తుది నుంచే మొదలయ్యేలా.. | Sriram Sagar Project Phase 2 work Completed | Sakshi
Sakshi News home page

తుది నుంచే మొదలయ్యేలా..

Published Sun, Nov 3 2019 3:19 AM | Last Updated on Sun, Nov 3 2019 7:58 AM

Sriram Sagar Project Phase 2 work Completed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాగునీరు దొరక్క..సాగునీరు లేక అల్లాడుతున్న కరువు పీడిత ప్రాంతాలకు గోదావరి జలాలు ఊపిరిపోస్తున్నాయి. తీవ్ర అనావృష్టిని ఎదుర్కొంటున్న వరంగల్‌ రూరల్, ఖమ్మం, జనగాం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల సాగు అవసరాలు తీర్చేందుకు పాతికేళ్ల కింద జీవం పోసుకున్న ఎస్సారెస్పీ–2 ప్రణాళికలు ఇప్పుడు పట్టాలెక్కి, పనులు పూర్తి చేసుకొని నీటి పరవళ్లను సంతరించుకుంటున్నాయి. ఎంత నీరు పారించినా చివరి ఆయకట్టుకు నీరే లేదన్న అపవాదును దాటేందుకు చిట్టచివరి ఆయకట్టుకే మొదట నీరిచ్చేలా కార్యాచరణ రూపొందించి దానిలో నీటిపారుదల శాఖ అధికారులు సఫలీకృతులయ్యారు.

అనేక అవాంతరాలు దాటుతూ ఎస్పారెస్పీ–2 కింద నిర్ణయించిన చెరువులు నింపుతూ, పూర్తి ఆయకట్టుకు నీటి లభ్యత పెంచుతున్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ప్రధానమైన కాకతీయ కాల్వ 284 కిలోమీటర్లు ఉండగా, దాని కింద 9.6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి కొనసాగింపుగా కాకతీయ కాల్వ 284వ కిలోమీటర్‌ నుంచి 346 కి.మీ వరకు విస్తరణే లక్ష్యంగా ఎస్సారెస్పీ స్టేజ్‌–2 చేపట్టారు. దీని ద్వారా తీవ్ర అనావృష్టిని ఎదుర్కొంటున్న వరంగల్‌ రూరల్, ఖమ్మం, జనగాం, మహబూబా బాద్, సూర్యాపేట జిల్లాల్లో 3.97 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పిం చాలని నిర్ణయించారు. మొత్తంగా రూ. 1,043 కోట్లతో ఈ పనులు చేపట్టగా రూ. 1,220 కోట్లకు దీన్ని సవరించారు. నిజానికి ఈ కాల్వ పనులకు 1995–96 మధ్య కాలంలో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు జీవం పోశారు. అయితే వివిధ కారణాలతో పనులు మొదలవ్వలేదు. అనంతరం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ పనుల్లో వేగం పెంచారు. 2006 ఫిబ్రవరి 27న కాకతీయ కాల్వల విస్తరణకు ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఆయన హయాంలోనే పనులు మొదలైనా, ఆయన మరణానంతరం పనులు మళ్లీ నెమ్మదించాయి. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఈ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగిస్తూ పనులు పూర్తి చేస్తూ వచ్చింది. 

చివరి నుంచి మొదటికి..
సాధారణంగా ప్రాజెక్టుల నుంచి నీటిని ముందుగా ఉన్న చెరువులు, ఆయకట్టుకు నీరిస్తూ, చివరి ఆయకట్టు వరకు సరఫరా చేస్తారు. అయితే ప్రస్తుత విధానంతో ఏ ప్రాజెక్టుల కిందా చివరి ఆయకట్టు లేక చెరువు వరకు నీటి సరఫరా అయిన సందర్భాలు లేవు. కాల్వల పూర్తిస్థాయి సామర్ధ్యంతో నీటిని విడుదల చేసినప్పుడు మాత్రమే చివరి భూములకు, చెరువులకు నీరు చేరుతుంది. తక్కువ సామర్ధ్యంతో నీటి సరఫరా చేస్తే చివరి ఆయకట్టుకు నీరు చేరడం గగనమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం గోదావరి నీటిని ఎస్సారెస్పీ దిగువన ఉన్న లోయర్‌ మానేరు డ్యామ్‌నుంచి పూర్తి స్థాయి సామర్ధ్యం 3,500 క్యూసెక్కుల నీటితో నీటిని సరఫరా చేస్తూ సూర్యాపేట జిల్లాలో చిట్టచివర ఉన్న పెన్‌పహాడ్‌ మండలంలోని మాచారం రాయి చెరువు నుంచి నీటిని నింపుతూ వస్తున్నారు. చిట్టచివర ఉన్న ఈ చెరువు నుంచి మొదలుకు నీటిని నింపుతూ ఇప్పటివరకు సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లో 262 చెరువులు నింపారు. ఈ చెరువుల కిందే 22,800 ఎకరాల ఆయకట్టుకు నీరందుతోంది. అనంతరం మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని చెరువులు కలిపి మొత్తంగా 592 చెరువులు నింపనున్నారు. టెయిల్‌ టూ హెడ్‌ అనే ఈ పద్ధతి ద్వారా చివరి ఆయకట్టు నుంచి తొలి ఆయకట్టు వరకు 3.97 లక్షల ఎకరాల పూర్తి ఆయకట్టుకు నీరందించడం సాధ్యం కానుంది. ఇంతవరకూ ఎన్నడూ గోదావరి జలాలను ఎరుగని పరివాహక రైతులు ప్రస్తుతం నిండుతున్న చెరువులు, పారుతున్న కాల్వలు చూసి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. 

చెరువు కింద ఐదు ఎకరాలేశా 
ఈ వాన కాలంల బోరుతో ఎకరా ముప్పై గుంటలు సాగు చేసిన. బోరు అడుగంటిపోయి పొలం ఎండిపోయింది. కొన్ని రోజుల తర్వాత వర్షాలు కురవడంతో పాటు ఎస్సారెస్పీ నీటితో చెరువూ నిండింది. నాకు ఉన్న ఐదు ఎకరాలు సాగు చేసిన. మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో ఎస్సారెస్పీ నీటితో చెరువును నింపడంతో వచ్చే యాసంగిలో కూడా ఐదు ఎకరాలు సాగు చేస్తా’. – గాయం నర్సిరెడ్డి, రైతు, ధర్మాపురం

బోరు కింద వరిసాగు చేశా 
ఈ వాన కాలంల మంచి వర్షాలే కురవడంతో బోర్ల కింద నాకున్న 18 గుంటలు పంటలేశా. కానీ యాసంగిల మాత్రం నీళ్లు లేక పంటల సాగు చేసి ఏళ్లవుతోంది. ప్రతి యాసంగికి భూములు బీడే. ఈసారి గోదారి నీళ్లొచ్చినయ్‌. రాయి చెరువు నిండింది. తిండి గింజల మందం సాగు అవుతుంది’.
–వీరబోయిన కృష్ణ, రైతు, మాచారం

పత్తి పంటను సాగు చేశా 
రాయి చెరువు ఆయకట్టు కింద కౌలుకు తీసుకొని 20 ఎకరాలు పత్తి సాగు చేశాను. రాయి చెరువు నిండితే యాసంగి ఐదు ఎకరాలు వరి పంట సాగులోకి వస్తుంది. ఇప్పటికే రాయి చెరువులోకి ఎస్సార్‌ఎస్పీ నీరు వచ్చి కొత్త ఆశలు నింపింది. ఇక రబీకి నీటి గోస ఉండదనే అనుకుంటున్నాం’. – లాలు, రైతు, గూడెపుకుంట తండా

రైతుల్లో నమ్మకం పెరిగింది 
‘ఎస్సారెస్పీ–2 పరిధిలో చిట్టచివరి ఆయకట్టుకు ఎన్నడూ నీరు పారింది లేదు. అయితే ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడం, గోదావరి జలాల లభ్యత ఎక్కువగా ఉండటంతో టెయిల్‌ టూ హెడ్‌ విధానాన్ని తీసుకొచ్చాం. ఈ విధానం ద్వారా చివరి ఆయకట్టు, చెరువు నుంచి నీళ్లిచ్చుకుంటూ మొదటికి వస్తాం. దీనివల్ల ప్రతి ఎకరాకి నీరందుతుంది. నీటి కోసం కాల్వలకు ఎక్కడా రైతులు గండ్లు కొట్టకుండా రైతులను సమన్వయ పరుస్తున్నాం. ఇంజనీర్లు, ఇతర శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్గిస్తున్నారు. రైతుకు నీళ్లొస్తాయనే నమ్మకం కలిగించాం. ఇంతటితో ఆగకుండా కాల్వల ఆధునికీకరణ జరిగితే రైతుకు మరింత మేలు జరుగుతుంది’. – నాగేంద్రరావు, ఈఎన్సీ, సీఈ, ఎస్సారెస్పీ–2

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement