
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈ సీజన్‌లో ఆలస్యంగా అయినా చెప్పుకోదగ్గ నీటి ప్రవాహాలు రావడంతో పరీవాహక ప్రాంత రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రాజెక్టులోని నీటి నిల్వలతో ఖరీఫ్ పంటలకు చివరిదశలో అయినా 2, 3 తడులకు నీరందే అవకాశాలు మెరుగయ్యాయి. 90 టీఎంసీల నిల్వలకుగాను 54 టీఎంసీల మేర నిల్వ చేరడం, స్థిరంగా ఎగువ నుంచి ప్రవాహం వస్తుండటంతో .. వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో సిద్ధం చేసిన పంపులతో కాళేశ్వరం నీటిని తరలించే అవసరం లేకుండా పోయింది. ప్రతి ఏడాది గోదావరి నదీ బేసిన్‌లో జూన్, జూలైలో మంచి వర్షాలుంటాయి. వీటితోనే ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ప్రవాహాలుంటాయి. సెప్టెంబర్ వరకు సరైన వర్షాలు లేకపోవడం, ఎగువనున్న మహారాష్ట్ర నుంచి దిగువకు ప్రవాహాలు కొనసాగకపోవడంతో ఎస్సారెస్పీకి నీటి రాక ఆలస్యమైంది. ఈ నెలాఖరు వరకు మంచి వర్షాలున్నాయనే అంచనాల నేపథ్యంలో మరో 10 టీఎంసీలైనా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.