రిటైర్డ్ ఉద్యోగుల కల నెరవేరేనా!
బాల్కొండ : తాము నివసించిన క్వార్టర్లను తమకే కేటాయించాలన్నది ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను కంటికి రెప్పలా కాపాడి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల డిమాండ్. కానీ వారి డిమాండ్‌ను పాలకులు పట్టించుకోవడం లేదు. ఎస్సారెస్పీ నిర్మాణ కాలంలో ప్రాజెక్ట్ సిబ్బంది కోసం ఏబీసీ టైపులో 834 క్వార్టర్లను తాత్కాలికంగా నిర్మించారు.
ప్రాజెక్ట్ పరిధిలో అన్ని కేటగిరిల్లో కలిపి 350 మంది ఉద్యోగులు ఇప్పటి వరకు ఉద్యోగ విరమణ పొందారు. వారందరూ ఇప్పటికి ఎస్సారెస్పీలోని క్వార్టర్లలో ప్రభుత్వానికి కిరాయి చెల్లిస్తూ నివాసం ఉంటున్నారు. ఆ క్వార్టర్లను తమకే కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లో క్వార్టర్‌కు, స్థలానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ఉద్యోగులు చెల్లించి క్వార్టర్లను పొందారు. ఆ జీవో ప్రకారం తమకు కూడా క్వార్టర్లను కేటాయించాలని ఎస్సారెస్పీలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు కోరుతున్నారు.
ఇరిగేషన్ శాఖ అనుమతి
ఎస్సారెస్పీ నిర్మాణ క్రమంలో ప్రాజెక్ట్ భూమితో పాటు, క్వార్టర్ల నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ భూమిని కొనుగోలు చేశారు. దీంతో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు క్వార్టర్లు కేటాయించడానికి ఇరిగేషన్ శాఖ అనుమతి కూడా ఇచ్చింది. అంతే కాకుండా భవిష్యత్తులో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలను ప్రాజెక్ట్ అవసరాలకు వినియోగించుకోవచ్చని లేఖ కూడా ప్రభుత్వానికి అందించినట్లు రిటైర్డ్ ఉద్యోగులు తెలుపుతున్నారు. కానీ రెవెన్యూపరంగా ఇబ్బందులు రావడంతో ఇంతవరకు క్వార్టర్ల శాశ్వత కేటాయింపు సమస్యగానే ఉంది. రెండేళ్లు క్రితం అప్పటి జాయింట్ కలెక్టర్ హర్షవర్ధన్ క్వార్టర్లను పరిశీలించారు. క్వార్టర్లు ఏ స్థితిలో ఉన్నాయి, ఎంత భూమిలో నిర్మించారు.
ఎన్ని క్వార్టర్లలో నివాసం ఉంటున్నారు అనే వివరాలను సేకరించారు. దీంతో తమకు స్థలాన్ని కేటాయిస్తారని రిటైర్డ్ ఉద్యోగులు ఆశించారు. కానీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద రిటైర్డ్ ఉద్యోగుల క్వార్టర్లను వారికే శాశ్వతంగా కేటాయించారు.
అదే పద్ధతిలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు క్వార్టర్లు కేటాయించాలని రిటైర్డ్ ఉద్యోగులు కోరుతున్నారు. ఏడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే నాగార్జునసాగర్ క్వార్టర్ల కేటాయింపు విషయం కోర్డుకెక్కడంతో సమస్య మొదటికొచ్చింది. అది తేలితేగాని ఎలాంటి పరిష్కారం చూపలేమని పాలకులు పేర్కొంటున్నారు. సమస్యకు త్వరగా పరిష్కారం చూపాలని రిటైర్డ్ ఉద్యోగులు కోరుతున్నారు.