దిగువ నుంచి ఎగువకు గోదావరి!
► పునరుజ్జీవంతో ఎస్సారెస్పీకి మహర్దశ
► రివర్స్ పంపింగ్‌తో ఐదు జిల్లాలు సస్యశ్యామలం
► 10న పోచంపాడులో సీఎం శంకుస్థాపన
సాక్షి, కరీంనగర్/నిర్మల్ రూరల్: ఉత్తర తెలం గాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పునరుజ్జీవం పథకంతో మహర్దశ పట్టనుంది. గోదావరి వరద ఆధారంగా నిర్మించిన ఎస్సా రెస్పీకి మహారాష్ట్ర ప్రాజెక్టులు అడ్డంకిగా మారగా.. కాళేశ్వరం పథకంతో గోదావరి నుంచి నీటిని దిగువ నుంచి ఎగువకు రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీలోకి ఎత్తిపోసే మహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
కేవలం 40 ఎకరాల భూసేకరణ, 156 మెగావాట్ల విద్యుత్‌తో ఎస్సారెస్పీని నింపే ఈ పథకానికి రూ.1,060కోట్లు అంచనా వ్యయం కాగా, ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ముగిసింది. మహారాష్ట్ర ఎగువన నిర్మించిన బాబ్లీ సహా 51 ప్రాజెక్టులు, ఆనకట్టలతో ఎస్సా రెస్పీకి సమృద్ధిగా నీరు చేరిన సందర్భాలు లేవు. ఈ ఏడాది అంతటా వర్ష్షపాతం తక్కు వగా ఉండటంతో గోదావరిలో ప్రవాహం లేక పోగా, మహారాష్ట్రలోని ఎత్తిపోతలతో చుక్క కూడా ఎస్సారెస్పీలోకి రాలేదు. కాళేశ్వరం వద్ద రోజుకు 4 టీఎంసీల చొప్పున ఇప్పటికే 225 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. ఈ నేపథ్యంలో నీరు వృథా కాకుండా రివర్స్ పంపింగ్ ద్వారా మూడు ప్రాంతాల్లో లిఫ్టులు ఏర్పాటు చేసి ఎస్సారెస్పీని నింపేందుకు పునరుజ్జీవన పనులకు శ్రీకారం చుట్టారు.
రివర్స్ పంపింగ్ ఇలా...
ఎస్సారెస్పీలోకి నీరు రావాలంటే ఇక మహా రాష్ట్రపై ఆ«ధారపడాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికను అమలు చేస్తోంది. ఇందుకు గోదావరి నీటిని రివర్స్ పంపింగ్ చేయనుంది. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీలోకి తరలిస్తారు. ఈ క్రమం లో మూడుచోట్ల ఎత్తిపోతలను నిర్మించాలని నిపుణులు సూచించారు. కాళేశ్వరం నుంచి 140 కి.మీ. మేర ఎత్తిపోతలు నిర్మించి నీటిని తీసుకొస్తారు. మొత్తం ఏడు ఎత్తిపోతలు నిర్మి స్తారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద ఎత్తిపోతలకు సంబంధించిన పంపుహౌస్ నిర్మాణపనులు కాళేశ్వరం పథకంలో భాగంగా కొనసాగుతున్నాయి.ఎల్లంపల్లి, నంది మేడా రం వద్ద ఇదివరకే పంపుహౌస్ నిర్మాణ పనులు పూర్తయి వినియోగంలో ఉండగా, వరదకాలు వపై మూడు ఎత్తిపోతల పనులు, పంపుహౌస్ నిర్మాణాలు మొదలు కావాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయితే కాళేశ్వరం సమీపంలో మేడిగడ్డ నుంచి ఎత్తిపోతల ద్వారా అన్నారానికి, అక్కడి నుంచి సుందిళ్ల వరకు, దాని నుంచి ఎల్లంపల్లి జలాశ యంలోకి తరలిస్తారు.
నంది మేడారం చెరువు సామర్థ్యం పెంచి ఎల్లంపల్లి నుంచి నందిమేడారానికి, అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని వరదకాల్వలోకి తరలిస్తారు. వరదకాల్వ ద్వారా మధ్యమానేరు, ఎస్సారెస్పీ లకు నీటి సరఫరా చేసేందుకు మూడు ఆనకట్టలు నిర్మించి, రోజుకు టీఎంసీ చొప్పున మధ్యమానేరు, ఎస్సారెస్పీలోకి పంపిస్తారు. బాగా వర్షాలు పడే సమయంలో జూలై నుంచి 60 రోజుల్లో రోజుకు ఒక టీఎంసీ చొప్పున 60 టీఎంసీల నీటిని తరలిస్తే, ఆ ప్రాజెక్టు కింద ఉన్న సుమారు 14 లక్షల ఎకరాలు ఆయకట్టు, దానిపై ఆధారపడిన ఎత్తిపోతలు, ఇతర స్కీములకు సమృద్ధిగా నీరు అందుతుంది.
10న సీఎం శంకుస్థాపన..
ఎస్సారెస్పీ పునరుజ్జీవం పథకానికి సీఎం కేసీఆర్ ఈ నెల 10న పోచంపాడులో శంకు స్థాపన చేయనున్నారు. ఉత్తర తెలంగాణలో పూర్వ ఐదు జిల్లాల్లో సుమారు 14 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలిగించే ఈ పథకం శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎస్సారెస్పీ ఆయకట్టులో లబ్ధిపొందే ప్రాంతాలకు చెందిన సుమారు ఐదు లక్షల మంది రైతులను ఈ శంకు స్థాపన కార్యక్రమంలో పాలు పంచుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ మొత్తానికి ఇన్‌చార్జిగా మంత్రి ఈటల రాజేందర్‌ను నియమించగా, జిల్లాల వారీగా మంత్రులను.. ఎమ్మెల్యేలను ఇన్‌చార్జిలుగా నియమించారు.