణం చేపట్టేందుకు గతంలో జైపూర్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ సర్వే చేపట్టింది. సుమారు రూ.100 కోట్లు ఖర్చు అవుతుందని తేల్చింది. నివేదికను గత ప్రభుత్వానికి పంపగా దానిని పక్కనపెట్టేశారు. ప్రస్తుత ఎమ్మెల్యేతో పాటు మేయర్, అధికారులు ఎల్లంపల్లి నుంచి ఎన్టీపీసీ రిజర్వాయర్‌లోకి వచ్చే కుందనపల్లి శివారులోని పైపులైన్ సిస్టర్న్ నుంచి రూ.20 కోట్లతో కార్పొరేషన్‌కు తాగునీటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించగా సహకారాన్ని అందిస్తామని మంత్రి హరీష్‌రావు హామీ ఇచ్చారు. ఈ ఫైల్ సీఎం పేషీలో ఉంది. పట్టింపులేని సింగరేణి సింగరేణి సంస్థ గోదావరినది ఇంటెక్‌వెల్ నుంచి ఆర్జీ-1,2,3 డివిజన్ల పరిధిలోని గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, పోతనకాలనీ, సెంటినరీకాలనీ వరకు 21.90 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాదాపు 20వేల క్వార్టర్లకు, మరో 20వేల ప్రైవేటు గృహాలకు నల్లా నీటిని అందిస్తోంది.
 
 గోదావరినది వద్ద గల ఫిల్టర్‌బెడ్ నుంచి 240 హెచ్‌పీ సామర్థ్యం గల మూడు మోటర్లను నిరంతరం నడిపిస్తోంది. 18 మెగావాట్ల పవర్‌హౌస్‌కు సైతం రా వాటర్‌ను గోదావరినది నుంచే తరలిస్తున్నారు. ప్రస్తుతం నది ఎండిపోగా.. ఇన్‌ఫిల్ట్రేషన్ గ్యాలరీల నుంచి ఊటగా వచ్చే నీటిని ఇంటేక్‌వెల్‌లో ఫిల్టర్ చేస్తూ క్వార్టర్లకు సరఫరా చేస్తున్నారు. మూడేళ్లుగా వేసవి కాలంలో గోదావరినది ఎండిపోతుంటే సుమారు 40 బోర్లను వేసి నీటిని తోడుతున్నారే తప్ప ప్రత్యామ్నాయ చర్యల గురించి మాత్రం ఆలోచించడం లేదు.
 
  ప్రభుత్వం సింగరేణి సంస్థ తాగునీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వాడుకునేందుకు ఒక టీఎంసీ నీటిని కేటాయించింది. ప్రాజెక్టు నుంచి గోదావరినది ఒడ్డున ఫిల్టర్‌బెడ్ వరకు పైపులైన్ల ఏర్పాటుకు సుమారు రూ.100 కోట్ల వ్యయం అవుతుండడంతో సింగరేణి యాజమాన్యం ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. గోదావరినది ఎండిపోయిన ప్రతిసారి సింగరేణి భూగర్భగనుల్లో ఊటగా ఏర్పడే నీటిని ఉపరితలానికి పంపించి అక్కడినుంచి ఫిల్టర్‌బెడ్‌లకు తరలించి శుద్ధిచేసి కాలనీలకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం యైటింక్లయిన్‌కాలనీకి గనుల నుంచి వచ్చిన నీటినే సరాఫరా చేస్తున్నట్టు కార్మిక కుటుంబాలు పేర్కొంటున్నాయి.
 
 శాశ్వత చర్యలేవీ..?
 రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు తాగునీటిని అందించేందుకు ఇటు కార్పొరేషన్ గానీ, అటు సింగరేణి గానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కాకుండా శాశ్వతమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఎన్టీపీసీ రిజర్వాయర్ వద్ద గల సిస్టర్న్ నుంచి నది నీటిని తీసుకోవడానికి ఇబ్బంది లేకపోయినా రిజర్వాయర్‌కు ఏడాది పొడువునా నీటి సరఫరా జరగదు. అలాంటి సందర్భంలో రిజర్వాయర్‌కు ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా నిలిచిపోతే పరిస్థితి ఏమిటనేది ప్రశ్న. ఇలాంటి నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరిఖని వరకు శాశ్వతంగా పైప్‌లైన్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంటుంది.
 
   సింగరేణి సంస్థ కూడా గనుల ఊట నీటిని తాగునీటిగా అందించే ప్రయత్నం చేస్తే నీటిలోని మందం (పార్ట్స్ ఫర్ మిలియన్ -పీపీఎం) ఎక్కువగా ఉంటే అది తాగేందుకు పనికిరాకుండా పోతుంది. అలాగే శారీరక నొప్పులతో లేనిరోగాలను కొనితెచ్చుకున్నట్టవుతుంది. ఈ తరుణంలో సింగరేణి యాజమాన్యం సైతం ఎల్లంపల్లి నుంచి పైప్‌లైన్ నిర్మాణం చేపడితేనే గని కార్మికులు, వారి కుటుంబాలకు దాహార్తిని తీర్చినట్టువుతుంది. ఆ దిశగా సింగరేణి, కార్పొరేషన్ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement