వెయ్యి చెరువుల తోట.. హరిత సూర్యాపేట | Godavari water Reaches Tail End Areas In Suryapet | Sakshi
Sakshi News home page

వెయ్యి చెరువుల తోట.. హరిత సూర్యాపేట

Published Sun, Jan 31 2021 2:06 AM | Last Updated on Sun, Jan 31 2021 2:28 AM

Godavari water Reaches Tail End Areas In Suryapet - Sakshi

నీళ్లు లేక.. నింపే దిక్కులేక వట్టిపోయి నిర్జీవంగా మారిన చెరువులు. సాగు అవసరాలేమోగానీ పశువుల తాగునీటికి కటకటే. చెరువులు, వాగులు, వంకలు, బావులు ఎండిపోయి కనిపించేవి. వర్షాధార పంటలతో, అరకొర దిగుబడులతోనే రైతులు నెట్టుకొచ్చేవారు. ఇప్పుడు ఆ గ్రామాలకు కొత్త కళ వచ్చింది. ఎక్కడో నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి వచ్చి చేరిన నీటితో చెరువులన్నీ మత్తడి దూకుతున్నాయ్‌. ఎస్సారెస్పీ స్టేజ్‌–2 కింద కాల్వలన్నీ గోదావరి నీటితో నిండుగా ప్రవహిస్తుండటంతో సూర్యాపేట జిల్లాలోని చివరి ఆయకట్టు నీటి తడులతో ఆకుపచ్చ తివాచీ పరచినట్లు కనిపిస్తోంది. 

సాక్షి: హైదరాబాద్‌: జలం ఉంటేనే జీవం. పచ్చని పంటలు. గొడ్డూ గోదా. ఊరంతా కోలాహలం. రైతు కళ్లలో వెలకట్టలేని ఆనందం. సొంతూరిని నమ్ముకొని సాఫీగా సాగే బతుకులు. కాలం కాకపాయె... కలలు చెదిరిపాయె! అవన్నీ పదిహేను, పదహారేళ్ల కిందటి వరకు నీళ్లు లేక.. నింపే దిక్కులేక వట్టిపోయి నిర్జీవంగా మారిన చెరువులు. సాగు అవసరాలు పక్కనపెడితే కనీసంగా పశువులకు తాగునీటి అవసరాలను కూడా తీర్చే పరిస్థితులు లేక బోసిపోయి కనిపించేవి. చెరువుల్లో నీరు లేక బావులు అడుగంటగా, బోర్లలో నీరు పాతాళానికి చేరిపోయేది. అలాంటి పరిస్థితుల్లో వర్షాధార సాగుతో, అరకొర దిగుబడులతోనే రైతులు నెట్టుకొచ్చేవారు.

అమ్ముకుందామన్నా భూములకు ధరలు లేక...ఊళ్లకు ఊళ్లే వలసలతో బోసిపోయేవి. అలాంటి గ్రామాలకు ఇప్పుడు కొత్త మురిపెం వచ్చింది. ఎక్కడో నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి వచ్చి చేరిన నీటితో చెరువులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. ఎస్సారెస్పీ స్టేజ్‌–2 కింద కాల్వలన్నీ గోదావరి నీటితో నిండుగా ప్రవహిస్తుండటంతో సూర్యాపేట జిల్లాలోని చివరి ఆయకట్టు నీటి తడులతో పచ్చగా కనిపిస్తోంది. వేసవి సమయంలోనూ చెరువులు అలుగు దుంకుతుండటంతో పరీవాహక పల్లెలు పులకిస్తున్నాయి. నిండిన చెరువుల కింద సాగు పెరగడం, భూముల ధరలకు రెక్కలు రావడంతో రైతుల సంబురం అంబరాన్ని అంటుతోంది.

సంబురం నింపిన గోదారి
ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ప్రధానమైన కాకతీయ కాల్వ 284 కిలోమీటర్లు ఉండగా, దాని కింద 9.6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి కొనసాగింపుగా కాకతీయ కాల్వ 284వ కిలోమీటర్‌ నుంచి 346 కి.మీ వరకు విస్తరణే లక్ష్యంగా ఎస్సారెస్పీ స్టేజ్‌–2 చేపట్టారు. దీని ద్వారా తీవ్ర అనావృష్టిని ఎదుర్కొంటున్న వరంగల్‌ రూరల్, ఖమ్మం, జనగాం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 3.97 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. రూ.1,220 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో భాగంగా కాకతీయ కాల్వల తవ్వకంతో పాటు 14 నీటి పంపిణీ కాల్వలు (డిస్ట్రిబ్యూటరీలు) తవ్వకం చేశారు. ముఖ్యంగా చివరి ఆయకట్టు ప్రాంతమైన సూర్యాపేట జిల్లాలో డీబీఎం–69, 70, 71 కింద 156 గ్రామాల పరిధిలో 2.13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, 900ల వరకు చెరువులున్నాయి. వీటిని 2019 నవంబర్‌ నుంచి నింపుతూ వస్తున్నారు. గతేడాది ఖరీఫ్‌లో నీటి లభ్యత ఉండటంతో ఈ చెరువులకు నీటి విడుదల అవసరం పడలేదు. చదవండి: (‘ఎల్‌ఆర్‌ఎస్‌’ ఆధారంగా ఇకపై పన్నుల వడ్డన)

ప్రస్తుతం యాసంగి సాగు జరుగుతుండటంతో కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎస్సారెస్పీ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతోంది. అందులో భాగంగానే చివరి చెరువు వరకు నీరు చేరుతోంది. చిట్టచివర ఉన్న చెరువులను మొదట నింపేలా టెయిల్‌–టు–హెడ్‌ విధానం ద్వారా నీటిని సరఫరా చేస్తుండటంతో సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లో చెరువులన్నీ 100% నిండుతున్నాయి. వాటి కిందే 55 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతోంది. ఇంతవరకూ గోదావరి జలాలను ఎరుగని పరీవాహక రైతులు ప్రస్తుతం నిండుతున్న చెరువులు, పారుతున్న కాల్వల కారణంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎస్సారెస్పీ కాల్వలకు లైనింగ్‌ చేయకపోవడం కొంత ఇబ్బందిగా మారుతోంది. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే రూ.300 కోట్లతో కాల్వల ఆధునికీకరణకు ప్రతిపాదనలు పంపినా అవి ఇంతవరకు ఆమోదం పొందలేదు. ఈ కాల్వల లైనింగ్‌ పనులు పూర్తయితే పూర్తి సామర్థ్యంతో కాల్వలకు నీటిని పారించే అవకాశం ఉంటుంది.

ఒకప్పుడు ఆనవాళ్లు కోల్పోయి... ఇప్పుడదే ఆదరువు 
ఈ చెరువు సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని పెద్దచెరువు. కాకతీయుల కాలం నాటికి ఈ చెరువు ఫీడర్‌ చానళ్లు పూడుకుపోయి, పరీవాహకమంతా ధ్వంసమై పదిహేనేళ్లుగా వట్టిపోయి కనిపించేది. నీటి చుక్క కనిపించక దీని చుట్టూతా ఎడారిని తలపించేది. దీని పరిధిలోని 324 ఎకరాల ఆయకట్టులో ఎన్నడూ పదిహేను శాతం కూడా సాగైంది లేదు. అలాంటిది ఇప్పుడు 400 కిలోమీటర్ల నుంచి వస్తున్న గోదావరి జలాలతో పులకిస్తోంది. ఎస్సారెస్పీ స్టేజ్‌–2 కాల్వల ద్వారా నిరంతరాయంగా నీటి విడుదల కొనసాగుతుండటంతో ఏకంగా అలుగు దుంకుతోంది. పెద్దపెద్ద చేపలు చెరువులో సందడి చేస్తున్నాయి.

ఈ ప్రాంతంలో ముంబైకి వలస వెళ్లిన వారు తిరిగి గ్రామాలకు చేరుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. వ్యవసాయానికి పనికిరాని గుట్టలను సైతం నీళ్లొచ్చాయన్న సంతోషంతో చదును చేసి పంట సాగు మొదలుపెట్టారు. ‘ఈ చెరువు నిండక ముందు మూడెకరాల్లోనే సాగు చేసే వాణ్ని. కానీ ఇప్పుడు ఏడెకరాల్లో వరి సాగు చేశా. మొత్తం పంటకు నీరందుతోంది. బోర్లు, బావుల వాడకం పూర్తిగా తగ్గించా’అని ఆ చెరువు పరిధిలోని ఆయకట్టు రైతు అనంతుల సత్తయ్య పేర్కొన్నారు.  

పెద్ద చెరువును పరిశీలిస్తున్న ఇంజనీర్లు 

‘సారు'ంటే.. గుండెలు పొంగేవి! 
ఈ చెరువు దివంగత సాగునీటి రంగ నిపుణుడు ఆర్‌. విద్యాసాగర్‌రావు స్వగ్రామం జాజిరెడ్డి గూడెంలోని తీగల చెరువు. పక్కనే మూసీ నది పారుతున్నా ఏనాడూ నిండింది లేదు. చిన్నపాటి లిఫ్టు ద్వారా ఈ చెరువు, దాని పరిధిలోని ఆయకట్టుకు నీరివ్వాలని తలంచినా సాధ్యపడలేదు. అయితే విద్యాసాగర్‌రావు చొరవతో ఎస్సారెస్పీ స్టేజ్‌–2 పనులను పూర్తి చేయడంతో ఈ చెరువు ప్రస్తుతం నిండి దీని కింద ఆయకట్టు 800 ఎకరాలు సాగులోకి వచ్చింది. ఈ చెరువులోకి నీళ్లొచ్చాకే ఇక్కడ ఎకరం భూమి రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెరిగింది. ‘నిండని చెరువుతో అరకొరగా వ్యవసాయం చేసే వాళ్లంతా నీళ్లొచ్చాక రెండు పంటలు సాగు చేస్తున్నారు. కందులు, పెసలు, పత్తి సాగు చేసే వాళ్లు వరికి మళ్లారు. ఎకరాకి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. గతంలో 8 బోర్లు వేసినా పడలేదు. కానీ ఇప్పుడు ఆ అవసరమే లేదు. ఎస్సారెస్పీ కాల్వల లైనింగ్‌ జరిగితే మరింత మేలుంటుందని గ్రామానికి చెందిన రైతులు పున్న హరిప్రసాద్, చింత నర్సయ్యలు పేర్కొన్నారు.

ఈ ఫొటోలో కనిపిస్తున్నది నాగారం మండల పరిధిలో ఎస్సారెస్పీ కాల్వలకు దగ్గరగా కొత్తగా సాగులోకి వస్తున్న భూమి. కాల్వల్లో నీరు పారకం ఇకపై ఆగదన్న భరోసాతో ఇప్పటికే కొంత పొలంలో నాట్లు వేయగా, మరింత బీడు భూమిని సాగులోకి తెచ్చేలా రైతులు దున్నటం మొదలు పెట్టారు. ఇప్పటికే కొంత బీడు భూమిని సాగులోకి తెచ్చే యత్నాల్లో ఉండగా, ఇకముందే మొత్తం భూమిని సాగు చేస్తానని రైతులు చెబుతున్నారు.  


రావి చెరువు
పక్కన కనిపిస్తున్నది సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండల పరిధిలోని మాచవరం గ్రామంలోని రావి చెరువు. 0.24 టీఎంసీ సామర్థ్యం గల ఈ చెరువు 16 ఏళ్లలో ఏనాడూ నిండింది లేదు. దీని కింద 200 ఎకరాల ఆయకట్టు ఉండగా బోర్లు, బావుల కిందే ఆరుతడి పంటల సాగు జరిగేది. ఈ చెరువు కింద ఏనాడూ రెండో పంట వేసింది లేదు. వేసవి వస్తే బోర్లు పనిచేయక, తాగునీరు లేక ట్యాంకర్లు పెట్టి ఇంటింటికీ బిందెలను లెక్కగట్టి సరఫరా చేసేవారు. అలాంటి చెరువు ప్రస్తుత సమయంలోనూ నిండుకుండను తలపిస్తోంది. కాళేశ్వరం నుంచి 450 కి.మీ. దూరం దాటుకొని ఎస్సారెస్పీ స్టేజ్‌–2 కాల్వల ద్వారా వచ్చిన గోదారి జలాలతో కళకళలాడుతోంది.

మూడుకిస్తామన్నా పోలే... ఇప్పుడు ఎకరా రూ. 30 లక్షలు 
నిర్ణీత ఆయకట్టుకు అదనంగా మరో 200 ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. నీళ్లు నిండుగా ఉండటంతో గతంలో 15–18 మీటర్ల దిగువన ఉండే భూగర్భ జలాలు ప్రస్తుతం 3 మీటర్లలోనే లభ్యతగా ఉన్నాయి. ‘16 ఏళ్లలో ఎప్పుడూ చెరువు నిండలేదు. ఎన్నోసార్లు వాటర్‌ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అవుతోంది. ఇక్కడి చెరువుల్లో చేపలు  భారీగా చేరాయి. 8 నెలలు చేపలనే తింటున్నారు. ఒక్కోటి 6–8 కిలోలు ఉంటుంది’ అని గ్రామానికి చెందిన మురహరిరెడ్డి, బొబ్బయ్యలు తెలిపారు. తెలంగాణ వస్తే ఏ మొస్తుందన్న దానికి... ఈ ఊరికే చేరిన నీళ్లే తార్కాణమని ఎంపీపీ నిమ్మాది భిక్షం పేర్కొన్నారు. నీళ్ల రాకతో రూ. 3 లక్షలు కూడా రాని ఎకరా పొలం ఇప్పుడు రూ. 30 లక్షలు పలుకుతోందని చెప్పారు.

తీగలచెరువు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement