నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీలో బుధవారం నాటి పరిస్థితి ఇది.
బాల్కొండ: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ఎండిపోతోంది. ప్రాజెక్టు నీటిమట్టం క్రమక్రమంగా తగ్గిపోతోంది. గత ఖరీఫ్‌లో ఎగువ ప్రాంతాల నుంచి ఆశించిన రీతిలో వరద నీరు రాకపోవడంతో జలాశయంలోకి సగం వరకు కూడా నీరు చేరలేదు. అందుకే ఈసారి కాలువల ద్వారా పంటలకు సాగు నీరు కూడా విడుదల చేయలేదు.
ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 13.5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. కనిష్ట నీటిమట్టం (డెడ్ స్టోరేజీ) 5 టీఎంసీలు పోను మిగిలేది 8.5 టీఎంసీలు మాత్రమే. లీకేజీలు, ఆవిరికి పోను మిగిలేదెంతో తెలియక అధికారులే తలలు పట్టుకుంటున్నారు. ఈ పరిస్థితులలో తాగునీటికి కూడా తిప్పలు తప్పేలా లేవు. మరోవైపు ఎండలు తీవ్రతరమవుతుండడంతో ఆయకట్టు రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్, మే నెలలలో భానుడు భగభగ మండే సంకేతాలు ఉన్నాయి. అంటే నీరు ఇంకా భారీగా ఆవిరయ్యే ప్రమాదం ఉంది.
ఎగువ ప్రాంతంలోని మహారాష్ర్టలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు సైతం ఎస్సారెస్పీకి గండంగా మారింది. సు ప్రీంకోర్టు తీర్పు ప్రకారం గతేడాది నీ రు విడుదల చేసినా.. ఆశించిన మేరకు నీరు వచ్చి చేరలేదు. కోర్టు తీర్పు ప్రకా రం ఈ ఏడాది మే మొదటివారంలో బా బ్లీ నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉండగా, ‘మహా’ అధికారులు నీటిని విడుదల చేయలేదు. కాగా, ఎస్సారెస్పీ ఏటా 0.8 టీఎంసీల పూడిక చేరుతుందని రికార్డులు తె లుపుతున్నాయి.
1994లో చేపట్టిన సర్వే ప్రకా రం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 1,091 అడుగులు, 90 టీఎంసీలు ఉందని నమోదు చేశారు. 2014లో జరిగిన సర్వే అనంతరం అది 79 టీఎంసీలకు పడిపోయిందని తేల్చారు. అంటే 11 టీఎంసీల మేరకు తగ్గిందన్నమాట. ఇపుడు జలాశయం దాదాపు కనిష్ట నీటి మట్టానికి చేరుతోంది. ఇదంతా పూడిక వల్లేనని, జాగ్రత్త పడకపోతే ముప్పు తప్పదని నిపుణులు అంటున్నారు.