60 రోజుల పాటు రోజుకో టీఎంసీ తరలించేలా ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని పూర్తి ఆయకట్టు స్థిరీకరణ కోసం ఎల్లంపల్లి నుంచి వరద కాల్వ(ఎఫ్‌ఎఫ్‌సీ) ద్వారా ఎస్సారెస్పీకి నీటిని తరలించా లని, ఇందుకు అదనపు(సప్లిమెంటేషన్) ఎత్తిపోతల పథ కాన్ని చేపట్టాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ పథకం సమగ్ర ప్రతిపాద నలు తయారు చేయాలంటూ ఆ శాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషి గురువారం ఉత్తర్వులిచ్చారు. వాస్తవానికి ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద స్టేజ్–1లో 9.68లక్షలు, స్టేజ్–2 కింద 5లక్షల ఎకరాల ఆయకట్టుంది.
అయితే 20 ఏళ్లుగా పూడిక పెరగడంతో ప్రాజెక్టు సామర్థ్యం 112 నుంచి 90 టీఎంసీలకు తగ్గింది. ఎగువన మహా రాష్ట్ర విచ్చిలవిడిగా బ్యారేజీలు, చెక్‌డ్యామ్‌లు కట్టడంతో దిగువకు వచ్చే ప్రవా హాలు 149 నుంచి 54 టీఎంసీలకు పడిపోయాయి. ఈ నేపథ్యంలో వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీకి నీరందించే పథకానికి ఇటీవల కేబినెట్ బృందం సిఫార్సు చేసింది.
కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి తరలించే 2టీఎంసీల్లో రోజు కో టీఎంసీ 60రోజులపాటు ఎత్తిపోసేలా పథకాన్ని ప్రతి పాదించింది. ప్రాథమిక అంచనా ప్రకారం ఈ పథకానికి వ్యయం రూ.650కోట్లు. అలాగే దేవాదుల ఎత్తిపోతల పథకంలోని తపాస్ పల్లి, ఇతర డిస్ట్రిబ్యూటరీల ద్వారా నీటిని తరలించి చెరువులను నింపడానికి ఆఫ్టేక్ స్లూయిస్ల నిర్మాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వుని చ్చింది. ఇందుకు రూ.1.03కోట్లు విడుదల చేసింది.