
సీఐడీ కస్టడీ నుంచి సీఐ పరారీ
బాల్కొండ, న్యూస్‌లైన్: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కేంద్రంగా విధులు నిర్వర్తించే ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి బుధవారం రాత్రి సీఐడీ అధికారుల వద్ద నుంచి పరారయ్యారు. 2011లో మెదక్ జిల్లా తుప్రాన్‌లో సీఐగా పని చేస్తుండగా ఆయనపై చీటింగ్ కేసు నమోదైంది. ఈ క్రమంలో సీఐను అరెస్ట్ చేయడానికి సీఐడీ సీఐ వెంకటేశ్వర్లు బృందం బుధవారం రాత్రి వారెంట్‌తో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోని సీఐ కార్యాలయానికి వచ్చారు. వారిని గమనించిన సీఐ తన ఇంట్లో కుటుంబసభ్యులకు చెప్పి వస్తానని వెళ్లి అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది.
అసలు కేసు ఏంటి..?
2011లో తుప్రాన్‌లో సీఐగా శ్రీనివాస్‌రెడ్డి విధులు నిర్వర్తిస్తుండగా అక్కడ బంగారు వ్యాపారి ఉంగరాల శ్రీను అలియాస్ కొత్త శ్రీనివాస్‌గుప్తాతో పరిచయం ఏర్పడింది. సీఐ అండదండలు ఉండటంతో ఉంగరాల శ్రీను బంగారం తక్కువ ధరకు ఇస్తానని పలువురిని నమ్మించి సుమారు రూ.మూడు కోట్లు వసూలు చేసి, పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు విచారణ జరిపి శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేశారు. తర్వాత కొన్ని రోజులకు తిరిగి ఉద్యోగంలో చేరి లూప్‌లైన్‌లో విధులు నిర్వర్తించారు. గత అక్టోబర్‌లో ఆర్మూర్ రూరల్ సీఐగా వచ్చారు.
బాల్కొండ స్టేషన్‌లో కేసు నమోదు
సీఐడీ అధికారులకు సహకరించకుండా పరారు కావడంతో 224 సెక్షన్ ప్రకారం బాల్కొండ ఠాణాలో శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ధ్రువీకరించారు.