యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నాం | Prepare action plan for rabi: Collector | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నాం

Published Sat, Nov 4 2017 1:21 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

Prepare action plan for rabi: Collector

డిసెంబర్‌ 15 నుంచి రబీ యాక్షన్‌ప్లాన్‌ అమలు..
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆరునూరైనా రబీ రైతుల ఆరుతడి పంటలకు సాగునీరు అందించేందుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు డిసెంబర్‌ 15 నుంచి నీటి విడుదలపై రబీ యాక్షన్‌ప్లాన్‌ను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, సుల్తానాబాద్, హన్మకొండ డివిజన్లలో ఇంజినీరింగ్‌ అధికారులతో సమీ„ýక్షలు నిర్వహిస్తున్నాం. వీటి అనంతరం డిసెంబర్‌ 15 నుంచి నీటి విడుదల ప్లాన్‌ను అమలు చేస్తాం. 

రబీలో ఆరుతడి పంటలకే సాగునీరు..
రబీ కోసం నీటిని విడుదల చేసేందుకు డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి నివేదికలు సిద్ధం చేస్తాం. ఆరుతడి పంటల కోసం సాగునీరు అందించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటాం. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 55 టీఎంసీల నీరుంది. అలాగే ఎల్‌ఎండీలో 7 టీఎంసీలు ఉంది. ఎల్‌ఎండీ పైన 4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయం అయ్యింది. అందుకు సరిపడేలా సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు ఆదేశాల మేరకు నిజాంసాగర్‌ ద్వారా 15 టీఎంసీల సింగూరు జలాలను ఎస్సారెస్పీకి తరలిస్తున్నాం. రోజుకు 6000 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల జరుగుతోంది. ఎస్సారెస్పీ నుంచి ఎల్‌ఎండీకి 5 టీఎంసీలు నింపేందుకు రెండు రోజుల నుంచి 2000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశాం. 

మిషన్‌ భగీరథకు ప్రథమ ప్రాధాన్యం..
ఎస్సారెస్పీ నీటి విడుదల విషయంలో ప్రభుత్వం ప్రజలకు ఇంటింటికీ నల్లానీరు ఇచ్చేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ మేరకు ఎస్సారెస్పీలో 6.50 టీఎంసీలు, ఎల్‌ఎండీలో 6 టీఎంసీల నీరు నిల్వ ఉంచి, మిగతా నీటిని రబీ ఆరుతడి పంటలకు విడుదల చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ మేరకు కాల్వల ద్వారా నీటి తరలింపు నేపథ్యంలో ఏ మేరకు ప్రాజెక్టులకు నీరు చేరుతుందో చూసిన తర్వాత రబీ యాక్షన్‌ప్లాన్‌ను అమలు చేస్తాం. ఈ క్రమంలోనే పాత కరీంనగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో డివిజన్ల వారీగా ఇంజినీరింగ్‌ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు జరుపబోతున్నాం. 

ఎస్సారెస్పీ నీటి విడుదలపై ఇప్పటికే సమీక్ష..
ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింది ప్రజలకు సాగు, తాగునీరు అందించే విషయమై ఇప్పటికే సమీక్షలు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌ పాత కరీంనగర్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. మిషన్‌ భగీరథకు 12.50 టీఎంసీల నిల్వ చేయడంతో పాటు ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీల ద్వారా రబీలో ఆరుతడి పంటలకు సాగునీరందించేలా ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ఎస్సారెస్పీ ప్రాజెక్టు పరిధిలోని ప్రజలకు సాగు, తాగునీరు ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం.

ఆయకట్టుకు నీరందేలా తాత్కాలిక మరమ్మతులు..
నిజాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా సింగూరు మంజీరా జలాలను ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీలకు తరలించిన పిమ్మట ప్రణాళికబద్ధంగా రబీకి నీటి విడుదల చేయనున్నాం. ఆరుతడి పంటలు వేసే రైతులకు వారబందీ, ఆన్‌అండ్‌ఆఫ్‌ 4–5 దఫాలు నీటి సరఫరా చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడైనా కాల్వల్లో చెట్లు, పూడిక ఉంటే అందుబాటులో ఉండే కాంట్రాక్టర్లతో తాత్కాలిక మరమ్మతులు చేయిస్తాం. సరిగా నీటి సరఫరా అయ్యేలా చూస్తాం. 
– సాక్షిప్రతినిధి, కరీంనగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement