
అడుగంటిన శ్రీరాం సాగర్
ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. తాగునీరూ దొరకని దుర్భర పరిస్థితులు తలెత్తనున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో నీటి నిల్వలు అడుగంటుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 22 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ఆరో తడికి నీటి విడుదలను ప్రారంభించారు. దీనితో కలిపి మరో మూడు తడులకు, అలాగే తాగునీటికి నీటి విడుదలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బాల్కొండ: ఎస్సారెస్పీలో ప్రస్తుతం 22 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఆదివారం నుంచి కాలువల ద్వారా ఆయకట్టు పంటలకు ఆరో తడికి నీటి విడుదలను ప్రారంభించారు. మరో రెండు తడులకు నీటిని అందించాల్సి ఉంది. ఇప్పటివరకు ప్రతి తడికి 5 టీఎంసీల చొప్పున విడుదల చేశారు. ఈ లెక్కన ఉన్న 22 టీఎంసీల్లో 15 టీఎంసీలను ఆయకట్టుకు విడుదల చేస్తే తాగునీటి అవసరాలు ఎలా తీరుస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటలు పొట్ట దశలో ఉన్నాయి. పెరుగుతున్న ఎండల నేపథ్యంలో నీటి వినియోగం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రాజెక్ట్‌లో నీటిమట్టం తక్కువగా ఉండడంతో చివరి తడి వరకు నీటి విడుదల ప్రశ్నార్థకంగానే మారింది.
ఏం చేస్తారో ఏమో..?
ఎస్సారెస్పీలో ప్రస్తుతం 22 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ 5 టీఎంసీలు. ఇక, 6.5 టీఎంసీల నీటిని మిషన్ భగీరథ పథకం కోసం నిల్వ ఉంచాలి. మరో 3 టీఎంసీలు ఆవిరి రూపంలో పోతుందని ప్రాజెక్ట్ రికార్డులు పేర్కొంటున్నాయి. ఈ లెక్కన ప్రాజెక్ట్‌లో సుమారు 15 టీఎంసీల నీరు నిల్వ ఉంటేనే తాగు నీటి అవసరాలు తీరతాయి. అలాగే, ఆయకట్టు పంటలకు ప్రస్తుత తడితో కలుపుకుని మూడు తడుల నీరు అందించాలి.. గత తడుల లెక్క ప్రకారం ప్రతి తడికి 5 టీఎంసీల చొప్పున 15 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. కానీ ప్రాజెక్ట్‌లో తాగునీటి అవసరాలు, డెడ్‌స్టోరేజీ, ఆవిరి రూపంలో పోయే నీటి లెక్కలు పోను.. మిగిలేది 7.5 టీఎంసీలు మాత్రమే. దీంతో అటు పంటలకు, ఇటు తాగునీటి అవసరాలకు ఏ విధంగా నీటిని విడుదల చేస్తారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
భారీగా పూడిక..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో పేరుకు పేయిన పూడిక నీటి నిల్వపై ప్రభావం చూపుతోంది. 1994లో చేపట్టిన సర్వే ప్రకారం ప్రాజెక్ట్‌లో 90 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉందని, ఆ లెక్క ప్రకారమే ఎస్సారెస్పీ పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలుగా లెక్కిస్తున్నారు. 2014లో సర్వే చేపట్టిన ఏపీఈఆర్‌ఎల్ సంస్థ ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయినట్లు నివేదించింది. తాజాగా కేంద్ర జలవనరుల శాఖ కూడా ఇదే ప్రకటించింది. అంటే అధికారుల లెక్కల ప్రకారమే 10 టీఎంసీల నీరు తక్కువగా ఉంది. 1978లో హైడ్రోగ్రాఫిక్ ఆఫ్ ఇండియా సంస్థ సర్వే నిర్వహించి, ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 112 టీఎంసీలుగా పేర్కొంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి సర్వే చేపట్టి ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యాన్ని లెక్కించాలి.
కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్ట్‌లో పూడిక భారీగా పేరుకు పోయింది. 2004లో సర్వ చేపట్టిన ఓ సంస్థ ప్రాజెక్ట్ నీటిసామర్థ్యం 70 టీంసీలకు పడిపోయినట్లు ప్రకటించినా.. ఇరిగేషన్ అధికారులు దానిని కొట్టిపారేశారు. రీ సర్వే చేపట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 2013లో రీసర్వే చేపట్టి ప్రాజెక్ట్ నీటినిల్వ సామర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయినట్లు తేలింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితోనే ఏటా 0.8 టీఎంసీల పూడిక వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్ రికార్డులు తెలుపుతున్నాయి. ఈ లెక్కన 54 ఏళ్ల కాలంలో ప్రాజెక్ట్‌లో ఏమేరకు పూడిక చేరి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకరాష్ట్రంలోనైనా తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయగా ఉన్న ఎస్సారెస్పీ పూడికతీతపై దృష్టి సారించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
పంటలకు నీరు అందిస్తాం.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి యాసంగి పంటలకు నిర్దేశించిన ప్రకారం నీరు అందిస్తాం. తాగునీటి అవసరాలకు కేటాయించినంతగా నీరు నిల్వ ఉండక పోవచ్చు. కానీ సకాలంలో వర్షాలు వస్తే తాగునీటి అవసరాలకు కూడా నీరు సరిపోతుంది.
– రామారావు, ఎస్సారెస్పీ ఈఈ
Comments
Please login to add a commentAdd a comment