Retirement Employees
-
రిటైర్మెంట్ సిబ్బందిపై ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, సిటీబ్యూరో: ఉద్యోగ విరమణ పొందనున్న పోలీసు సిబ్బందికి రాచ‘కొండ’ంత అండగా నిలవనుంది. ఈ ఏడాది పదవీ విరమణ చేసే ఉద్యోగులకు పెన్షన్, బెనిఫిట్స్ మొత్తం ఒకేసారి పొందేందుకు ఉద్దేశించిన ‘పెన్షన్ డెస్క్’ను గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ ఆదివారం ప్రారంభించారు. అడ్మిన్ డీసీపీ, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్ అధికారులు, పోలీస్ అధికారుల సంఘం సభ్యులుగా ఉండే ఈ డెస్క్ ప్రతి నెలా మూడో శనివారం సమావేశమై పదవీ విరమణ చేసే సిబ్బందిని ఆరు నెలలు ముందుగానే కార్యాలయానికి పిలిపించి వారి సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. ‘పెన్షన్ పత్రాలు పూర్తి చేసి పదవీ విరమణ పొందే రోజున అన్ని బెనిఫిట్స్ వచ్చేలా చర్యలు తీసుకుంటారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, మరణించిన ఉద్యోగుల పెన్షన్ సమస్యలను పరిష్కరిస్తార’ని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ సందర్భంగా రానున్న 6 నెలల్లో పదవీ విరమణ పొందనున్న 29 మంది ఉద్యోగులతో సీపీ మహేష్ భగవత్ సమావేశమై దిశా నిర్దేశం చేశారు. ముందస్తుగా పెన్షన్‌కు అప్లై చేసుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించి బెనిఫిట్స్ సకాలంలో అందేటా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగాæ మొబైల్ నెంబర్ ఏర్పాటు చేయాలని అడ్మిన్ అధికారులను కోరారు. జాయింట్ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ పెన్షన్ డెస్క్ ఏర్పాటుతో ముందస్తుగా పెన్షన్ పేపర్స్ సబ్మిట్ చేయడంతో సర్వీసులో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఉంటుందన్నారు. దీంతో పదవీ విరమణ పొందిన రోజే పెన్షన్ తీసుకునే వీలు కలుగుతుందన్నారు. పదవీ విరమణ పొందనున్న, పొందిన, చనిపోయిన పోలీస్ సిబ్బందికి పెన్షన్, బెనిఫిట్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరగా వచ్చేలా ’పెన్షన్ డెస్క్’ ప్రారంభించిన రాచకొండ సీపీకి పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్ భద్రా రెడ్డి కృత/æ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాచకొండ అడ్మిన్ ఏసీపీ శిల్పవల్లి, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్ భద్రా రెడ్డి, సభ్యులు జి.క్రిష్ణా రెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రిటైర్డ్ ఉద్యోగుల కల నెరవేరేనా!
బాల్కొండ : తాము నివసించిన క్వార్టర్లను తమకే కేటాయించాలన్నది ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను కంటికి రెప్పలా కాపాడి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల డిమాండ్. కానీ వారి డిమాండ్‌ను పాలకులు పట్టించుకోవడం లేదు. ఎస్సారెస్పీ నిర్మాణ కాలంలో ప్రాజెక్ట్ సిబ్బంది కోసం ఏబీసీ టైపులో 834 క్వార్టర్లను తాత్కాలికంగా నిర్మించారు. ప్రాజెక్ట్ పరిధిలో అన్ని కేటగిరిల్లో కలిపి 350 మంది ఉద్యోగులు ఇప్పటి వరకు ఉద్యోగ విరమణ పొందారు. వారందరూ ఇప్పటికి ఎస్సారెస్పీలోని క్వార్టర్లలో ప్రభుత్వానికి కిరాయి చెల్లిస్తూ నివాసం ఉంటున్నారు. ఆ క్వార్టర్లను తమకే కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లో క్వార్టర్‌కు, స్థలానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ఉద్యోగులు చెల్లించి క్వార్టర్లను పొందారు. ఆ జీవో ప్రకారం తమకు కూడా క్వార్టర్లను కేటాయించాలని ఎస్సారెస్పీలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు కోరుతున్నారు. ఇరిగేషన్ శాఖ అనుమతి ఎస్సారెస్పీ నిర్మాణ క్రమంలో ప్రాజెక్ట్ భూమితో పాటు, క్వార్టర్ల నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ భూమిని కొనుగోలు చేశారు. దీంతో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు క్వార్టర్లు కేటాయించడానికి ఇరిగేషన్ శాఖ అనుమతి కూడా ఇచ్చింది. అంతే కాకుండా భవిష్యత్తులో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలను ప్రాజెక్ట్ అవసరాలకు వినియోగించుకోవచ్చని లేఖ కూడా ప్రభుత్వానికి అందించినట్లు రిటైర్డ్ ఉద్యోగులు తెలుపుతున్నారు. కానీ రెవెన్యూపరంగా ఇబ్బందులు రావడంతో ఇంతవరకు క్వార్టర్ల శాశ్వత కేటాయింపు సమస్యగానే ఉంది. రెండేళ్లు క్రితం అప్పటి జాయింట్ కలెక్టర్ హర్షవర్ధన్ క్వార్టర్లను పరిశీలించారు. క్వార్టర్లు ఏ స్థితిలో ఉన్నాయి, ఎంత భూమిలో నిర్మించారు. ఎన్ని క్వార్టర్లలో నివాసం ఉంటున్నారు అనే వివరాలను సేకరించారు. దీంతో తమకు స్థలాన్ని కేటాయిస్తారని రిటైర్డ్ ఉద్యోగులు ఆశించారు. కానీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద రిటైర్డ్ ఉద్యోగుల క్వార్టర్లను వారికే శాశ్వతంగా కేటాయించారు. అదే పద్ధతిలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు క్వార్టర్లు కేటాయించాలని రిటైర్డ్ ఉద్యోగులు కోరుతున్నారు. ఏడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే నాగార్జునసాగర్ క్వార్టర్ల కేటాయింపు విషయం కోర్డుకెక్కడంతో సమస్య మొదటికొచ్చింది. అది తేలితేగాని ఎలాంటి పరిష్కారం చూపలేమని పాలకులు పేర్కొంటున్నారు. సమస్యకు త్వరగా పరిష్కారం చూపాలని రిటైర్డ్ ఉద్యోగులు కోరుతున్నారు.