మెదక్ జిల్లా బొడ్మట్‌పల్లి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గుండువాగు
సాక్షి, నెట్‌వర్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రిదాకా చాలా చోట్ల వర్షాలు కురిశాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరులో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కుండపోత వాన పడింది. జగిత్యాల బీర్‌పూర్ మండలంలో మొక్కజొన్న, పత్తి చేన్లలో నీళ్లు చేరాయి. బుగ్గారంలో పిడుగుపాటుకు ఒక ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. కోరుట్ల మండలంలో రహదారులపై వరద పోటెత్తి రాకపోకలు నిలిచిపోయాయి. ఇబ్రహీంపట్నం మండలంలో ఈదురుగాలులకు విద్యుత్ లైన్లు దెబ్బతిని సరఫరా నిలిచిపోయింది.
►పెద్దపల్లి జిల్లా రామగుండం, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో వాన ముంచెత్తింది. గంజివాగు కల్వర్టుపై వరద పారుతుండటంతో వేములవాడ–బోయినపల్లి మధ్య రాకపోకలు నిలిపివేశారు. కోనరావుపేట మండలం కొండాపూర్ వద్ద సిరిసిల్ల–నిమ్మపల్లి ప్రధాన రహదారిపై కాజ్‌వే కొట్టుకుపోయింది.
►జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో శనివారం కుండపోత వాన పడింది. పోతుల్వాయి వద్ద బొర్రవాగు, చిద్నెపల్లిలో వాగోడ్డుపల్లి వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గూడురు చెరువుకు గతంలో గండి పడగా.. అది మరింత పెరిగి వరద దిగువకు పోటెత్తింది. దిగువన పొలాల్లో ఉన్న సుమారు 100 గొర్రెలు నీటిలో కొట్టుకుపోయి మృత్యువాతపడ్డాయి.
►ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. గుండువాగు ఉప్పొంగి జోగిపేట–టేక్మాల్ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. మంజీరా నది పోటెత్తడంతో ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతోంది. దీంతో ఏడు పాయల వన దుర్గమ్మ ఆలయం జల దిగ్బంధమైంది.
గోదావరి ప్రాజెక్టుల గేట్లన్నీ ఓపెన్
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి లక్షా పదివేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. 22 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా నిండు కుండలా మారింది. ఎగువ నుంచి వరద చేరుతుండటంతో 8 గేట్లు ఎత్తి 80,800 క్యూసెక్కులను విడిచిపెడుతున్నారు. మొత్తంగా గోదావరి నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేశారు. ఇక పరీవాహక ప్రాంతం నుంచి ప్రవాహాలు వస్తుండటంతో కరీంనగర్ జిల్లాలోని దిగువ మానేరు జలాశయం నిండుకుండలా మారింది. దీనితో ఎనిమిది గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం నుంచి దూకుతున్న కృష్ణమ్మ
ఎగువ నుంచి భారీ ప్రవాహాలు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తారు. ఇరువైపులా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని వదులుతున్నారు. మొత్తంగా 4,38,185 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 884.3 అడుగుల నీటిమట్టం వద్ద 211.4 టీఎంసీలు నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment