మకావ్: భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ మకావ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 38వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–13, 21–18తో భారత్‌కే చెందిన ప్రపంచ 57వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టిపై గెలుపొందాడు. 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌కు కొంత ప్రతిఘటన ఎదురైనా కీలకదశలో పాయింట్లు సాధించి వరుస గేముల్లో విజయాన్ని అందుకున్నాడు.
తొలి గేమ్‌లో స్కోరు 12–10 వద్ద శ్రీకాంత్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 16–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో తేరుకున్న ఆయుశ్ ఒకదశలో 14–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ ఒక్కసారిగా విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి అంతరాన్ని తగ్గించాడు. ఆ తర్వాత ఆయుశ్ ఒక పాయింట్ నెగ్గగా... ఆ వెంటనే శ్రీకాంత్ చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు సాధించి 19–16తో ఆధిక్యంలోకి వచ్చాడు.
ఈ దశలో ఆయుశ్ రెండు పాయింట్లు సాధించినా, మరోవైపు శ్రీకాంత్ మూడు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత కథ ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక ప్లేయర్ తస్నిమ్ మీర్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. ప్రపంచ 18వ ర్యాంకర్ తొమోకా మియజాకి (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 67వ ర్యాంకర్ తస్నిమ్ 17–21, 21–13, 10–21తో పరాజయం పాలైంది.
గాయత్రి–ట్రెసా జోడీ విజయం
మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 22–20, 21–11తో లిన్ చి చున్–టెంగ్ చున్ సున్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జంట 17–21, 14–21తో వోంగ్ టియెన్ సి–లిమ్ చియెవ్ సియెన్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment