కాల్వలతో కాదు.. పైపులతో పారిద్దాం | Measures To Irrigate Every Acre Through Pipeline System In Kaleswaram | Sakshi
Sakshi News home page

కాల్వలతో కాదు.. పైపులతో పారిద్దాం

Published Sun, Feb 21 2021 1:52 AM | Last Updated on Sun, Feb 21 2021 11:11 AM

Measures To Irrigate Every Acre Through Pipeline System In Kaleswaram - Sakshi

కొనసాగుతున్న ప్రధాన పైప్‌లైన్‌ పనులు

ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు కాల్వల ద్వారా నీరందుతుంది. ప్రధాన కాల్వల నుంచి పిల్ల కాల్వల ద్వారా సాగునీరు రైతుల పొలాలకు చేరుతుంది. అయితే ముందుగా తమ క్షేత్రానికి నీరు అందాలనే ఆత్రంలో పిల్ల కాల్వలకు, గట్లకు గండికొట్టడం ద్వారా నీళ్లు మళ్లిస్తుంటారు. ఫలితంగా రైతుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటాయి. పైపెచ్చు కాల్వల ద్వారా సాగునీటిని అందించే క్రమంలో దాదాపు 30 శాతం వరకు నీరు వృథా అవుతుంది. అలాకాకుండా మిషన్‌ భగీరథతో ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరందినట్లుగా... పైపుల ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరందితే ఎలాగుంటుంది? అద్భుతం కదూ! నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని 2 లక్షల ఎకరాలకు ఇలాగే పైపుల ద్వారా నీరందనుంది. పంటకు నీరు పెట్టాలనుకుంటే చేనుకు సమీపంలోని వాల్వ్‌ను స్వయంగా రైతులు తిప్పుకోవచ్చు. ఈ రెండు లక్షల ఎకరాల్లో ప్రధానంగా వరి సాగవుతోంది. పైపుల ద్వారా సాగునీరు అందడం వల్ల పంట మార్పిడికి అవకాశం ఏర్పడనుంది. రైతులు వరికి బదులు అరుతడి, వాణిజ్య పంటలు వేసుకునే వెసులుబాటు ఉంటుంది. సాగునీటిని తీసుకొచ్చే పైపులకు డ్రిప్‌ ఇరిగేషన్‌ సిస్టమ్‌ను అనుసంధానిస్తే సరిపోతుంది. పైపుల ద్వారా సరఫరా కాబట్టి నీటి వృథా గణనీయంగా తగ్గుతుంది. దీనికి డ్రిప్‌ తోడైతే... ప్రతి చుక్కా సద్వినియోగం కానుంది. చివరి ఆయకట్టును దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పైపులైన్‌ ద్వారా నీటి సరఫరా వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ–21 కింద చేపట్టిన ఈ పైప్‌లైన్‌ వ్యవస్థ నిర్మాణాలు యుధ్ద ప్రాతిపదికన జరుగుతుండగా, ఈ వానాకాలంలోనే తొలిసారి దీనికింద 20 వేల ఎకరాలకు ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు పూర్తి చేస్తున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఫోర్‌షోర్‌ నుంచి నీటిని తీసుకుంటూ నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా కాళేశ్వరంలో ప్యాకేజీ–20, 21, 21(ఎ) పనులు చేపట్టారు. ప్యాకేజీ–20లో బినోల సమీపంలోని ఎస్సారెస్పీ ఫోర్‌షోర్‌ నుంచి అప్రోచ్‌ చానల్, 17.82 కిలోమీటర్ల టన్నెల్, 30 మెగావాట్ల సామర్థ్యంతో  ఉన్న 3 మోటార్లతో సారంగాపూర్‌ వద్ద పంప్‌హౌస్‌ నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. రూ.935 కోట్లతో చేపట్టిన ఈ పనులు 85 శాతం వరకు పూర్తయ్యాయి. సారంగాపూర్‌ పంప్‌హౌస్‌ నుంచి నిజాంసాగర్‌ కెనాల్‌కు నీటిని ఎత్తిపోసి అక్కడి నుంచి రెండు మార్గాల్లో పైప్‌లైన్ల ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా పనులు చేపట్టారు. సాధారణంగా కాల్వల నిర్మాణం చేపడితే 7 వేల నుంచి 8 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంటుంది. అదే పైప్‌లై¯Œ వ్యవస్థ అయితే భూమిలో ఒకటిన్నర మీటర్ల కింద భూగర్భాన పైప్‌లైన్‌ ఏర్పాటు చేస్తారు. తద్వారా పైన యథావిధిగా వ్యవసాయం చేసుకునే అవకాశముంది. భూసేకరణ తప్పుతుంది. ఇక కాల్వల ద్వారా నీటి వృథా దాదాపు 30 శాతం వరకు ఉండగా... పైప్‌లై¯న్‌తో వృథా అతి తక్కువ. దీంతోపాటు పైప్‌లై¯న్‌తో చివరి ఆయకట్టు వరకు నీటిని అందించవచ్చు. నిర్ణీత ఆయకట్టులో రెండో పంటకు సైతం నీరు అందించవచ్చనే అంచనాతో ఈ పనులు చేపట్టారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అమలవుతున్న ఈ వ్యవస్థను మోడల్‌గా తీసుకొని రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టు కింద చేపట్టారు. 


పంప్‌హౌస్‌లో సిద్ధమైన మోటార్లు 

పైప్‌లైన్‌ నిర్మాణ పనులు ఇలా...
ఎస్సారెస్పీ ఫోర్‌షోర్‌ నుంచి నిజాంసాగర్‌ కెనాల్‌లోకి చేరే నీటిని రెండు భాగాలుగా విభజించి నీటిని తరలించేలా పైప్‌లైన్‌ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఒక పైప్‌లైన్‌ వ్యవస్థను మెట్‌పల్లి సెగ్మెంట్‌గా, మరో పైప్‌లైన్‌ వ్యవస్థను గడ్కోల్‌ సెగ్మెంట్‌గా విభజించి పనులు చేపట్టారు. ఫోర్‌షోర్‌ నుంచి నీటిని తరలించే క్రమంలో నిజాంసాగర్‌ కెనాల్‌ను 23.10 కిలోమీటర్ల మేర వెడల్పు చేసే పనులు, గడ్కోల్‌ సెగ్మెంట్‌కు నీటిని సరఫరా చేసే అప్రోచ్‌ చానల్, టన్నెల్, పంప్‌హౌస్‌ నిర్మాణ పనులను ప్యాకేజీ–21 కింద చేపట్టారు. ఈ ప్యాకేజీని మొత్తంగా రూ.807 కోట్లతో చేపట్టగా, రూ.372 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి కావాల్సి ఉంది. అయినప్పటికీ లభ్యత నీటిని తీసుకుంటూ మెట్‌పల్లి సెగ్మెంట్‌లో కొంత భాగానికి నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్‌పల్లి సెగ్మెంట్‌లో 1.15 లక్షల ఎకరాలు (11.7 టీఎంసీ), గడ్కోల్‌ సెగ్మెంట్‌లో 85 వేల ఎకరాలకు(8 టీఎంసీ) నీరందించేలా ప్యాకేజీ–21(ఎ) కింద పనులను రూ. 2,950.31 కోట్లతో చేపట్టారు. ఇందులో ఇప్పటికే 1,430కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. తొలి ప్రాధాన్యతగా మెట్‌పల్లి సెగ్మెంట్‌ పరిధిలోని ప్రధాన పైప్‌లైన్‌ వ్యవస్థను పూర్తి చేసి దీనికింద ఈ వానాకాలంలోనే 20 వేల ఎకరాలకు పైపుల ద్వారా నీటిని అందించేలా పనులు జరుగుతున్నాయి. మిగతా ఆయకట్టుకు వచ్చే ఏడాది ఖరీఫ్‌ నాటికి నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గడ్కోల్‌ సెగ్మెంట్‌ పరిధిలో 3.5 టీఎంసీల సామర్థ్యంతో  రిజర్వాయర్‌ నిర్మాణం చేయాల్సి ఉంది. దీనికింద భూసేకరణ సమస్యలు ఉండటంతో దీని పనులను రెండో ప్రాధాన్యం కింద పెట్టుకున్నారు.

నీటి తరలింపు ఇలా...
తొలి ప్రాధాన్యంగా తీసుకున్న మెట్‌పల్లి సెగ్మెంట్‌ కింద 1.15 లక్షల ఎకరాల్లో 20 వేల ఎకరాలకు ఈ వానాకాలంలో నీటి తరలించేలా ప్రస్తుతం పైప్‌లైన్‌ వ్యవస్థ సిధ్దమైంది. నిజాంసాగర్‌ కాల్వల నుంచి వచ్చే 650 క్యూసెక్కుల నీటిని పైప్‌లైన్‌లోకి తోసేలా మెంట్రాజ్‌పల్లి (డిచ్‌పల్లి మండలం)లో పంప్‌హౌస్‌ ఏర్పాటు చేస్తున్నారు. 2.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 10 మోటార్ల ద్వారా నీటిని 92 మీటర్ల మేర లిఫ్టు చేసి నిర్ణీత నీటిని 3 మీటర్ల డయాతో ఉండే ఒకే ఒక్క పెద్ద ఎంఎస్‌ పైప్‌లోకి తరలించేలా పంప్‌హౌస్‌ను నిర్మిస్తున్నారు. ఈ పంప్‌హౌస్‌ పనులు 90 శాతం పూర్తయ్యాయి. దీనికి విద్యుత్‌ను అందించే సబ్‌స్టేషన్‌ నిర్మాణం పనులు వేగిరం చేశారు. ఈ పైప్‌లైన్‌లోకి నీటిని తరలించే క్రమంలో ఎలాంటి చెత్తాచెదారం రాకుండా మూడు దశల్లో నీటిని ఫిల్టర్‌ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధాన పైప్‌లైన్‌ నుంచి నీటిని వివిధ జోన్‌ల కింది ఆయకట్టుకు తరలించేలా మరో చిన్న పైప్‌లైన్‌ వ్యవస్థ, ఈ వ్యవస్థ నుంచి జోన్‌ల పరిధిలోని ఆయకట్టుకు నీటిని అందించేలా మరో పిల్ల పైప్‌లైన్‌ వ్యవస్థను మూడు రకాల పైపులతో సిధ్దం చేస్తున్నారు.


పైప్‌లైన్‌ వ్యవస్థలో భాగంగా నిర్మిస్తున్న మెంట్‌రాజ్‌పల్లి పంప్‌హౌస్‌ 

ప్రధాన పైప్‌లైన్‌ 3 మీటర్ల నుంచి ఒక మీటర్‌ వరకు ఉండే ఎంఎస్‌ పైపుల వ్యవస్థ కాగా, ఈ పైప్‌లైన్‌ నుంచి నీటిని 900 మిల్లీమీటర్ల నుంచి 350 మిల్లీమీటర్లు ఉండే డీఐ పైపులు, అటునుంచి 315–40 మిల్లీమీటర్లు ఉండే హెచ్‌డీపీఈ పైపుల ద్వారా నిర్ణీత ఆయకట్టుకు నీటిని అందిస్తారు. మెట్‌పల్లి సెగ్మెంట్‌ పరిధిలో 88.17 కిలోమీటర్ల మేర ఎంఎస్‌ పైపుల నిర్మాణం చేయాల్సి ఉండగా, ఇందులో 75.37 కిలోమీటర్ల వ్యవస్థ పూర్తయింది. 192 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటరీ పైప్‌లైన్‌లో 114 కిలోమీటర్లు, 3,319 కిలోమీటర్ల హెచ్‌డీపీఈలో 1,052 కిలోమీటర్లు మేర పూర్తి చేశారు. పెద్ద పైపులైన్‌ నుంచి డీఐ, హెచ్‌డీపీఈ పైపులకు నీటిని తరలించే క్రమంలో ఓఎంఎస్‌ చాంబర్, డిస్ట్రిబ్యూటరీ చాంబర్స్‌ అని ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారానే ఎంతమేర నీటిని తరలించాలి, ఏ ప్రాంతానికి నీటిని తరలించాలి అన్నది నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే 20 కిలోమీటర్ల మేర నీటిని తరలించేలా పైప్‌లైన్‌ వ్యవస్థ 95 శాతం పూర్తవగా, మార్చి చివరికి 100 శాతం పనులు పూర్తి చేయనున్నారు. 

కొన్ని అడ్డంకులు...
ఈ పైప్‌లైన్‌ పనులకు ప్రధానంగా భూసేకరణ లేకున్నా... రైతులు సాగు చేస్తున్న భూముల్లోంచే పైపులు వేయాల్సి ఉంది. భూమిని తవ్వి 1.20 మీటర్ల దిగువన పైపులు వేయాలి. ఆ లైన్లు వెళుతున్న మార్గాలన్నీ ప్రస్తుతం సాగులో ఉన్న భూములే కావడంతో పనులకు రైతులు అడ్డుపడుతున్నారు. వ్యవసాయ పనులు సాగని రెండు నుంచి మూడు నెలల వ్యవధిలో మాత్రమే పైపులు వేయాల్సి వస్తోంది. దీంతో ఈ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. పైపులు వెళ్లే భూములకు నష్టపరిహారం చెల్లిస్తే యాసంగి సీజన్‌లో పనులు పూర్తి చేస్తామని ఏజెన్సీ సహా ప్రజాప్రతినిధులు కోరినా ప్రభుత్వం దీనికి అంగీకరించకపోవడంతో రైతుల సమ్మతి దొరికిన చోటే పనులు కొనసాగించాల్సి వస్తోంది. దీనికి తోడు ఓఎంఎస్‌ ఛాంబర్స్, డిస్ట్రిబ్యూటరీ ఛాంబర్స్‌ నిర్మాణాలకు గుంట కన్నా తక్కువ భూమే అవసరమవుతున్నా, దాన్ని ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. ఇక రెండు చోట్ల రైల్వే క్రాసింగ్, నేషనల్‌ హైవే క్రాసింగ్‌లు వెళుతున్నాయి. మరోవైపు నిజాంసాగర్‌ కాల్వల వెడల్పుకు దాని పరిధిలోని భూ ఆక్రమణలు, పంటల సాగు ఇబ్బందిగా పరిణమిస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రస్తుతం పనులు కొనసాగిస్తున్నారు. 

ఈ చాంబర్‌లు ఎలా పనిచేస్తాయంటే..
చివరి ఆయకట్టు వరకు నీటిని తరలించేలా ఓఎంఎస్‌ (ఔట్‌లెట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) చాంబర్‌ ఏర్పాటు చేస్తుండగా, ఈ ఛాంబర్‌లోకి వచ్చిన నీటిని 3 నుంచి 6 ఔట్‌లెట్‌ పైపుల ద్వారా బయటకు పంపించేలా ఏర్పాట్లుంటాయి. ఔట్‌లెట్‌ పైపుల ద్వారా నీటిని తరలించే వాల్వ్‌లను పూర్తిగా సాంకేతిక సహాయంతోనే ఆపరేట్‌ చేసేలా దీన్ని తీర్చిదిద్దారు. ఎంతమేర నీటిని తరలిస్తున్నారన్నది తెలుసుకునేలా దీనిలో వాటర్‌ మీటర్, ప్రెషర్‌ మీటర్‌లు అమర్చారు. దీనికి అవసరమయ్యే విద్యుత్‌కై సోలార్‌ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం నిర్ణయించిన 20 వేల ఎకరాల పరిధిలోనే 1,892 ఓఎంఎస్‌ చాంబర్స్‌ నిర్మాణం పూర్తయింది. ఇక్కడి నుంచి ఔట్‌లెట్‌ ద్వారా తరలించే ఒక్కో పైప్‌లైన్‌కు దిగువన ప్రతి 3 ఎకరాలకు నీటిని అందించేలా మళ్లీ 5–7 వరకు చిన్న పైపుల ద్వారా నీటిని తరలించేందుకు డిస్ట్రిబ్యూటరీ చాంబర్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఛాంబర్స్‌లో ఉండే పైపులన్నింటికీ వాల్వ్‌లను బిగించారు. అవసరమైతేనే నీటిని వాడుకునేలా ఈ వాల్వ్‌లు ఉపయోగపడతాయి. వాటిని రైతులే ఆపరేట్‌ చేసుకుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement